సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం
సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి): అతివృష్టి, అనావృష్టితో అతలాకుతలం అవుతున్న గోదావరి ప్రాంతాన్ని ధాన్యాగారంగా మార్చాడు.. లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించి గోదారోళ్ల మనస్సుల్లో చెరగని స్థానాన్ని సంపాదించారు.. ఆయన చేతికర్రతో గీసిన గీతలు డెల్టా కాలువలయ్యాయి.. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతాలు పచ్చటి తివాచీలుగా మారాయి.. ధవళేశ్వరం ఆనకట్టతో గోదావరి జిల్లాలకు పునరుజ్జీవనం ప్రసాదించి ఆరాధ్య దైవంగా మారాడు.. అపర భగీరథుడిగా చరితలో నిలిచాడు సర్ ఆర్థర్ కాటన్.. నేడు కాటన్ దొర 120 వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి వారి మదిలో ఆరాధ్య దైవంగా నిలిచారు సర్ ఆర్థర్ కాటన్. అఖండ గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి గోదారోళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కరువు కోరల్లో ఉండే ప్రాంతాన్ని పచ్చటి తివాచీ పరిచినట్టుగా మా ర్చారు. ఆనకట్ట నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మార్చిన అపర భగీరధుడి పేర్గాంచారు. ఎన్నాళ్‌లైనా.. ఎన్నేళ్లు అయినా ఆ మహా నీయుడు చేసిన మేలు చిరస్థాయిగా గుర్తుండాలని గ్రామాగ్రామానా ఆయన శిలావిగ్రహాలు నెలకొల్పి స్మరించుకుంటున్నారు గోదారోళ్లు. 1803 మే 15న జన్మించిన సర్ ఆర్థర్ కాటన్ 1899 జూలై 24న కన్నుమూశారు.
దశ.. దిశను మార్చిన దొర
ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని రైతులకు సాగునీరు అందించడంతో పాటు జల రవాణా కోసమని కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాలుగు పాయాలపై 1847 నుంచి ఐదేళ్ల పాటు శ్రమించి 1852 నాటికి సుమారు నాలుగు కిలోమీటర్లు పొడవు గల ఆనకట్ట నిర్మాణం పూర్తిచేశారు. అప్పట్లో ఈ నిర్మాణానికి 1.65 లక్షల డాలర్లు (రూ.5 లక్షలు) ఖర్చు చేశారు. నిర్మాణానికి రోజుకు 1300 మంది కార్మికులు పని చేసేవారు. ఆరంభంలో తక్కువ ఎత్తుగల గేట్లు ఏర్పాటు చేయడంతో కాటన్ 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు జలరవాణాను వినియోగంలోకి తెచ్చారు.
తర్వాత 1887లో ఆయకట్టును 7,94,824 ఎకరాలకు విస్తరించారు. తర్వాత ఆ యకట్టుని 9,99,132 ఎకరాలకు విస్తరించారు. అనంతరం దీనిని ఉభయగోదావరి జిల్లాల్లో 10,09,009 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా విస్తరించారు. 1961 ఈ ఆనకట్ట భద్రతను ఎస్సీ మిత్ర కమిషన్ పరిశీలించింది. దీని స్థానంలో కొత్త బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. అందుకు రూ.26.59 కోట్లు అంచనా వేశారు. 1970లో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన బ్యారేజీకి సమాంతరంగా 40 మీటర్లపై భాగంలో ప్రస్తుత ఆనకట్ట నిర్మించారు. దీనిని 1982 అక్టోబర్ 29న జాతికి అంకితం చేశారు.
తూర్పుగోదావరిలో..
గోదావరి డెల్టా ఆయకట్టు (చేపల చెరువులు, తోటలు కలిపి) - 10,09,009 ఎకరాలు
పశ్చిమగోదావరి జిల్లాలో..
పశ్చిమ డెల్టా ఆయకట్టు - 5,29,273 ఎకరాలు
(సుమారు 2 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువుల విస్తరించాయి)
పశ్చిమ డెల్టా ఆయకట్టులో ప్రధాన కాలువలు - 11
(గోదావరి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ, కాకరపర్రు, గోస్తనీ, వేల్పూరు, నరసాపురం, ఏలూరు, అత్తిలి, జంక్షన్, వెంకయ్య వయ్యేరు, ఓల్డ్ వయ్యేరు, ఉండికాలువలు) (357 కిలోమీటర్లు) పంపిణీ కాలువలు పొడవు 2,020 కిలోమీటర్లు
తూర్పు గోదావరిలో..
తూర్పు డెల్టా ఆయకట్టు - 2,45,333 ఎకరాలు
సెంట్రల్ డెల్టా ఆయకట్టు - 2.01,898 ఎకరాలు
పిఠాపురం బ్రెంచ్ కెనాల్ - 32,507 ఎకరాలు
65 మండలాలు.. 10 లక్షల ఎకరాలు
కాటన్ దొర గోదావరి ప్రాంతంలో గుర్రంపై తిరుగుతూ చేతి కర్రతో గీసిన గీతలే నేడు డెల్టా ఆయకట్టు కాలువలుగా మారాయి. ఇప్పుడు రాష్ట్రంలో పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్న ప్రాజెక్టు ఇదే కావడం గమనర్హం. రెండు జిల్లాలో సాగు నీరు, తాగునీరు, పరిశ్రమలకు అవరసరమైన జలాలు ఈ ఆనకట్ట ద్వారానే సమకూర్చుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో చేపల చెరువులతో కలిపి 10,09,009 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. దీనిలో తూర్పు గోదావరి జిల్లాలో తూర్పుడెల్టా, సెంట్రల్ డెల్టా, పిఠాపురం బ్రెంచ్ కెనాల్ ద్వారా 4,79,736 ఎకరాలు, జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువ ద్వారా 5,29,273 ఎకరాల ఆయకట్టు సాగువుతుంది.
ఈ ఆనకట్టలో 2.931 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. గోదావరి డెల్టాలో తూర్పుగోదావరిలో 36 మండలాలు, పశ్చిమ గోదావరిలో 29 మండలాలు ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. 1862 నుంచి ఆనకట్ట పూర్తిస్థాయిలో ఆపరేషన్‌లోకి వచ్చింది. ధవళేశ్వరం ఆర్మ్‌కి 70 గేట్లు, ర్యాలీ ఆర్మ్‌కి 43, మద్దూరు ఆర్మ్‌కి 23, విజ్జేశ్వరం ఆర్మ్‌కి 39 గేట్లు చొప్పున ఏర్పాటుచేశారు. ఒక్కోగేటు ఏకంగా 27 టన్నుల బరువు ఉంటుంది. ఆయకట్టుని తూర్పు, సెంట్రల్, పశ్చిమ అనే మూడు డెల్టాలుగా విభజించారు.
Comments
Please login to add a commentAdd a comment