
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మహబూబ్‌నగర్ జిల్లా వరకు అవి విస్తరిం చినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాల వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. దీంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరో నాలుగురోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశంఉన్నట్లు వాతావరణ శాఖ అం చనా వేస్తోంది.
సాధారణంగా జూన్ మొదటివారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేవి. ఈ ఏడాది మే నెల 30న కేరళను తాకిన రుతుపవనాలు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అవి మందగించాయి. ఆ తర్వాత పశ్చిమదిశల నుంచి గాలుల ప్రభావంతోపాటు ఇతర పరిస్థితుల వల్ల రుతుపవనాల కదలికల్లో చురుకుదనం ఏర్పడింది. దీంతో వాటి వ్యాప్తి సంతృప్తికరంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
మూడురోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. రానున్న మూడు రోజులు వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది.
ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 41 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.3 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment