అపర భగీరథ.. మరువదు ఈ గడ్డ | Sir Arthur Cotton Death Anniversary Special Story | Sakshi
Sakshi News home page

అపర భగీరథుడు

Published Tue, Jul 24 2018 8:35 AM | Last Updated on Tue, Jul 24 2018 8:35 AM

Sir Arthur Cotton Death Anniversary Special Story - Sakshi

1847లో ఏర్పాటుచేసిన శిలాఫలకం

అతివృష్టి, అనావృష్టితో అతలాకుతలమవుతున్న గోదావరి ప్రాంతాన్నిధాన్యాగారంగా మార్చాడు.. లక్షలాది ఎకరాలకు సాగునీరు.. వందలాది గ్రామాలకు తాగునీరు అందించి గోదావరి వాసుల మదిలో అజరామరంగా నిలిచిపోయాడు.. ఆయన చేతికర్రతో గీసిన గీతలు డెల్టా కాలువలయ్యాయి.. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతాలు పచ్చటి తివాచీలుగా మారాయి.. ధవళేశ్వరం ఆనకట్టతో గోదావరిజిల్లాలకు పునరుజ్జీవనం ప్రసాదించి ఆరాధ్య దైవంగా మారాడు..అపర భగీరథుడిగా చరితలో నిలిచాడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌.. నేడు కాటన్‌ దొర119వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

పశ్చిమ గోదావరి, కొవ్వూరు : సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గోదావరి జిల్లాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసి గోదావరి జిల్లాలు దేశానికే అన్నపూర్ణగా పేరుతెచ్చుకునేందుకు ఆ మహనీయుడి దూరదృష్టి, చలువే కారణం. కాటన్‌ మేలు ఎప్పటికీ మరిచిపోకూడదన్న సంకల్పంతో గోదావరి వాసులు ఎక్కడికక్కడే ఆయన శిలా విగ్రహాలు నెలకొల్పారు. ఏటా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ స్మరించుకుంటున్నారు. 1803 మే 15న జన్మించిన  కాటన్‌ 1899 జూలై 24న మృతి చెందారు.

దశ.. దిశను మార్చిన దొర
సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి రైతులకు సాగునీరు అందించడంతో పాటు జల రవాణా కోసం కాటన్‌ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాలుగు పాయాలపై 1847 నుంచి ఐదేళ్లపాటు శ్రమించి 1852 నాటికి సుమారు నాలుగు కిలోమీటర్లు పొడవు గల ఆనకట్ట నిర్మాణం పూర్తిచేశారు. అప్పట్లో ఈ నిర్మాణానికి 1,65,000 డాలర్లు (రూ.5 లక్షలు) ఖర్చుచేశారు. రోజుకు 1,300 మంది కార్మికులు పనిచేశారు. ఆరంభంలో తక్కువ ఎత్తుగల గేట్లు ఏర్పాటు చేయడంతో కాటన్‌ 4.38 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు జలరవాణాను విని యోగంలోకి తెచ్చారు. తర్వాత 1887లో ఆయకట్టును 7,94,824 ఎకరాలకు విస్తరించారు. తర్వా త ఆయకట్టును 9,99,132 విస్తరించారు. అనంతరం దీనిని విస్తరించి ఉభయగోదావరి జిల్లాల్లో 10,09,009 ఎకరాలకు సాగునీరు అందించేలా తీర్చిదిద్దారు. 1961లో ఆనకట్ట భద్రతను ఎస్సీ మిత్ర కమిషన్‌ పరిశీలించింది. దీని స్థానంలో కొత్త బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. అందుకు రూ.26.59 కోట్లు అంచనా వేశారు. 1970లో సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నిర్మించిన బ్యారేజీకి సమాంతరంగా 40 మీటర్లుపై భాగంలో ప్రస్తుత ఆనకట్ట నిర్మించారు. దీనిని 1982 అక్టోబర్‌ 29న జాతికి అంకితం చేశారు.

65 మండలాలు.. 10 లక్షల ఎకరాలు
రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఏౖMðక ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. రెండు జిల్లాల్లో సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు అవరసరమైన జలాలు ఆనకట్ట ద్వారానే సమకూరుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో చేపల చెరువులతో కలిపి 10,09,009 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. దీనిలో తూర్పుగోదావరిలో తూర్పుడెల్టా, సెంట్రల్‌ డెల్టా, పిఠాపురం బ్రెంచ్‌ కెనాల్‌ ద్వారా 4,79,736 ఎకరాలు, జిల్లాలో పశ్చిమ డెల్టా కాలువ ద్వారా 5,29,273 ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. 2.931 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యంతో ఆనకట్ట నిర్మించారు. గోదావరి డెల్టాలో తూర్పుగోదావరిలో 36 మండలాలు, పశ్చిమలో 29 మండలాలు ఆయకట్టు ఈ బ్యారేజీ పరధిలో ఉన్నాయి. 1862 నుంచి ఆనకట్ట పూర్తిస్థాయిలో ఆపరేషన్‌లోకి వచ్చింది. ధవళేశ్వరం ఆర్మ్‌కి 70 గేట్లు, ర్యాలీ ఆర్మ్‌కి 43, మద్దూరు ఆర్మ్‌కి 23, విజ్జేశ్వరం ఆర్మ్‌కి 39 గేట్లు చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో గేటు 27 టన్నుల బరువు ఉంటుంది. ఆయకట్టును తూర్పు, సెంట్రల్, పశ్చిమ అనే మూడు డెల్టాలుగా విభజించారు.

ఆనకట్టను పరిరక్షించుకోవాలి
గోదావరి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సా గునీరు అందించిన మహనీయుడు కాటన్‌. ధవళేశ్వరం బ్యారేజీ నిర్వహణను ప్రభుత్వ ం గాలికి వదిలేసింది. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి పటిష్ట కట్టడాన్ని కాపాడుకోవడమే ఆయనకు నిజమైన నివాళి. కాటన్‌ వర్ధంతి, జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి.– విప్పర్తి వేణుగోపాల్, గోదావరి హెడ్‌వర్క్స్‌ రిటైర్డు ఈఈ, ధవళేశ్వరం

అంతా ఆయన చలువే
కాటన్‌ మహాశయుడు బ్యారేజీ నిర్మించడంతో ఉభయగోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో సిరులు పండుతున్నాయి. రెండు జిల్లాలు రాష్ట్రానికి అన్నపూర్ణగా మారా యంటే అదంతా ఆయన చలువే. ప్రస్తుత ప్రభుత్వాలు కాటన్‌ స్ఫూర్తిగా ప్రాజెక్టులు నిర్మించాలి.– పెనుమాక జయరాజు, రిటైర్డు ఉద్యోగి, కొవ్వూరు

అన్నంపెట్టిన మహనీయులు
కాటన్‌ మహాశయుడు ముందుచూపుతోనే డెల్టాలో సిరులు పండుతున్నాయి. నేటి పా లకులకు మాటలు తప్ప పనులు చేయాలన్న ధ్యాస లేదు. ఇందుకు పోలవరం ప్రాజెక్టును ఉదాహరణగా చెప్పవచ్చు. కాటన్‌ ఆంగ్లేయుడు అయినా ఉభయగోదావరి జిల్లాలకు అన్నంపెట్టిన మహనీయుడు.– కాపకా పాపారావు, రైతు, కాకరపర్రు, పెరవలి మండలం

చేతికర్రతో గీసిన గీతలే కాలువలు
నాడు కాటన్‌ చేతికర్రతో గీసిన గీతలు నేడు డెల్టాకు ప్రధాన కాలువలయ్యాయి. సున్నపురాయితో నిర్మించిన ఆనకట్టలు ఇప్పటి కీ చెక్కుచెదరలేదు. కాటన్‌ స్ఫూర్తితో ఇరిగేషన్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.– చిక్కాల బ్రహ్మజీరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,లాక్‌ సూపరింటెండెంట్‌ అసోసియేషన్, నిడదవోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement