సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు ప్రవేశించిన తొలి వారంలో (గత వారం రోజుల్లో) రాయలసీమలోని ఐదు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. వైఎస్సార్ జిల్లాలో అనూహ్యంగా సాధారణ వర్షపాతం కంటే 108.7 శాతం అధికంగా పడింది. సాధారణంగా ఈ వారం రోజుల్లో 56.8 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా 117.3 మి.మీ. కురిసింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 52.8 మి.మీ. పడాల్సి ఉండగా 102.9 మి.మీ. (94.9 శాతం అధికం) కురిసింది.
అనంతపురం జిల్లాలో 48.3 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 78.5 మి.మీ. (62.5 శాతం అధికం) పడింది. అన్నమయ్య జిల్లాలో 59 మిల్లీమీటర్లు కురవాల్సివుండగా 100 మిల్లీమీటర్ల (69.5 శాతం అధికం) వర్షం పడింది. చిత్తూరు జిల్లాలో 65.5 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 97.7 మి.మీ. (49.5 శాతం అధికం) కురిసింది. 9 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వర్షాలు పడ్డాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ.. పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది.
శ్రీకాకుళం, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ లోటు
శ్రీకాకుళం, ఎన్టీఆర్ జిల్లాల్లో మాత్రం భారీ లోటు ఏర్పడింది. సాధారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ సమయానికి మంచి వర్షాలు కురవాలి. వారం రోజుల్లో ఆ జిల్లాలో 100.5 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా కేవలం 34.9 మి.మీ. (65.3 శాతం తక్కువ) కురిసింది. ఎన్టీఆర్ జిల్లాలో 75.3 మి.మీ. వర్షం పడాల్సి ఉండగా 22.2 మి.మీ. వర్షం (70.5 శాతం తక్కువ) మాత్రమే పడింది.
విజయనగరం, పార్వతీపురం మన్యం..అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కురవాల్సిన దానికంటె స్వల్పంగా తక్కువ వర్షం కురిసింది. సాధారణంగా నైరుతి రుతు పవనాలు ప్రారంభ సీజన్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షాలు, రాయలసీమలో తక్కువ వర్షాలు కురుస్తాయి. ఈసారి అందుకు విరుద్ధంగా రాయలసీమలో విస్తారంగా కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో తగ్గాయి. రాబోయే పది రోజుల్లోనూ ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. జూలై, ఆగస్టు నెలల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh : 5 జిల్లాల్లో వర్షాలే వర్షాలు
Published Tue, Jun 21 2022 5:28 AM | Last Updated on Tue, Jun 21 2022 9:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment