సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం (నేడు) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కుండపోతగా వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అలాగే ఈ నెల 7న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. కాగా 7న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. ఫలితంగా 7, 8 తేదీల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా, కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కాగా అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
ఇది మూడో అల్పపీడనం..
నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభమయ్యాక ఇప్పటివరకు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. కానీ అవి అల్పపీడనాలకే పరిమితమయ్యాయి తప్ప వాయుగుండంగా బలపడలేదు. జూలై 9న వాయవ్య బంగాళాఖాతంలో, 16న అదే ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 7న ఏర్పడబోయే అల్పపీడనం మూడోది.
AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా
Published Fri, Aug 5 2022 4:07 AM | Last Updated on Fri, Aug 5 2022 8:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment