
శ్రీశైలంలో రెండు గేట్ల ద్వారా సాగర్‌కు విడుదల అవుతున్న నీరు
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్ (మాచర్ల) : రాష్ట్రంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో అవి నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరుకోవడంతో శనివారం మరోసారి డ్యామ్‌లోని రెండు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,966 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఎగువన జూరాల, సుంకేసుల నుంచి ఇక్కడకు 1,60,459 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో కుడిగట్టు కేంద్రంలో శుక్ర, శనివారాల్లో 14.976 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 17.175 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.
అనంతరం 67,003 క్యూసెక్కుల నీటిని, స్పిల్ వే ద్వారా 2,340 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 21,166 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,490 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయంలో 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సాగర్‌లోనూ 14గేట్ల ద్వారా నీటి విడుదల
నాగార్జునసాగర్ వద్ద కూడా శనివారం 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు మళ్లీ నీటి ప్రవాహం పెరిగింది. దీంతో అవన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో.. సాగర్ జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయిలో 590 అడుగులకు (312.0450 టీఎంసీలు) చేరుకోవడంతో ఇందులోకి వచ్చిన నీటిని వచ్చింది వచ్చినట్లు 14గేట్ల ద్వారా 1,13,400 క్యూసెక్కులు, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 33,292 క్యూసెక్కులు మొత్తం 1,46,692 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి కాల్వకు 9,274 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,791 క్యూసెక్కులు, వరద కాల్వకు 400 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment