కృష్ణాజిల్లా పాములలంక వద్ద వరదలకు ఊరు విడిచి పునరావాస కేంద్రానికి వెళ్తున్న గ్రామస్తులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆదివారం సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య – వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య కేంద్రీకృతమైంది. ఇది శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, దక్షిణ ఒడిశా ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇది సగం సముద్రం, సగం భూమిపై కొనసాగుతుండటంతో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం ప్రభావం వల్ల సముద్రంవైపు ఉన్న తేమ అంతా మేఘాల ద్వారా భూమిపైకి విస్తరించి భారీ వర్షాలకు కారణమవుతున్నట్లు తెలిపారు. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
అలాగే సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి తూర్పు ఆగ్నేయ దిశగా దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడన కేంద్రం గుండా వెళుతోంది. అరేబియా సముద్రంలో ఉన్న మరో అల్పపీడన ద్రోణి ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు విస్తరించి ఉంది.
మరో 2 రెండు రోజులు వర్షాలు
అల్పపీడనం, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాస్తవానికి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అది వాయుగుండంగా మారేందుకు అనువైన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
11వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
గోవిందపురంలో 9 సెంటీమీటర్ల వర్షం
శనివారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందపురంలో 9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దళపతిగుడలో 8.7, శ్రీకాకుళంలో 8.5, పల్నాడు జిల్లా చాగల్లులో 8.3, అల్లూరి జిల్లా శరభన్నపాలెంలో 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో 6 సెంటీమీటర్లు, అంబేడ్కర్ కోనసీమ జిల్లా శివకోడులో 5.6, అనకాపల్లి జిల్లా కోరుప్రోలులో 5.2, పశ్చిమగోదావరి జిల్లా వేగివాడలో 5.1, మొగల్తూరులో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
విజయవాడ, పరిసరాల్లో భారీ వర్షం పడింది. రాష్ట్రంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో మహేంద్ర తనయ గెడ్డ పొంగడంతో శనివారం హొన్నాళి గ్రామానికి చెందిన విశ్వనాథ్ లెంకా (20) అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. విశాఖ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది.
తగరపువలస, ఆనందపురం, కొమ్మాది, పద్మనాభం, మధురవాడ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అనకాపల్లి జిల్లాలో జోరు వాన కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మూడురోజుల్లో జిల్లావ్యాప్తంగా 76.28 సెండీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment