![DSRP Inspects Dowleswaram Barrage At East Godavari District - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/6/dawaleshwar.jpg.webp?itok=tEiTln5z)
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీని బుధవారం కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్సార్పీ) పరిశీలించింది. బ్యారేజీకి ఉన్న 175 గేట్లను తనిఖీ చేసింది. తొలుత ఈ బృందం పోలవరం సీఈ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమావేశమైంది. ప్రస్తుతం బ్యారేజి పరిస్థితి, చేపట్టాల్సిన పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో రిటైర్డ్ సీఈ ఈశ్వర్ ఎస్.చౌదరి, రిటైర్డ్ ఈఎన్‌సీలు బి.ఎస్.ఎన్.రెడ్డి, పి.రామరాజు, రిటైర్డ్ సీఈలు రౌతు సత్యనారాయణ, కె.సత్యనారాయణ, జీఎస్‌ఐ రిటైర్డ్ డీజీ ఎం.రాజు, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ అండ్ ల్యాండ్ స్కేప్ ఎక్స్‌పర్ట్ ఎండీ యాసిన్ తదితరులు బ్యారేజీని పరిశీలించారు. కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజ్జేశ్వరం ఆర్మ్‌లను సందర్శించారు. హోయిస్ట్ మెకానిజమ్, బ్యారేజ్ గేట్లు, గేర్ బాక్స్, లిమిట్ స్విచ్, బ్రేక్ యూనిట్, మోటార్లు, వైర్ రోప్‌లను పరిశీలించారు.
గోదావరి డెల్టా సీఈ ఎన్.పుల్లారావు, ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ బి.రాంబాబు బ్యారేజ్ పరిస్థితిని కమిటీ సభ్యులకు వివరించారు. సాయంత్రం డీఎస్సార్పీ బృందం సభ్యులు నీటిపారుదలశాఖ అధికారులతో మరోసారి సమావేశమై బ్యారేజ్ పరిస్థితిపై చర్చించారు. కాటన్ బ్యారేజ్‌ను తనిఖీ చేసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబి పాండ్య పేర్కొన్నారు. కాటన్ బ్యారేజ్ వద్ద ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. బ్యారేజ్‌ను పరిశీలించే బృందంలో అన్ని విభాగాల నిపుణులు ఉన్నారన్నారు.
బ్యారేజీకి పూర్వవైభవం
డీఎస్సార్పీ బృందం సభ్యులు గురువారం కూడా బ్యారేజీ ఆఫ్రాన్‌తోపాటు గేట్ల పనితీరును మరోసారి తనిఖీ చేసి గోదావరి డెల్టా అధికారులతో సమావేశమవుతారు. తనిఖీల్లోను, అధికారులతో నిర్వహించిన సమావేశంలోను వెల్లడైన అంశాల ఆధారంగా ధవళేశ్వరం బ్యారేజీ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందజేయనున్నారు. డ్యామ్ రీహేబిలిటేషన్ ,ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ (డ్రిప్)లో ప్రపంచబ్యాంకు రుణంతో ఆధునికీకరణ పనులు చేపడతారు. కాటన్ బ్యారేజ్ డ్రిప్ పథకానికి ఎంపిక అయితే 40 ఏళ్ల తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో ఆధునికీకరణ పనులు జరుగుతాయి. ఆధునికీకరణ ద్వారా కాటన్ బ్యారేజీకి పూర్వవైభవం వస్తుందని గోదావరి డెల్టా సీఈ ఎన్.పుల్లారావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment