వరంగల్ నగరంలో నీటమునిగిన సంతోషిమాత నగర్, ఎన్టీఆర్ నగర్ , ఖమ్మం జిల్లా రాజేశ్వరపురంలో వరి నారు కొట్టుకుపోవటంతో విలపిస్తున్న రైతు లింగయ్య
నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో తాజాగా కురిసిన 46.3 సెంటీమీటర్ల వాన రాష్ట్రంలో మూడో అతి భారీ వర్షంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకుముందు 2013 జూలై 19న ములుగు జిల్లా వాజేడులో ఏకంగా 51.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే ఏడాది జూలై 23న కొమ్రంభీం జిల్లా దహెగాంలో 50.36 సెంటీమీటర్ల వాన పడింది.
సాక్షి, హైదరాబాద్, సాక్షి నెట్‌వర్క్: ఎడతెరిపిలేని వానలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ఆకాశం చిల్లులు పడిందా అన్నట్టుగా వానలు పడుతున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వానలు మరింత ముదురుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ మేరకు రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే సోమవారం రాత్రి నుంచే ఈ వర్షాల ప్రభావం కనిపించడం మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాలో అయితే రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌నూ వాన వణికిస్తోంది. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాల ట్రాఫిక్ ఇబ్బందిగా మారింది.
రికార్డు స్థాయిలో వానలు..
మంగళవారం రాష్ట్రంలో సగటున 4.39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిజామాబాద్‌తోపాటు జనగాం, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, మహబూబాబాద్, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది.
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో ఏకంగా 46.3 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్టు ప్రకటించింది. అదే జిల్లా ఆర్మూరు మండలం పెర్కిట్‌లో 33.1, వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తిలో 29.4, నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 26.4, జనగాం జిల్లా కునూర్‌లో 24.2, నిజామాబాద్ జిల్లాలోని కోనసమందర్‌లో 22.6, జక్రాన్‌పల్లిలో 22.2 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్‌లో గరిష్టంగా చార్మినార్ ప్రాంతంలో 7.3 సెంటీమీటర్ల వాన పడింది.
25 జిల్లాల్లో అధిక వర్షపాతం
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైన తర్వాత తొలి నెల రోజుల పాటు వర్షపాతం లోటు ఉండగా.. గత వారం రోజుల్లో అధిక వర్షపాతానికి చేరింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఏకంగా 60శాతం అధికంగా వానలు పడగా.. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగాం, వరంగల్, కొమురంభీం, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్, జగిత్యాల, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వనపర్తి, మంచిర్యాల జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు అధిక వర్షపాతం నమోదైంది. మిగతా ఎనిమిది జిల్లాల్లో సాధారణ స్థాయిలో వానలు పడ్డాయి.
ఈ మూడు రోజులు జాగ్రత్త
బంగాళాశాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది మరో 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. దీనికితోడు రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని.. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
పొలాల్లో రైతులు సెల్‌ఫోన్లు వాడొద్దు
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. పొలాల్లో నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. పొలాల్లో ఉన్న సమయంలో వాన, ఉరుములు, మెరుపులు వస్తుంటే రైతులు, ఇతరులు ఎవరైనా సెల్‌ఫోన్లు వాడొద్దు. అలా వాడితే పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది. పొలాల్లో ఉన్నప్పుడు నేలపై కూర్చోవాలి. ఎత్తుగా నిలబడి ప్రయాణం చేయవద్దు. విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద కూడా నిలబడొద్దు.
– నాగరత్న, హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment