
సాక్షి, అమరావతి: ఈ ఏడాది కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవనున్నాయి. గత సంవత్సరానికంటే మెరుగ్గా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతు పవనాలు ముందే దేశంలోకి ప్రవేశిస్తుండటం, అవి బలంగా ఉండడంతో ఈ సీజన్‌లో వర్షాలు బాగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారానికి నైరుతి రుతు పవనాలు ఈశాన్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి.
ఈ నెల 27వ తేదీకి కేరళను తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత వారంలోనే.. అంటే జూన్ 4, 5కల్లా రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో కేరళను తాకుతాయి. గత ఏడాది జూన్ 3న కేరళలో ప్రవేశించి 10న ఏపీలోకి వచ్చాయి. ఈ సంవత్సరం ఇంకా ముందే వస్తుండటం వ్యవసాయానికి అనుకూలమని భావిస్తున్నారు. మండుతున్న ఎండల నుంచి కూడా ఉపశమనం లభించనుంది.
అసని తుపానుతో అనుకూల పరిస్థితులు
ఇటీవల వచ్చిన అసని తుపాను వల్ల వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. భూమధ్య రేఖ వద్ద ఉండే గాలులు, ఉత్తర, పశ్చిమ భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడం, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే గాలులు బలంగా ఉండడం వంటి పలు అంశాలు నైరుతి రుతు పవనాలకు అనుకూలంగా మారాయి. దీనికి సముద్రంలో లానినో పరిస్థితులు కూడా కలిసి వచ్చింది. మామూలుగా మే 22కి దక్షిణ అండమాన్, ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లోకి నైరుతి రుతు పవనాలు వస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న అనుకూల పరిస్థితుల వల్ల 15వ తేదీకే అవి అక్కడకు చేరాయి. అక్కడి నుంచి కేరళకు తర్వాత ఏపీకి రానున్నాయి.
ఎండలు కొద్ది రోజులే
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో వారం, పది రోజులు మాత్రమే కొనసాగుతాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. జూన్ మొదటి వారం నుంచి వాతావరణం చల్లబడి, వర్షాలు కురిసేందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి.