సోమవారం సాయంత్రం ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల అవుతున్న నీరు
సాక్షి, అమరావతి/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి సోమవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,16,834 క్యూసెక్కులు చేరుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688, కల్వకుర్తి ద్వారా 1,222 క్యూసెక్కులు తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీలను నిల్వ చేస్తూ.. పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,76,670 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 30,674, ఎడమ కేంద్రం ద్వారా 31,874 క్యూసెక్కులు దిగువకు వదలుతున్నారు.
► నాగార్జునసాగర్‌లోకి 3,41,072 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 8,604, ఎడమ కాలువకు 8,541, ఏఎమ్మార్పీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో 585.4 అడుగుల్లో 298.58 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,485, 26 గేట్ల ద్వారా 2,88,382 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
► పులిచింతల ప్రాజెక్టులోకి 2,83,921 క్యూసెక్కులు చేరుతుండగా గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 2,58,838 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ప్రసుత్తం పులిచింతలలో 45.77 టీఎంసీలకు గాను 35.90 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు.
► ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,85,055 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 14,955 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 2,70,100 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు.
► పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలోకి చేరుతున్న వరద తగ్గుతోంది. దాంతో మంగళవారం నుంచి శ్రీశైలంలోకి వచ్చే వరద తగ్గనుంది.
గోదావరిలో కొద్దిగా తగ్గిన వరద
గోదావరిలో వరద నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొంతమేర తగ్గింది. సోమవారం రాత్రి 8 గంటలకు కాటన్ బ్యారేజ్ వద్ద 14.20 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజ్ నుంచి 13,54,329క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 10,500 క్యూసెక్కులు వదిలారు. భద్రాచలం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గింది.
వంశధార, నాగావళి పోటాపోటీ
ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. గొట్టా బ్యారేజ్‌లోకి 82,575 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ప్రాజెక్టు ఆయకట్టుకు 2,500 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 80,075 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తోటపల్లి బ్యారేజ్ నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 28 వేల క్యూసెక్కుల నాగావళి ప్రవాహం చేరుతుండగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment