Cyclone Asani
-
ఎరుపెక్కుతున్న టమాటా.. కిలో రూ.100
సాక్షి, న్యూఢిల్లీ: టమాటా ఎరుపెక్కుతోంది. సరఫరా తగ్గడంతో పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు కొండెక్కుతున్నాయి. కేరళలో రూ.100 మార్కును చేరింది. ఒడిశాలో రూ.90, కర్నాటకలో రూ.70, ఏపీ, తెలంగాణల్లోనూ రూ.60కి పైగా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక చెప్తోంది. తీవ్ర ఎండలకు వేడిగాలులు తోడవడంతో టమాటా ఉత్పత్తి బాగా పడిపోయింది. టమాటా ఉత్పత్తిలో ముందున్న ఏపీ, ఒడిశాల్లో అసని తుఫాన్‌తో పంట బాగా దెబ్బ తింది. ఏపీలో విశాఖ, కర్నూలు, తిరుపతిల్లో కిలో రూ.50–70 పలుకుతున్నట్టు వినియోగదారుల శాఖ నిత్యావసర సరుకుల ధరల డేటా పేర్కొంది. -
సమృద్ధిగా వర్షాలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవనున్నాయి. గత సంవత్సరానికంటే మెరుగ్గా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతు పవనాలు ముందే దేశంలోకి ప్రవేశిస్తుండటం, అవి బలంగా ఉండడంతో ఈ సీజన్లో వర్షాలు బాగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారానికి నైరుతి రుతు పవనాలు ఈశాన్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి. ఈ నెల 27వ తేదీకి కేరళను తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత వారంలోనే.. అంటే జూన్ 4, 5కల్లా రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో కేరళను తాకుతాయి. గత ఏడాది జూన్ 3న కేరళలో ప్రవేశించి 10న ఏపీలోకి వచ్చాయి. ఈ సంవత్సరం ఇంకా ముందే వస్తుండటం వ్యవసాయానికి అనుకూలమని భావిస్తున్నారు. మండుతున్న ఎండల నుంచి కూడా ఉపశమనం లభించనుంది. అసని తుపానుతో అనుకూల పరిస్థితులు ఇటీవల వచ్చిన అసని తుపాను వల్ల వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. భూమధ్య రేఖ వద్ద ఉండే గాలులు, ఉత్తర, పశ్చిమ భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడం, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే గాలులు బలంగా ఉండడం వంటి పలు అంశాలు నైరుతి రుతు పవనాలకు అనుకూలంగా మారాయి. దీనికి సముద్రంలో లానినో పరిస్థితులు కూడా కలిసి వచ్చింది. మామూలుగా మే 22కి దక్షిణ అండమాన్, ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లోకి నైరుతి రుతు పవనాలు వస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న అనుకూల పరిస్థితుల వల్ల 15వ తేదీకే అవి అక్కడకు చేరాయి. అక్కడి నుంచి కేరళకు తర్వాత ఏపీకి రానున్నాయి. ఎండలు కొద్ది రోజులే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో వారం, పది రోజులు మాత్రమే కొనసాగుతాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. జూన్ మొదటి వారం నుంచి వాతావరణం చల్లబడి, వర్షాలు కురిసేందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. -
ముప్పు తప్పినట్లే.. తీరం దాటిన అసని తుపాను
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/నెట్ వర్క్: ఎప్పటికప్పుడు దిశను మార్చుకుంటూ వణికించిన అసని తుపాను బలహీనపడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. బుధవారం ఉదయానికి తీవ్ర తుపానుగా ఉన్న అసని తొలుత తుపానుగా, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతూ బుధవారం సాయంత్రం మచిలీపట్నం సమీపంలోని కోన వద్ద తీరాన్ని దాటింది. తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చదవండి: ‘అసని’పై అప్రమత్తం ప్రస్తుతం ఇది తీరం వెంబడి నరసాపురం, అమలాపురం మీదుగా కదులుతూ గురువారం ఉదయానికి వాయుగుండంగా మారి యానాం దగ్గర మళ్లీ సముద్రంలోకి వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్రంలోకి వెళ్లి ఇంకా బలహీనపడుతుందని అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని, మత్స్యకార గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలలు సాధారణం కంటే అరమీటరు ఎక్కువ ఎత్తుకు ఎగసిపడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తుపాను ప్రభావంతో గురువారం కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. అంచనాలకు అందని అసని అండమాన్ దీవుల నుంచి వేగంగా ఏపీ తీరానికి దూసుకొచ్చిన అసని తుపాను గమనం వాతావరణ శాఖ అంచనాలకు అందలేదు. తొలుత ఉత్తరాంధ్ర వైపు పయనించి ఒడిశా దిశగా బంగ్లాదేశ్ వైపు వెళుతుందని భావించారు. కానీ కాకినాడ–మచిలీపట్నం వైపు మళ్లింది. బుధవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాల మధ్య తీరం దాటుతుందనే అంచనాలు కూడా తప్పాయి. మచిలీపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలోనే కేంద్రీకృతమై నెమ్మదిగా అక్కడే బలహీనపడింది. ఒక దశలో కేవలం 3 కిలోమీటర్ల వేగంతో మాత్రమే మచిలీపట్నం వైపు కదిలింది. వేసవిలో అరుదుగా వచ్చిన తుపాను కావడంతో దాని గమనాన్ని అంచనా వేయలేకపోయినట్లు చెబుతున్నారు. విశాఖలో ఎగిసిపడుతున్న సముద్రపు అలలు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, గాలులు అనూహ్యంగా వచ్చిన అసని తుపాను అనూహ్యంగానే బలహీనపడడంతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. దీంతో రాష్ట్రంలో వర్షాలు, గాలుల ప్రభావం తగ్గింది. తీరం వెంబడి గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సగటున 4.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లాలో సగటున 15 మిల్లీమీటర్ల వర్షం పడింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో అత్యధికంగా 6 సెంటీమీటర్లు, గుడ్లూరులో 5.3, అనకాపల్లి జిల్లా మునగపాకలో 5.1, సత్యసాయి జిల్లా కేశపురంలో 4.3, విజయనగరం జిల్లా బొందపల్లిలో 4.1, అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబరాడలో 4, బాపట్ల జిల్లా నూజెల్లపల్లిలో 3.9, అనకాపల్లి జిల్లా చీడికాడ, సత్యసాయి జిల్లా ధర్మవరంలో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో సగటున 9.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సగటున అనకాపల్లి జిల్లాలో 3.1 సెంటీమీటర్లు, శ్రీకాకుళంలో 2.1, నెల్లూరులో 2, ప్రకాశంలో 1.8, విజయనగరంలో 1.7, విశాఖలో 1.6, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1.5, కోనసీమలో 1.5, కాకినాడ, బాపట్ల జిల్లాల్లో 1.3, తిరుపతి జిల్లాలో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లు అసని తుపాను నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ నంబర్లు సిద్ధం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. సహాయం కావాల్సిన వారు హెల్ప్‌లైన్ నెంబర్లు 1070, 08645 246600కి ఫోన్ చేయాలని సూచించారు. కోతకు గురైన ఉప్పాడ తీరం కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో వర్షం కురిసింది. కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 30 మీటర్లు ముందుకు చొచ్చుకురావడంతో ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డును మూసివేశారు. ఉప్పాడ గ్రామం రూపును కోల్పోతోంది. ఉప్పాడ తీరప్రాంతం కోతకు గురైంది. మత్స్యకారుల ఇళ్లల్లోకి నీరు చొచ్చుకువచ్చింది. సముద్రపు కెరటాల ఉధృతికి ఉప్పాడలో ఇళ్లు, బీచ్ రోడ్డు ధ్వంసమయ్యాయి. కోనసీమ, కాకినాడ, రాజమండ్రి జిల్లాల్లో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. 31 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రజలను శిబిరాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించారు. ఇదిలా ఉండగా తుపాను కారణంగా పలుప్రాంతాల్లో పంటలకు, పండ్ల తోటలకు వాటిల్లిన నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేస్తున్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుమ్మలపల్లి–నర్రావారిపాలెం మధ్య పొన్నాలకాలువ పొంగడంతో రాకపోకలు కూడా నిలిచిపోయాయి. తాడేపల్లి డోలాస్‌నగర్ వద్ద రహదారి వెంబడి చెట్టుకొమ్మ విరిగి ఆటోపై పడడంతో ఆటో పూర్తిగా దెబ్బతింది. ఇమీస్ కంపెనీ వద్ద వెళ్తున్న లారీ మీద భారీ వృక్షం విరిగిపడింది. కాగా, తుపాను గాలులకు కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగరువు శివారు అప్పన్నపేటలో ఇల్లు కూలి వ్యవసాయ కూలీ వాడపల్లి శ్రీనివాసరావు (43) మృతిచెందాడు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి విశ్వరూప్ ప్రమాదస్థలాన్ని బుధవారం పరిశీలించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. విమాన సర్వీస్‌లు రద్దు తుపాను ప్రభావంతో బుధవారం గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన 16 విమాన సర్వీస్‌లను రద్దు చేశారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రావాల్సిన 9 విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
‘అసని’పై అప్రమత్తం
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఖాళీ చేయించి.. సహాయ, పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి భోజనం, వసతితో సహా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారు ఇంటికి వెళ్లేటప్పుడు ఒక్కొక్కరికి రూ.1,000, కుటుంబానికి రూ.2 వేలు చొప్పున సాయం అందించాలి. ఈ సొమ్ము వారి ఇళ్లు బాగు చేసుకోవడానికి, తక్షణ అవసరాలకు ఉపయోగపడుతుంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాల్లో ఈ ఏర్పాట్లు చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అసని తుపాను నేపథ్యంలో జిల్లాల అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు కోస్తా తీర ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఉదయం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒక్క మరణం కూడా సంభవించకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే అవసరమైన నిధులు విడుదల చేశామని, అవసరమైన మేర ఖర్చు చేసుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో వెనుకాడవద్దని స్పష్టం చేశారు. బాధితులకు పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. తీర ప్రాంతాలపై దృష్టి సారించాలి ► నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుంది. ఈ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా కోస్తా తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలి. ► కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి భోజనంతో పాటు అవసరమైన సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇప్పటికే 454 చోట్ల సహాయ, పునరావాస కేంద్రాలను గుర్తించినప్పటికీ, ఇంకా అవసరమైన చోట్ల మరిన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నిత్యావసరాలను సిద్ధం చేసుకోండి ► సహాయ, పునరావాసానికి ఉపయోగపడే డీజిల్ జనరేటర్లు, జేసీబీల వంటి వాటిని సిద్ధం చేసుకోవాలి. బియ్యం, పప్పులు, వంట నూనెలు తదితర నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రభుత్వ విభాగాల వారీగా సహాయ చర్యల కోసం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. ► ప్రభుత్వ శాఖలు పరస్పర సహకారంతో పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలుల వేగం గంటకు 30 నుంచి 80 కిలోమీటర్లు వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతాయన్న సూచనలు కూడా ఉన్నాయి. ► ఈ దృష్ట్యా కలెక్టర్లు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. త్వరితగతిన సహాయ పునరావాస చర్యలు చేపట్టాలి. పునరావాస కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ పునరావాస కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి. తీరం దాటే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి ► కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ ప్రాంతాలకు మధ్యాహ్నానికి (బుధవారం) తుపాను తాకే అవకాశం ఉంది. సాయంత్రానికి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలపైనా ప్రభావం చూపిస్తుంది. రాత్రికి తీరం దాటి బలహీనపడే సమయంలో అధికారులందరూ మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. బాధితులకు హెల్ప్ లైన్ ఏర్పాటు పక్కాగా ఉండాలి. ఉప్పాడ రోడ్డుకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలి. (ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు.) ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, హోం, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి తానేటి వనిత, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రవాణా, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అంబేడ్కర్ పాల్గొన్నారు. -
విజయవాడపై ‘అసని’ గర్జన (ఫోటోలు)
-
హై అలర్ట్‌గా ఉండాలి.. సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు ప్రభుత్వం పంపింది. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో హై అలర్ట్‌గా ఉండాలన్నారు. ఇప్పటికే మీకు నిధులు ఇచ్చామని, తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని’’ కలెక్టర్లు, అధికారులకు సీఎం సూచించారు. చదవండి: అసని తుపాను ఎఫెక్ట్.. 37 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే.. ‘‘కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశం. అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. అవసరమైన చోట సహాయపునరావాస శిబిరాలను తెరవండి. సహాయ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఇవ్వండి. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయండి. జనరేటర్లు, జేసీబీలు.. ఇవన్నీకూడా సిద్ధంచేసుకోండి. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని’’ సీఎం అన్నారు. ‘‘తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలి. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు. సెంట్రల్ హెల్ప్ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలి. వచ్చే కాల్స్ పట్ల వెంటనే స్పందించండి. ఈ నంబర్లకు బాగా ప్రచారం కల్పించాలని’’ సీఎం పేర్కొన్నారు. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. అసని తుపాను ప్రభావంతో విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపై అసని తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు పలువురు మంత్రులు అసని తుపాను ప్రభారంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ‘అసని’ తుపాను తెచ్చిన ‘బంగారు’ మందిరం కంట్రోల్ రూమ్ నంబర్లు కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18004253077 కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 0884-2368100 శ్రీకాకుళం: 08942-240557 తూర్పు గోదావరి: 8885425365 ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18002331077 విజయనగరం: 08922-236947 పార్వతీపురం మన్యం: 7286881293 మచిలీపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252572 మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252486 బాపట్ల కంట్రోల్ రూమ్ నంబర్: 8712655878, 8712655881 ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 90103 13920 విశాఖ: 0891-2590100,102 అనకాపల్లి: 7730939383 -
‘అసని’ తుపాను తెచ్చిన ‘బంగారు’ మందిరం
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. తుపాను కారణంగా ఇతర దేశానికి చెందిన ఓ మందిరం తీరానికి కొట్టుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఈ రథాన్ని బంగారు వర్ణం కలిగిన రథంగా స్థానికులు భావిస్తున్నారు. ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో లిఖించి వుంది. చదవండి: అసని తుపాను ఎఫెక్ట్.. 37 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే.. ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకూ తిత్లీ వంటి పెద్ద తుపానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన రథాలు సముద్రంలో కొట్టుకురాలేదని స్థానికులు అన్నారు. ఆ రథం మయన్మార్ దేశానిది.. సముద్ర తీరానికి చేరిన స్వర్ణరథం మయన్మార్ దేశానికి చెందినదిగా గుర్తించారు. బంగారు వర్ణంతో కూడిన రథంపై విదేశీ భాష ఉండడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. బుధవారం తహసీల్దార్ చలమయ్య, భావనపాడు మెరైన్ సీఐ దేవుళ్లు, నౌపడ ఎస్ఐ ఐ.సాయికుమార్ తీరానికి చేరిన రథాన్ని పరిశీలించారు. రథంపై ఉన్న భాషను గూగుల్‌లో శోధించగా మయన్మార్ దేశం భాషగా తేలడంతో రథం మయన్మార్‌దిగా తేలింది. సముద్రంలో కొట్టుకుని వచ్చింది తప్ప ఇందులో విశేషం ఏమీ లేదని మెరైన్ సీఐ చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అసని తుపాను ఎఫెక్ట్.. 37 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
South Central Railway Cancelled Trains List, సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తీవ్ర తుపాను బలహీన పడి తుపానుగా కేంద్రీకృతమైంది. దిశను మార్చుకుని నరసాపురం, కాకినాడ, విశాఖకు సమాంతరంగా సముద్రంలో ప్రయాణం చేయనుంది. దీని ప్రభావం ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చదవండి: తుపాను అలజడి: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం తుపాను ప్రభావంతో 37 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే పలు రైళ్ల రద్దు అయ్యాయి. విజయవాడ-మచిలీపట్నం, విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్- నిడదవోలు, విజయవాడ నర్సాపూర్, నిడదవోలు-భీమవరం జంక్షన్, మచిలీపట్నం-గుడివాడ, భీమవరం జంక్షన్-మచిలీపట్నం, భీమవరం-విజయవాడ, గుంటూర్-నర్సాపూర్, గుడివాడ-మచిలీపట్నం, కాకినాడ పోర్ట్-విజయవాడ మార్గాల్లో వెళ్లే డెము, మెము సర్వీసులు రద్దు అయ్యాయి. షెడ్యూల్ మార్పు.. నర్సాపూర్-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు (12787)ని షెడ్యూల్‌ని మార్చారు. నర్సాపురం నుంచి బుధవారం 11.05 గంటలకు బయలుదేరాల్సిన రైలు మధ్యాహ్నం 2.05 గంటలకు వెళ్లనుంది. బిలాస్పూర్ తిరుపతి, కాకినాడ పోర్ట్-చెంగల్పట్టు రైళ్లను నిడదవోలు, ఏలూరు, విజయవాడ మీదుగా దారిమళ్లించారు. -
తుపాను అలజడి: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను బలహీనపడింది. తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లుగా వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అనూహ్యంగా దిశ మార్చుకున్న అసని ఈశాన్యం వైపు కదులుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అసని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు. గరిష్టంగా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా. ప్రభుత్వం అప్రమత్తం అసని తుపాను ప్రభావంతో విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపై అసని తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు పలువురు మంత్రులు అసని తుపాను ప్రభారంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పలు రైళ్లు, విమానాలు రద్దు బంగాళాఖాతంలో అసని తుపాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే నేడు పలు రైళ్లను రద్దు చేసింది. విజయవాడ- మచిలీపట్నం, విజయవాడ- నర్పాపురం, నిడదవోలు, భీమవరం జంక్షన్, కాకినాడ పోర్ట్, విజయవాడ సహా మరికొన్ని రైళ్లను బుధవారం రద్దు చేసింది. అదే విధంగా అసని తుపాన్ ఎఫెక్ట్ విమాన సర్వీసులపై కూడా పడింది.విశాఖ మీదుగా రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. గన్నవరం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. కంట్రోల్ రూమ్ నంబర్లు కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18004253077 కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 0884-2368100 శ్రీకాకుళం: 08942-240557 తూర్పు గోదావరి: 8885425365 ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18002331077 విజయనగరం: 08922-236947 పార్వతీపురం మన్యం: 7286881293 మచిలీపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252572 మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252486 బాపట్ల కంట్రోల్ రూమ్ నంబర్: 8712655878, 8712655881 ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 90103 13920 విశాఖ: 0891-2590100,102 అనకాపల్లి: 7730939383 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘అసని’ తుపాను : ఏపీలోని పలుప్రాంతాల్లో భారీ వర్షాలు, పెనుగాలులు (ఫొటోలు)
-
Asani Cyclone Effect: మత్స్యకార భరోసా 13వ తేదీకి వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసని తుఫాన్ వల్ల సంభవిస్తున్న ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మే 11వ తేదీ (బుధవారం) కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో నిర్వహించతలపెట్టిన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని మే 13కు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ఏది నిజం: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’ -
Cyclone Asani: సర్కారు హై అలర్ట్
సాక్షి, అమరావతి: తుపాను తీవ్రత నేపథ్యంలో ముందే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని జిల్లాల అధికార యంత్రాంగాల్ని అప్రమత్తం చేయడంతోపాటు విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా ముందుగానే సహాయక చర్యలకు సిద్ధమైంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది. 65 మండలాల్లోని 555 గ్రామాల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ 24 గంటలూ పనిచేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అన్ని జిల్లాల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, మండల ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, 219 మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లు, 16 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను క్రియాశీలకం చేశారు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ముందస్తుగా 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 16 ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. కాకినాడ జిల్లాకు ఇప్పటికే 2 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందస్తుగా పంపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, విశాఖకు ఒక ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్, యానాంకు ఒక ఎన్డీఆర్ఎఫ్, కోనసీమకు ఒక ఎన్డీఆర్ఎఫ్, మచిలీపట్నానికి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని పంపించారు. మిగిలిన బృందాలను అవసరమైన చోటుకు పంపేందుకు అందుబాటులో ఉంచారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తుపాను షెల్టర్లను సిద్ధం చేశారు. అవసరాన్ని బట్టి స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, సహాయక శిబిరాలను కూడా గుర్తించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను ప్రాంతాల వారీగా తయారు చేశారు. టెలీ కమ్యూనికేషన్లు, తాగునీరు, నిత్యావసర వస్తువులు నిల్వ చేసుకోవడం, ట్రాఫిక్‌ను యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయడానికి ముందస్తు ప్రణాళికలను జిల్లా యంత్రాంగాలు సిద్ధం చేసుకున్నాయి. తాత్కాలిక విద్యుత్ ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. ఇదిలావుండగా.. తుపాను విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖపట్నం జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని కలెక్టర్ ఎ.మల్లికార్జునరావుకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ వద్ద అలల ఉధృతి గ్రామాల వారీగా కమిటీలు తుపాను ప్రభావంతో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలోని గ్రామాల్లో పంచాయతీరాజ్ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ శాంతిప్రియపాండే మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. హోం మంత్రిత్వ శాఖ వీడియో కాన్ఫరెన్స్ తుపాను ప్రభావిత రాష్ట్రాల విపత్తుల శాఖ అధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఏపీ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాల్గొన్నారు. విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ముందస్తుగా తీసుకున్న చర్యలను వివరించారు. -
అనూహ్య ‘అసని’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: వాతావరణ శాఖ అంచనాలను సైతం తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా అటూఇటూ ప్రయాణిస్తోంది ‘అసని’ తీవ్ర తుపాను. రోజుకో దిశలో.. పూటకో వేగంతో కదులుతోంది. విశాఖ తీరానికి సమీపించి.. ఒడిశా వైపు వెళ్తున్నట్లు కనిపించిన తీవ్ర తుపాను మరోసారి దిశ మార్చుకుని మచిలీపట్నం వైపుగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. విశాఖ తీరం వైపు వచ్చిన సమయంలో గంటకు 16 కి.మీ. వేగంతో ప్రయాణించి.. దిశ మారిన తర్వాత నెమ్మదించింది. ప్రస్తుతం గంటకు 10 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. మంగళవారం రాత్రి 11.15 గంటల సమయానికి కాకినాడకు 170 కి.మీ., విశాఖకు 290 కి.మీ., గోపాలపూర్‌కు 530 కి.మీ., పూరీకి 630 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం ఉదయానికి మచిలీపట్నం–బాపట్ల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా మలుపు తిరిగి సముద్రంలోకి వెళ్తుందని.. అక్కడి నుంచి మరింత బలహీనపడి కాకినాడ మీదుగా విశాఖపట్నం తీరం వైపు వస్తుందని అంచనా వేస్తున్నారు. బుధవారం ఉదయానికి తుపానుగా.. గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది. ప్రకాశం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు తుపాను ప్రభావంతో ప్రకాశం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సుమారు 25 సెం.మీ. మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధ, గురువారాల్లో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనూ మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్ర కెరటాల ఉధృతికి కూలిపోతున్న మత్స్యకారుల ఇళ్లు 75–85 కి.మీ. వేగంతో గాలులు బుధవారం ఉదయం తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కి.మీ., గరిష్టంగా 75 కి.మీ. వేగంతోనూ మధ్యాహ్న సమయంలో గంటకు 75 నుంచి 85 కిమీ, గరిష్టంగా 95 కి.మీ. వేగంతోనూ బలమైన గాలులు వీస్తాయి. కాకినాడ, విశాఖపట్నం, భీమిలి, గంగవరం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్–10 (జీడీ–10), మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో జీడీ–8 హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యలకు నౌకాదళం సిద్ధం తుపాను నేపథ్యంలో భారత నౌకాదళం అప్రమత్తమైంది. సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతంలోని నౌకాదళ సిబ్బంది, అధికారులకు విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లాయి. 19 వరద సహాయక బృందాలు, 6 డైవింగ్ టీమ్‌లు, జెమినీ బోట్లని విశాఖలో సిద్ధం చేశారు. తిరుపతి జిల్లాలో భారీ వర్షం తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓజిలి మండలం ఇనుగుంటలో 13.6 సెం.మీ. వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురంలో 11.2 సెం.మీ., ఖాజీపేట మండలం ఎట్టూరులో 10.7, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 8.1, విశాఖలో 5.9, నెల్లూరు జిల్లా కావలి, గుడ్లూరు మండలం రావూరులో 5 సెం.మీ. వర్షం పడింది. మొత్తంగా ఉమ్మడి కోస్తాంధ్ర అంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోనసీమ, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సగటున రాష్ట్ర వ్యాప్తంగా 3.1 మి.మీ. వర్షం పడింది. 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్ రాబోయే మూడు రోజుల్లో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు రెడ్అలర్ట్ జారీ చేశారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 68 విమానాలు రద్దు గోపాలపట్నం (విశాఖ పశ్చిమ)/మధురపూడి: తుపాను కారణంగా విశాఖ విమానాశ్రయంలో మొత్తం 68 సర్వీసులు రద్దయ్యాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇండిగో విమాన సర్వీసులు 46, ఎయిర్ ఏసియా విమాన సర్వీసులు 4, ఎయిరిండియా విమాన సర్వీసులు 2 రద్దయ్యాయి. స్పైజ్‌జెట్ సర్వీసు కూడా రద్దయ్యింది. బుధవారం కూడా ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. కాగా, రాజమహేంద్రవరం విమానాశ్రయానికి మంగళవారం రావాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. కాకినాడ బీచ్ రోడ్డు మూసివేత కాకినాడ సిటీ/విడవలూరు (నెల్లూరు): తుపాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండంతో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. కాకినాడ తీరంలో సముద్రం 30 మీటర్లు ముందుకు రావడంతో ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డును మూసివేశారు. ఉప్పాడ తీర ప్రాంతం సముద్ర కోతకు గురవుతోంది. సమీపంలోని ఇళ్లల్లోకి నీరు చొచ్చుకొచ్చింది. కెరటాల ఉధృతికి ఉప్పాడలో ఇళ్లు, బీచ్ రోడ్డు ధ్వంసమయ్యాయి. కాగా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని తీర ప్రాంతంపై తుపాను ప్రభావం చూపుతోంది. మండలంలోని రామతీర్థం పరిసర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో 5 అడుగుల మేర అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం దాదాపు 150 మీటర్లు మేర ముందుకొచ్చింది. -
ఏపీ: ఈ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం: ఐఎండీ
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను సహాయక చర్యల కోసం నేవీ సిద్ధమైంది. 19 వరద సహాయక బృందాలతో పాటు 6 డైవింగ్ బృందాలు సిద్ధమయ్యాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం: ఐఎండీ బాపట్ల జిల్లా సముద్ర తీరం ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. నిజాంపట్నం హార్బర్లో8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ తుపాను ప్రభావం కృష్ణా, కాకినాడ, తూ.గో, ప.గో జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రాలో 75-95 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీనిలో భాగంగా తుఫాన్ ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, సహాయక చర్యలకు సన్నద్ధం కావాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సఖినేటిపల్లి - ఐ. పోలవరం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచిస్తోందని కలెక్టర్ తెలిపారు. మరొకవైపు కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, కడప జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. రేపు(బుధవారం) సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలు వాయిదా బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారు. తుపాను కారణంగా పరీక్షను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. వాయిదా వేసిన ఇంటర్ పరీక్షను ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నారు. కంట్రోల్ రూమ్ నంబర్లు మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్లు 99086 64635, 08672 25257 మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08672252486 కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 18004253077 కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 0884-2368100 ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 18002331077 -
Asani Cyclone : ఉత్తరాంధ్రను వణికిస్తున్న‘అసని’ తుపాను (ఫొటోలు)
-
తీవ్ర రూపం దాల్చుతున్న అసనీ తుపాను... భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, ఆ తర్వాత క్రమంగా దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుపాను కారణంగా ఈ రోజు రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల అధికారి జగన్నాథ కుమార్ సూచించారు. విమాన కార్యకలాపాలు రద్దు ఈ తుపాను కారణంగా మే 10న చెన్నై, విశాఖపట్నంలో పలు విమానయాన సంస్థలతో వివిధ విమాన కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఏమియేషన్ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా 23 ఇండిగో విమానాలు రాకపోకలను రద్దు చేసినట్లు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అంతేకాదు నాలుగు ఎయిర్ఏషియా విమానాలు కూడా రద్దు చేసినట్లు కూడా వెల్లడించారు. (చదవండి: బెంబేలెత్తిస్తున్న ‘అసని’ తుపాన్.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే?) -
బెంబేలెత్తిస్తున్న ‘అసని’ తుపాన్.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే?
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఇది గంటకు 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో పాటు మరింత బలంగా మారే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సైక్లోన్ అసని అని పేరు పెట్టారు. ఈ తుపానుకు శ్రీలంక పేరుని సూచించింది. సింహళ భాషలో దీని అర్థం 'కోపం'. హుద్‌హుద్.. తిత్లీ.. పెథాయ్.. పేర్లు వేరైనా ఇవన్నీ మన రాష్ట్రాన్ని అతలాకుతులం చేసిన తుపానులు. తాజాగా ఇప్పుడేమో అసని తుపాను. తుపాన్లకి అసలు పేరు ఎందుకు? వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకే తుపానులకు పేర్లు పెట్టడం ఆనవాయితీ. కనీసం 61 కి.మీ. వేగం గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఎందుకంటే ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుపానులకు పేర్లు పెడుతున్నాయి. ఉదాహరణకు ‘తిత్లీ’ పేరును పాకిస్థాన్ సూచించింది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుపాన్లకు పేర్లు పెట్టారు. 2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి. దీంతో ఈ దేశాల సంఖ్య 13కు చేరుకుంది. ఉచ్ఛరించడానికి సులువుగా, ఎనిమిది అక్షరాల లోపే పేర్లు ఉండాలి. ఎవరి భావోద్వేగాలు, విశ్వాసాలను దెబ్బతీయకూడదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉత్తరాంధ్రలో ‘అసని’ తుపాను అలజడి.. (ఫొటోలు)
-
Cyclone Asani: తీరంలో ‘అసని’ అలజడి
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంపై ఉన్న ‘అసని’ తీవ్ర తుపాను గంటకు 25 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది కాకినాడకు ఆగ్నేయంగా 390 కి.మీ., విశాఖçకు ఆగ్నేయంగా 390 కి.మీ., గోపాల్‌పూర్‌కు 510 కి.మీ., పూరీకి దక్షిణ దిశగా 580 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం వాయవ్య దిశగా ప్రయాణించి.. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటుంది. అనంతరం యూటర్న్ తీసుకుని ఉత్తర–ఈశాన్య దిశగా ప్రయాణించి.. తిరిగి ఒడిశా తీరం సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం వైపునకు మరలనుంది. తదుపరి 48 గంటల్లో క్రమంగా సముద్రంలోనే తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, బలహీనపడిన అనంతరం కాకినాడ, విశాఖపట్నం మధ్య కూడా తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో సోమవారం సముద్రంలో గంటకు 100 నుంచి 110 కి.మీ., గరిష్టంగా 120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. చాలాచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడి సరఫరా నిలిచిపోయింది. విశాఖ జిల్లాలో కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. సహాయ చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. పలు విమానాల రద్దు.. రైళ్ల దారి మళ్లింపు గాలుల తీవ్రత కారణంగా విశాఖపట్నం రావాల్సిన పలు విమానాల్ని రద్దు చేశారు. మరికొన్ని విమానాల్ని దారి మళ్లించారు. విశాఖ విమానాశ్రయానికి రావాల్సిన 10 విమానాలు రద్దయ్యాయని, 7 విమానాలను మళ్లించామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తుపాను ప్రభావం ఉత్తరాం«ధ్ర, ఒడిశాపై ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాక్‌లు దెబ్బతిని ప్రమాదాలు సంభవించకుండా ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. ఒడిశా వైపు వెళ్లే మూడు రైళ్లని దారి మళ్లించారు. ఉత్తరాం«ధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమై.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుపాను తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకూ మండలస్థాయి అధికారులు, సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు భారత నౌకాదళం అప్రమత్తమైంది. ఇండియన్ కోస్ట్‌గార్డ్‌షిప్ ఐసీజీఎస్ వీరా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. 20 మంది కోస్ట్ గార్డు సిబ్బందితో పాటు 5 విపత్తు సహాయ బృందాలు సహాయక సామగ్రితో సన్నద్ధంగా ఉన్నాయి. మత్స్యకారులెవరైనా సముద్రంలో చిక్కుకుపోయారేమోనన్న అనుమానాలతో కోస్ట్‌గార్డు, నౌకాదళ బృందాలు బంగాళాఖాతాన్ని జల్లెడ పట్టాయి. విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కోస్తాకు రెండ్రోజుల పాటు వర్ష సూచన రాగల రెండ్రోజులపాటు కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పలుచోట్ల 12 నుంచి 20 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు వివరించారు. ఉత్తరాం«ధ్ర జిల్లాలతో పాటు కోస్తా తీర ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని తీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఉప్పాడ తీరానికి కొట్టుకొచ్చిన స్టీల్ బార్జి పిఠాపురం:కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతంపై తుపాను ప్రభావం చూపుతోంది. సోమవారం ఉదయం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరప్రాంతం కోతకు గురవుతోంది. ఈదురు గాలుల ప్రభావంతో కాకినాడ పోర్టులో లంగరు వేసిన స్టీల్ బార్జి ఉప్పాడ తీరానికి కొట్టుకు వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. దానిని తిరిగి సముద్రంలోకి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. సముద్ర కెరటాలు ఉప్పాడ తీరంపై విరుచుకుపడ్డాయి. కాకినాడ లైట్‌హౌస్ నుంచి ఉప్పాడ వరకు ఉన్న బీచ్ రోడ్డు తీవ్ర కోతకు గురయ్యింది. సుమారు 6 మీటర్ల ఎత్తున కెరటాలు బీచ్ రోడ్డుపై విరుచుకుపడడంతో వాహనాల రాకపోకలను నిషేధించారు. పోలీసు గస్తీ ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. కెరటాల తాకిడికి ఉప్పాడ శివారు ఎన్టీపీసీ సమీపంలోని పెద్దవంతెన పక్కకు ఒరిగిపోయి కూలిపోడానికి సిద్ధంగా ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Cyclone Asani : ఏపీకి అలర్ట్.. దూసుకొస్తున్న అసని..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతోంది. తీవ్ర తుపానుగా మారి ఒడిశా తీరానికి దగ్గరగా వస్తోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఆదివారం నర్సీపట్నం, శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, కోనసీమ, విజయవాడ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనంతపురం, కడప ప్రాంతాల్లోను వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో భారీ వర్షానికి రోడ్లు నీళ్లతో నిండి ట్రాఫిక్ స్తంభించింది. చదవండి: పాపం రమాదేవి.. భర్త ప్రాణాలు కాపాడబోయి.. కృష్ణా జిల్లా మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో భారీవర్షాలు, ఈదురు గాలులకు చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కోతకొచ్చిన మామిడికాయలు రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు, ఎక్కువచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. -
Cyclone Asani: అతి తీవ్రంగా 'అసని'
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఆదివారం నర్సీపట్నం, శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, కోనసీమ, విజయవాడ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనంతపురం, కడప ప్రాంతాల్లోను వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో భారీ వర్షానికి రోడ్లు నీళ్లతో నిండి ట్రాఫిక్ స్తంభించింది. కృష్ణా జిల్లా మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో భారీవర్షాలు, ఈదురు గాలులకు చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. కోతకొచ్చిన మామిడికాయలు రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు, ఎక్కువచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. -
అసని తుపాన్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా మారిన వాతావరణం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న అసని తుపాన్ బలపడుతోంది. ఇది మరికొన్ని గంటల్లో తీవ్ర రూపం దాల్చనుంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. విశాఖకు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. ఈరోజు నుంచి ఈనెల 10వ తేదీ వరకు కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం కూడా ఉంది. తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణం అసని తుఫాన్ ఎఫెక్ట్‌తో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు మండలాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విజయవాడలో ఆకాశం మేఘావృతమై, భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, గంపలగూడెం మండలాల్లోని పలుగ్రామాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా మామిడి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చదవండి: (అకాల వానలు, పిడుగులు.. ఆ సమయాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి) -
దూసుకొస్తున్న ‘అసని’ తుపాను
సాక్షి, అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది వాయవ్య దిశగా వేగంగా కదులుతూ ఆదివారం ఉదయానికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా మారితే దీనికి ‘అసని’గా నామకరణం చేయనున్నారు. ఇది శ్రీకాకుళం–ఒడిశా తీరం మధ్య ఈ నెల 10వ తేదీన తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం అంత తీవ్రంగా ఉండదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, దీని ప్రభావంతో శనివారం విశాఖ, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నా ఆ తర్వాత వాతావరణం చల్లబడింది. పిడుగులు పడి ముగ్గురు దుర్మరణం ఆమదాలవలస రూరల్, సరుబుజ్జిలి: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నెల్లిపర్తి, బూర్జ మండలం పణుకుపర్త గ్రామాల్లో శనివారం పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. నెల్లిపర్తిలో గరికపాటి ఏకాశి (52), పొదిలాపు చిన్నలక్ష్మి (39) కంసాల చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా పిడుగుపడింది. దీంతో ఇద్దరూ ఉన్నచోటే కుప్పకూలిపోయారు. సహచరులు వారిద్దరినీ ఇంటికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలుపోయాయి. బూర్జ మండలం పణుకుపర్తలో పశువుల్ని మేపేందుకు వెళ్లిన కొండ్రోతు మేఘన (12) అనే బాలిక ఉరుములు, మెరుపులు రావడంతో తోటివారితో కలిసి ఓ చెట్టు కిందకు వెళ్లింది. అక్కడే పిడుగు పడటంతో అపస్మారక స్థితికి చేరింది. ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వీరందరినీ పాలకొండ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ మేఘన చనిపోయింది.