సాక్షి, విశాఖపట్నం: ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖపట్నం జిల్లాలోని రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జిల్లాలోని రైవాడ, కోనాం, పెద్దేర్ రిజర్వాయర్లు రిజర్వాయర్లు ప్రమాదకరస్థాయికి చేరాయి. దీంతో రైవాడ రిజర్వాయర్ నుంచి 300 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలిపెట్టగా.. కోనా రిజర్వాయర్ నుంచి 150 క్యూసెక్కుల నీటిని వదిలేశారు. ఇక, పెద్దేరు రిజర్వాయర్ నుంచి 2వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. కల్యాణ లోవ రిజర్వాయర్ ఔట్‌ఫ్లో 150 క్యూసెక్కులు కిందకు వదిలేశారు. రిజర్వాయర్ల నుంచి భారీ నీటిని కిందకు వదిలేస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో జిల్లాలోని రోడ్లు జలమయం అయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉంది.
కర్నూలు జిల్లాలో భారీ వానలు
జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు అంకిరెడ్డిపల్లె-తాడిపత్రి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మదంనతపురం వద్ద వాగులో బైక్ కొట్టుకుపోవడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని స్థానికులు కాపాడారు.
జలదిగ్బంధంలో 30 గ్రామాలు
చిత్తూరు: పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పెద్ద ఉప్పరపల్లె, ఆవులపల్లె, అన్నెమ్మగారిపల్లె, నంజంపేట పంచాయతీల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అలాగే దుర్గంకొండలు, చౌడేపల్లె అడవుల్లో సుమారు మూడు గంటలపాటు వర్షం ముంచెత్తింది. వర్షం ధాటికి సీతమ్మ చెరువు, గార్గేయ నదికి నీటి ఉధృతి పెరిగింది. బయ్యారెడ్డిగారిపల్లె, రామకృష్ణాపురం, ఆవులపల్లె గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం.. గ్రామాల్లోకి వంకల నుంచి భారీగా నీళ్లు రావడంతో గ్రామస్తులు మిట్ట ప్రదేశాలకు వెళ్లి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలదాచుకుంటున్నారు. సీతమ్మ వంకలో ఒక ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. గార్గేయనది ఉధృతికి 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గడ్డమాను ఒడ్డు, దోనిమాకుల చెరువులకు గండ్లు పడ్డాయి. పల్లెలకు నడిచే రాత్రి సర్వీసు బస్సులన్నీ మండల కేంద్రమైన సోమలలోనే ఆపి వేశారు.
శ్రీకాకుళంలో విస్తారంగా వర్షాలు..!
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగావళి, వంశధార నదులకు భారీగా వరదనీరు వస్తోంది. బుర్జ మండలం మర్రిపాడు వద్ద తోటపల్లి ఎడమకాలువకు గండిపడింది. దీంతో వెయ్యి ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. మడ్డువలస ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో ఆరు గేట్లు ఎత్తివేశారు.
Comments
Please login to add a commentAdd a comment