నాగార్జునసాగర్ నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల): నారాయణపూర్ డ్యామ్ దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో, కర్నూలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, తుంగభద్ర, ఉప నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. దాంతో కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,88,090 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 15,833, హంద్రీ–నీవా ద్వారా 914, కల్వకుర్తి ద్వారా 1,167 క్యూసెక్కులు తరలిస్తున్నారు. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,75,680 క్యూసెక్కులను, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,112 క్యూసెక్కులు.. వెరసి 4,37,792 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.2 అడుగుల్లో 210.99 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4,02,366 క్యూసెక్కులు ప్రవాహం వస్తోంది.
కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువలకు 20,589 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ స్పిల్ వే 26 గేట్లు, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 4,63,888 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 588.6 అడుగుల్లో 307.87 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నారు. సాగర్ నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
సాగర్ నుంచి వస్తున్న ప్రవాహంతో పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 3,87,289 క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్ వే గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా 3,99,834 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.19 అడుగుల్లో 37.23 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోంది.
ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,10,692 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 14,962 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 1,95,090 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మంగళవారం ఉదయానికి ప్రకాశం బ్యారేజ్‌లోకి వచ్చే వరద 4.50 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికవర్గాలు తెలిపాయి. కృష్ణా బేసిన్‌లో మంగళవారమూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మరో మూడు రోజులపాటు కృష్ణాలో వరద ఉద్ధృతి కొనసాగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment