ముంచెత్తిన గోదారి | Assurance of public representatives and authorities to the victims in flooded areas | Sakshi
Sakshi News home page

ముంచెత్తిన గోదారి

Published Tue, Aug 18 2020 2:48 AM | Last Updated on Tue, Aug 18 2020 7:06 AM

Assurance of public representatives and authorities to the victims in flooded areas - Sakshi

రాజమహేంద్రవరంలో నీట మునిగిన కోటిలింగాలరేవు కైలాసభూమి

నదీ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం.. ఉపనదులు.. ప్రాణహిత, ఇంద్రావతి, శబరిలతోపాటు ఇతర కొండవాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో ఉభయగోదావరి జిల్లాల్లోని విలీన మండలాలు, కోనసీమలో వందలాది గ్రామాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. రాకపోకలు స్తంభించాయి. విద్యుత్, సమాచార వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే వేలాది కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలించారు. ఉచితంగా రేషన్‌ సరుకులను పంపిణీ చేశారు.

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వరద మట్టం 61.20 అడుగులకు చేరుకోవడంతో సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 19,69,535 క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 2013 తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి. 175 గేట్లు ఎత్తి 20,01,525 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. సోమవారం రాత్రికి వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులకు చేరి మంగళవారం ఉదయానికి 14 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం దండంగిలో, చింతూరు మండలంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్,ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది  

విలీన మండలాల్లో వరద బీభత్సం
► గోదావరి, శబరి నదుల ఉధృతితో విలీన మండలాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ మండలాల్లో సుమారు 100 గ్రామాలు ముంపులో ఉన్నాయి. 
► పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో 15 గ్రామాలు, 20 శివారు గ్రామాలు నీట మునిగాయి. కుక్కునూరు మండలంలో 10 గ్రామాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది.
► దేవీపట్నం మండలంలో పోచమ్మగండి అమ్మవారి ఆలయంతోపాటు ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. 
► తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ముమ్మిడివరం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
► స్తంభాలు ముంపులో ఉండటంతో విలీన మండలాల్లో విద్యుత్‌ నిలిచిపోయి అంధకారం అలుముకుంది. అన్ని మొబైల్‌ నెట్‌వర్క్‌ల సిగ్నల్స్‌ నిలిచిపోవడంతో సమాచార వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఆరు అడుగుల మేర నీరు చేరింది. వశిష్ట గోదావరి పోటెత్తడంతో నర్సాపురం వద్ద పొన్నపల్లి, మాధవాయిపాలెం, కొండాలమ్మగుడి ప్రాంతాల్లో ఇళ్ల మధ్యకు నీరు చేరింది.  
వరద ఉధృతికి తూర్పు గోదావరి జిల్లా పోశమ్మగండిలో నీటమునిగిన ఇళ్లు 

ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం
► విస్తృతంగా సహాయక చర్యలను చేపట్టాలని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌.. పోలవరం, గోదావరి డెల్టా సీఈలతో సమీక్షిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.
► మొత్తం ఆరు రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. దేవీపట్నం మండలంలో 5,800 కుటుంబాలను, వేలేరుపాడు మండలంలో 1,346 కుటుంబాలను, కుక్కునూరు మండలంలో 687 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
► పోలవరం గ్రామంలో నెక్లెస్‌బండ్‌ బలహీనంగా ఉండటంతో పటిష్టపరిచే పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. 
► రంపచోడవరం మన్యంలో నిర్వాసితులకు రేషన్, ఇతర నిత్యావసరాలు ముందుగానే పంపిణీ చేశారు. 
► కోనసీమ ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, పొన్నాడ సతీష్, ఎంపీ అనూరాధ, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement