Asani Cyclone Updates: Asani Cyclone Moving towards Odisha near Visakhapatnam - Sakshi
Sakshi News home page

Cyclone Asani: తీరంలో ‘అసని’ అలజడి

Published Tue, May 10 2022 4:22 AM | Last Updated on Tue, May 10 2022 11:04 AM

Asani cyclone moving towards Odisha near Visakhapatnam - Sakshi

ఉప్పాడ తీరంలో ఎగిసి పడుతున్న కెరటాలు

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంపై ఉన్న ‘అసని’ తీవ్ర తుపాను గంటకు 25 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది కాకినాడకు ఆగ్నేయంగా 390 కి.మీ., విశాఖçకు ఆగ్నేయంగా 390 కి.మీ., గోపాల్‌పూర్‌కు 510 కి.మీ., పూరీకి దక్షిణ దిశగా 580 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం వాయవ్య దిశగా ప్రయాణించి.. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటుంది.

అనంతరం యూటర్న్‌ తీసుకుని ఉత్తర–ఈశాన్య దిశగా ప్రయాణించి.. తిరిగి ఒడిశా తీరం సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం వైపునకు మరలనుంది. తదుపరి 48 గంటల్లో క్రమంగా సముద్రంలోనే తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, బలహీనపడిన అనంతరం కాకినాడ, విశాఖపట్నం మధ్య కూడా తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో సోమవారం సముద్రంలో గంటకు 100 నుంచి 110 కి.మీ., గరిష్టంగా 120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి.

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. చాలాచోట్ల విద్యుత్‌ వైర్లు తెగిపడి సరఫరా నిలిచిపోయింది. విశాఖ జిల్లాలో కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. సహాయ చర్యల నిమిత్తం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. 

పలు విమానాల రద్దు.. రైళ్ల దారి మళ్లింపు
గాలుల తీవ్రత కారణంగా విశాఖపట్నం రావాల్సిన పలు విమానాల్ని రద్దు చేశారు. మరికొన్ని విమానాల్ని దారి మళ్లించారు. విశాఖ విమానాశ్రయానికి రావాల్సిన 10 విమానాలు రద్దయ్యాయని, 7 విమానాలను మళ్లించామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. తుపాను ప్రభావం ఉత్తరాం«ధ్ర, ఒడిశాపై ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాక్‌లు దెబ్బతిని ప్రమాదాలు సంభవించకుండా ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. ఒడిశా వైపు వెళ్లే మూడు రైళ్లని దారి మళ్లించారు. ఉత్తరాం«ధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమై.. కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

తుపాను తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకూ మండలస్థాయి అధికారులు, సిబ్బంది హెడ్‌ క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు భారత నౌకాదళం అప్రమత్తమైంది. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌షిప్‌ ఐసీజీఎస్‌ వీరా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. 20 మంది కోస్ట్‌ గార్డు సిబ్బందితో పాటు 5 విపత్తు సహాయ బృందాలు సహాయక సామగ్రితో సన్నద్ధంగా ఉన్నాయి. మత్స్యకారులెవరైనా సముద్రంలో చిక్కుకుపోయారేమోనన్న అనుమానాలతో కోస్ట్‌గార్డు, నౌకాదళ బృందాలు బంగాళాఖాతాన్ని జల్లెడ పట్టాయి. విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 

కోస్తాకు రెండ్రోజుల పాటు వర్ష సూచన
రాగల రెండ్రోజులపాటు కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పలుచోట్ల 12 నుంచి 20 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు వివరించారు. ఉత్తరాం«ధ్ర జిల్లాలతో పాటు కోస్తా తీర ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని తీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. 

ఉప్పాడ తీరానికి కొట్టుకొచ్చిన స్టీల్‌ బార్జి
పిఠాపురం:కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతంపై తుపాను ప్రభావం చూపుతోంది. సోమవారం ఉదయం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.  తీరప్రాంతం కోతకు గురవుతోంది. ఈదురు గాలుల ప్రభావంతో కాకినాడ పోర్టులో లంగరు వేసిన స్టీల్‌ బార్జి ఉప్పాడ తీరానికి కొట్టుకు వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. దానిని తిరిగి సముద్రంలోకి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. సముద్ర కెరటాలు ఉప్పాడ తీరంపై విరుచుకుపడ్డాయి. కాకినాడ లైట్‌హౌస్‌ నుంచి ఉప్పాడ వరకు ఉన్న బీచ్‌ రోడ్డు తీవ్ర కోతకు గురయ్యింది. సుమారు 6 మీటర్ల ఎత్తున కెరటాలు బీచ్‌ రోడ్డుపై విరుచుకుపడడంతో వాహనాల రాకపోకలను నిషేధించారు. పోలీసు గస్తీ ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. కెరటాల తాకిడికి ఉప్పాడ శివారు ఎన్‌టీపీసీ సమీపంలోని పెద్దవంతెన పక్కకు ఒరిగిపోయి కూలిపోడానికి సిద్ధంగా ఉంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement