
ఎటూ చూసినా పచ్చదనం.. స్వచ్ఛమైన ’గిరి’జనం. మలుపులు తిరుగుతూ గోదారమ్మ ప్రవాహం. చెంతనే చదువుల తల్లి సరస్వతి క్షేత్రం. మరోవైపు నల్లబంగారం. ఆదివాసీ ఉద్యమానికి కేంద్ర బిందువుగా.. బొగ్గుగని కార్మికుల శ్రమక్షేత్రంగా పేరొందిన ఆదిలాబాద్‌లో చలి గిలిగింతలు పెడుతున్నా.. రాజకీయం మాత్రం వాడివేడిగా సాగుతోంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో ఏడింటిని టీఆర్‌ఎస్ గెలుచుకోగా.. రెండుచోట్ల బీఎస్పీ విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక్క సీటుకే పరిమితమైంది. ఎన్నికల అనంతరం ఇతర పార్టీల నుంచి గెలుపొందిన ముగ్గురు సభ్యులూ గూలాబీ గూటికి చేరడంతో ప్రతిపక్షం తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ ఈసారి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఆసిఫాబాద్: ‘ఆదివాసీ’ ఫైట్
గిరిజనుల పోరాట యోధుడు కొమురం భీమ్ జన్మించిన గడ్డ ఇది. నైజాం సర్కారులో జిల్లా కేంద్రంగా ఉండి గ్రామ పంచాయతీ స్థాయికి పడిపోయిన ఆసిఫాబాద్‌కు తెలంగాణ సర్కా ర్ పూర్వవైభవం తెచ్చింది. ఆదివా సీలు, నిరక్ష్యరాసులు ఎక్కు వున్న ఈ నియోజకవర్గంలో గిరిజనగూడెం పటేల్, రాయి సెంటర్ల మాటే వేదవాక్కు. ఇటీవలి ఆదివాసీ ఉద్యమంతో.. ఈ ప్రాంతంలో లంబాడా, ఆదివాసీల నడుమ దూరం పెరిగింది. ఈ ప్రభావం ప్రస్తుత ఎన్నికలపై పడనుంది. టీఆర్‌ఎస్ నుంచి కోవా లక్ష్మి, కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు పోటీపడుతున్నారు. వీరిద్దరూ ఆదివాసీలే. లంబాడా ఓట్లు ఎవరికి దక్కితే వారినే విజయం వరించనుంది. వివాదరహిత తీరుతో కోవా లక్ష్మికి ఓటర్లలో ఆదరణ కనిపిస్తోంది. ఆదివాసీ ఉద్యమంలో తటస్థ వైఖరి అవలంబించడం ఆమెకు సానుకూలాంశం. సక్కుకు వ్యక్తిగతంగా మంచి పేరున్నా.. ఆదివాసీలకు అనుకూలంగా ఉద్యమాన్ని నడిపారనే అపవాదు ఉంది. గొండ్రు తెగకు చెందిన టీజేఎస్ అభ్యర్థి కోట్నాక విజయ్‌కుమార్ ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించనున్నారు. బీజేపీ, బీఎస్‌పీ అభ్యర్థుల ప్రభావం లేదు.భూ పట్టాలు పంపిణీ చేస్తామనే హామీ ఇచ్చేవారికే మద్దతు ఇవ్వాలని గిరిజనేతరులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ముథోల్: నలుగురి సవాల్
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ముథోల్ నియోజకవర్గం తొలిసారి చతుర్ముఖ పోటీకి వేదికైంది. గడ్డిగారి విఠల్‌రెడ్డి (టీఆర్‌ఎస్), పవార్ రామారావుపటేల్(కాంగ్రెస్), డాక్టర్ పడకంటి రమాదేవి (బీజేపీ)తో పాటు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భోంస్లే నారాయణరావు పటేల్ (ఎన్‌సీపీ) బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌పై సహజ అసంతృప్తి ఉన్నా.. తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిపై కొంత సానుభూతి కూడా ఉంది. సౌమ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుంది. ఇక, రామారావుపటేల్ సేవా కార్యక్రమాలతో రాజకీయాల్లోకి వచ్చారు. టీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి వేణుగోపాలచారి వర్గీయులు ఈయనకు మద్దతు పలుకుతున్నారు. చివరి క్షణం వరకు కాంగ్రెస్ టికెట్ ఆశించిన భోంస్లే నారాయణరావుపటేల్.. ఎన్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈయన రామారావు పటేల్‌కు వరసకు సోదరుడు. రెబల్‌గా భోంస్లే పటేల్ బరిలో దిగడంతో కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. ఇది తనకు కలిసొస్తుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో (2014) రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రమాదేవి నాలుగేళ్లుగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే అగ్రనేతల ప్రచారంతో హల్‌చల్ చేస్తున్న బీజేపీ.. ఈసారి గెలుపు తనదేనన్న భావనతో ఉంది. భైంసా పట్టణంలోని మైనార్టీ ఓట్లు కీలకం కానున్నాయి.
- నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మించకపోవడం
- గోదావరి చెంతనే ఉన్నా ఇక్కడింకా చాలా గ్రామాలకు సాగు, తాగునీరు అందకపోవడం.. వంటివి ప్రభావం చూపే అంశాలు.
న్యాయం చేయరూ..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా సన్నకారు రైతులకు అంతగా మేలు చేకూరలేదు. సమగ్ర సర్వేతో చాలామంది రైతులు తమ వ్యవసాయ భూమిని కోల్పోయారు. అటువంటి వారందరికీ న్యాయం చేయాలి.’
– దుర్గం తిరుపతి, రైతు, వాంకిడి
ఆర్థికంగా నిలబడ్డా..
గత ప్రభుత్వాలతో పోలిస్తే టీఆర్‌ఎస్ పాలన బాగుంది. నాకు స్వయం ఉపాధి కోసం రూ.50 వేలు బీసీ కార్పొరేషన్ ద్వారా అందించారు. దీంతో సొంతంగా ఆర్థికాభివృద్ధి సాధించాను.
– తిరుపతి గోలేటి, రెబ్బన
విద్య, వైద్యం కావాలి
నిర్మల్ నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే రాజకీయ కేంద్రం. అయితే, ఉన్నత విద్యావకాశాలు, కార్పొరేట్ స్థాయి వైద్యసేవల కోసం ఇప్పటికీ పక్క జిల్లాలకు వెళ్లాల్సిందే. యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ఎంతకీ నెరవేర్చడం లేదు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నా.. స్థానికంగా యువతకు ఉపాధి కల్పించాలి. ఇప్పటికీ గ్రామాల్లో యువత గల్ఫ్‌బాట పడుతూనే ఉంది.
– నంగె శ్రీనివాస్, నిర్మల్
అందరిదీ అదే ‘హామీ’
ఆదిలాబాద్‌లోని 15 వార్డులకు, నియోజకవర్గంలోని మూడు మండలాలకు వెళ్లే మార్గంలో గల రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఏళ్లుగా కోరుతున్నాం. కానీ.. సమస్య తీరడం లేదు. రోజూ రైలు వచ్చే సమయంలో అరగంట పాటు వేచి చూడాల్సి వస్తోంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడుతున్నాం. ఈసారి ఎన్నికల్లోనూ పార్టీలు ఓవర్ బ్రిడ్జి కట్టిస్తామని హామీనిస్తున్నాయి. ఎవరూ చేస్తారన్న నమ్మకం లేదు.
– గంగన్న, ఆదిలాబాద్
మంచిర్యాల: ముగ్గురు మొనగాళ్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పట్టణం. గోదావరి సమీపాన.. బొగ్గు గని నిక్షేపాలతో అలరారే మంచిర్యాల బరిలో ముగ్గురు హేమాహేమీలు తలపడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు (టీఆర్‌ఎస్), ప్రేమ్‌సాగర్‌రావు (కాంగ్రెస్), రఘునాథరావు (బీజేపీ).. ముగ్గురిదీ ఒకే సామాజిక వర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో దివాకర్‌రావుకు కొంత ఇబ్బందికరం.. ద్వితీయశ్రేణి నేతల వైఖరీ ఆ పార్టీని కొంత వరకు ఇబ్బంది పెట్టే అంశం. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ అరవింద్‌రెడ్డి చేరికతో టీఆర్‌ఎస్ బలం పెరిగింది. సంపన్నుడైన ప్రేమ్‌సాగర్‌రావు కొన్నాళ్లుగా నియోజకవర్గంలోనే తిష్టవేయడంతో స్థానికంగా ఉండరనే ముద్రను చెరిపేసుకున్నారు. ఉద్యోగ, నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తనకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఆ పార్టీ ఎవరి ఓట్లకు దెబ్బకొడుతుందో తెలియని పరిస్థితి ఉంది.
- నియోజకవర్గంలో మూడో వంతు ఉన్న మం చిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలే అభ్యర్థుల జయాపజయాలను నిర్దేశించనున్నాయి
- సింగరేణి కార్మికుల ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాల హామీ ప్రధాన ప్రచారాస్త్రం.
‘స్థానిక’ అంశాలే నిర్ణయాత్మకం
- ఏడాదిన్నరగా ఏజెన్సీ ప్రాంతంలో ‘మా రాజ్యం మా పాలన’ నినాదంతో ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్, బోథ్, సిర్పూరు, ఆసిఫాబాద్, ఖానాపూర్ స్థానాల్లో వీరి ఓట్లే కీలకం. ఆదిలాబాద్, సిర్పూరు మినహా మూడూ ఎస్‌టీ రిజర్వుడు సీట్లే. ఆదివాసీ ఉద్యమ నేతలైన సోయం బాపూరావు, ఆత్రం సక్కు (కాంగ్రెస్).. బోథ్, ఆసిఫాబాద్ నుంచి బరిలో ఉన్నారు. ఆదివాసీలు వీరిపై సానుకూలంగా ఉన్నారనే చెప్పవచ్చు. మిగతా మూడుచోట్లా ఆదివాసీల ప్రభావం తీవ్రంగానే ఉంది
- మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లిలో సింగరేణి కార్మిక కుటుంబాలతో పాటు రిటైర్డ్ కార్మికులదే గెలుపోటముల్లో కీలకపాత్ర
- పల్లెల్లో సాగునీటి సమస్య, మంచిర్యాలలో గూడెం ఎత్తిపోతలకు నీరివ్వకపోవడం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కాదని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం రైతుల్లో కొంత అసంతృప్తికి కారణమైంది
- స్థానిక ప్రజాప్రతినిధుల నాలుగేళ్ల వ్యవహారశైలి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది.
నిర్మల్: నువ్వా?నేనా?
నిర్మల్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (టీఆర్‌ఎస్), మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్) నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నారు. మధ్యలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సువర్ణారెడ్డి పుంజుకుంటున్నారు. ఉద్యోగ, నిరుద్యోగ వర్గాల నుంచి వ్యక్తమవుతోన్న ప్రభావం టీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారింది. రైతుబంధు, రైతుబీమా, షాదీ ముబారక్‌లాంటి సంక్షేమ పథకాలు, తాను చేసిన పనులు, దేవాలయాల జీర్ణోద్ధరణ, జిల్లా ఏర్పాటు గట్టెక్కిస్తాయని ఇంద్రకరణ్ నమ్మకంతో ఉన్నారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్‌తో పాటు 20 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడం కొంత ఇబ్బందికరం. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి.. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని, పథకాల అమల్లో లోపాలను ఎత్తిచూపుతూ ప్రచారం చేస్తున్నారు. మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపే ఉన్నాయన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారు. బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడంపైనే ఆ పార్టీ అభ్యర్థి సువర్ణ ఆశలు పెట్టుకున్నారు. రాహుల్‌గాంధీ, కేసీఆర్ సభలకు దీటుగా ఆదివారం అమిత్ షా సభ సక్సెస్ కావడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. ఎన్నికల్లో కింది అంశాలు ప్రభావం చూపనున్నాయి..
- నిజామాబాద్–ఆర్మూరు రైల్వే లైన్ పనులు మొదలు కాకపోవడం ∙పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన.. ఈఎస్‌ఐ ఆస్పత్రి మంజూరులో జాప్యం.. ఇవి ప్రచారాస్త్రాలు.
ఖానాపూర్ (ఎస్టీ): ఇద్దరూ బరాబర్
ఖానాపూర్‌లో రేఖానాయక్ (టీఆర్‌ఎస్), రాథోడ్ రమేష్ (కాంగ్రెస్) మధ్య పోటీ కొనసాగుతోంది. కొన్ని స్థానిక సమస్యలు పరిష్కారం కాకపోవడం గులాబీ అభ్యర్థికి ఇబ్బందిగా మారాయి. ముందస్తుగా అభ్య ర్థిని ప్రకటిం చడం ప్రచారంలో టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ పేరు చివరి వరకు తేలకపోవడంతో ఆయన ప్రచా రంలో వెనుకబడ్డారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ హరినాయక్ బీఎస్పీ నుంచి బరిలో నిలవడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకులో చీలిక రానుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం టీఆర్‌ఎస్‌కు కలిసి రానుంది. రాథోడ్ రమేష్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కావడంతో స్థానికంగా ఆయనకు పట్టుంది. ఈ రెండు పార్టీలూ లంబాడా అభ్యర్థులకు అవకాశమిస్తే బీజేపీ ఆదివాసీల నుంచి సట్ల అశోక్‌ను బరిలో ఉంచింది. ఆదివాసీలతో పాటు సంప్రదాయ ఓటుబ్యాంక్ కలిసి వస్తుందని ఆశ పెట్టుకుంది. మహాకూటమిలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీజేఎస్.. తట్రా భీంరావును పోటీలో నిలిపింది.
- అటవీ భూములకు యాజమాన్య హక్కులు ప్రధాన డిమాండ్
- గూడెం, తండాలకు రోడ్డు, రవాణా సౌకర్యం కల్పించడం.. ఖానాపూర్‌లో డిగ్రీ కాలేజీ లేకపోవడం వంటివి ఇక్కడి ప్రచారాస్త్రాలు.
ఆదిలాబాద్: ముగ్గురి ముచ్చట
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో త్రిముఖ పోరు నెలకొంది. ముగ్గు రూ ముగ్గురే అన్నట్లు ప్రచారం సాగుతుండడంతో గెలుపెవరిని వరిస్తుందనేది ఆసక్తి కలిగిస్తోంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగిన రామన్నకు గ్రామ గ్రామాన మంచి సంబంధాలున్నాయి. ప్రభుత్వ పథకాలు, పింఛన్లు కలిసి వచ్చే అంశాలు. ద్వితీయ శ్రేణి నేతలపై అవినీతి ఆరోపణలు కొంత ఇబ్బం ది పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాత ఆయన సామాజిక వర్గమే కావడంతో ఆ ఓటుబ్యాంకుకు గండిపడనుందని అంచనా. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి సహకరిస్తున్నా.. భార్గవ దేశ్‌పాండే వర్గం తటస్థంగా ఉండడం సుజాతకు సానుకూలాంశం. గత ఎన్నికల్లో ఇక్కడ ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ ఈసారీ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. ఆయనపై సానుభూతి కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో పెద్దసంఖ్యలో ఉన్న మైనార్టీలే ఆదిలా’బాద్‌షా’ ఎవరో తేల్చనున్నారు.
- 15 వార్డులు, మూడు మండలాలను కలిపే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రాధాన్యం వహిస్తోంది.
- సీసీఐ కంపెనీని పునరుద్ధరించాలనే డిమాండ్
- విమానాశ్రయం నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితం కావడంపై అసంతృప్తి
బోథ్ (ఎస్టీ): బిగ్ ఫైట్
ఉమ్మడి ఆదిలాబాద్‌లో గిరిజన తెగల మధ్య నెలకొన్న వివాదం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన బోథ్‌పై ప్రభావం చూపనుంది. రాథోడ్ బాపూరావు (టీఆర్‌ఎస్), మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరా వు (కాంగ్రెస్), మాడావి రాజు (బీ జేపీ)తో పాటు కాంగ్రెస్ రెబల్‌గా అనిల్ జాదవ్ పోటీలో ఉన్నారు. ప్రభుత్వంపై ఉండే సహజ అసంతృప్తికి తోడు స్థానికేతరుడనే ముద్ర రాథోడ్ బాపూరావుపై ప్రభావం చూపుతోంది. ఆదివాసీ ఉద్యమం, టీఆర్‌ఎస్‌పై అసంతృప్తి కాంగ్రెస్ అభ్యర్థి సోయం బాపూరావుకు కలిసొచ్చే అంశాలు. కాంగ్రెస్ రెబల్‌గా బరిలో ఉన్న అనిల్‌జాదవ్ లంబాడీ కావడటం అదే సామాజిక వర్గానికి చెందిన టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఇబ్బందిగా మారింది. ఈయన కాంగ్రెస్ ఓట్లనూ చీల్చే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి మాడావి రాజు స్థానికుడు కాకున్నా.. నియోజకవర్గంలో ఆదివాసీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ బరిలో ఉన్న అభ్యర్థులంతా రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో ఓట్ల చీలిక ఎవరికి కలిసొస్తుందో అంతుబట్టడం లేదు.
- సాగునీరు, వైద్య సౌకర్యాల కల్పన
- కుంప్టి వాగుపై మినీ ప్రాజెక్టు పనులు చేపట్టకపోవడం.. ఇవి ప్రాధాన్యం వహించే అంశాలు.
సిర్పూర్: ‘పేపర్’ పవర్
ఇదో మినీ భారత్. సిర్పూరు పేపర్ మిల్లు ప్రభావంతో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వలస వచ్చారు. మహారాష్ట్ర సంస్కృతి, వేషభాషలు ఎక్కువగా కనిపించే ఈ సెగ్మెంట్లో వలస ఓటర్లే కీలకం. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప ఇక్కడి నుంచి గెలిచారు. ఆపై టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన తాజా ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్‌లో వైద్య వృత్తి వదిలి ఏడాదిగా ప్రజలతో మమేకమైన మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు డాక్టర్ హరీశ్‌బాబు.. కోనప్పకు గట్టిపోటీ ఇస్తున్నారు. తన తండ్రి పాల్వాయిపై ఉన్న అభిమానం ఆయనకు కలిసొచ్చే అంశం. హరీశ్ వైపు మొగ్గు కనిపిస్తున్నా.. కోనప్ప రాజకీయ వ్యూహాలను మార్చడంలో దిట్ట. అభ్యర్థుల స్థానికత కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్‌టీ–టీఆర్‌ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ, బీఎస్పీల పోటీ నామమాత్రమే.
- వైఎస్ హయాంలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ పేరిట కాళేశ్వరం తరలించడం ఎన్నికల అస్త్రంగా మారింది.
- కాగజ్‌నగర్‌లో ప్రత్యక్షంగా పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కల్పించే సిర్పూర్ పేపర్ మిల్లు రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలకే మూత పడింది. ఈ మిల్లు కార్మికులు గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు.
- రైతుబంధు పథకంపై సానుకూలత ఉన్నా.. అటవీ, రెవెన్యూ వివాదాలతో 20 వేల మంది రైతులకు పాస్ పుస్తకాలు అందలేదు.
చెన్నూరు (ఎస్‌సీ): రసవత్తర పోరు
సింగరేణి థర్మల్ ప్లాంటుతో రాష్ట్రానికి కాంతులందిస్తున్నా.. నియోజకవర్గ అభివృద్ధి దీపం కింద చీకటిలానే ఉంది. కార్మి కోద్యమంలో కీలకపాత్ర పోషిం చే చెన్నూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. ముందస్తు నగారా మోగిన కొన్నాళ్లకే పతాక శీర్షికలకెక్కిన ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ – మహాకూటమి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుంది. బాల్క సుమన్ (టీఆర్‌ఎస్) కు.. వెంకటేష్ నేత (కాంగ్రెస్) తీవ్ర పోటీనిస్తున్నారు. మహా కూటమి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి బోడ జనార్ధన్ బరిలో దిగడంతో కాంగ్రెస్‌కు.. మాదిగ వర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు టికెట్ నిరాకరించడం టీఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా మారింది. అదే వర్గానికి చెందిన కార్యకర్త గట్టయ్య ఆత్మాహుతి చేసుకోవడంతో ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం కనిపిస్తోంది. నల్లాల ఓదెలు కూడా ప్రచారానికి దూరంగా ఉండడం, మాదిగ సామాజికవర్గం నుంచి పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆ వర్గం ఓట్లే గెలుపోటముల్ని నిర్దేశించనున్నాయి. నేతకాని వర్గం ఓటర్లు గణనీయంగా ఉండడం కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలించే అంశం. సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి, చెన్నూరు, కోటపల్లిలో ప్రభావం చూపే జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.
- మందమర్రిలో సింగరేణి భూముల్లో నివసిస్తున్న వారి ఇళ్ల క్రమబద్ధీకరణ..
- 3 వేల మందికి ఉపాధి కల్పించే తోళ్ల పరిశ్రమ ఇంకా ప్రారంభం కాకపోవడం
- నేతకాని, మాల, మాదిగ.. ఈ వర్గాల మొగ్గును బట్టే ఫలితం ఉండే అవకాశం.
బెల్లంపల్లి (ఎస్‌సీ): ఎవరి నోరు ‘తీపి’!
నేల నల్ల బంగారం. రాజకీయ చైతన్యం ఘనం.. విప్లవ భావజాలమూ ఎక్కువే. 2014లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టిన ఇక్క డి ఓటర్లు ఈసారెలాంటి తీర్పునిస్తారనేది ఉత్కంఠ కలిగిస్తోం ది. ప్రజాకూటమి పురుడుపోసుకోవడం తరువాయి సీట్ల సర్దుబాటులో అనేక మలుపులు తిరిగిన బెల్లంపల్లి రాజకీయం బీఎస్‌పీ అభ్యర్థిగా మాజీ మం త్రి గడ్డం వినోద్ రాకతో సమీకరణలు మారిపోయాయి. తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (టీఆర్‌ఎస్)పై కొంత అసంతృప్తి ఉన్నా.. ప్రజాకూటమి పొత్తులో సీపీఐ (గుండా మల్లేశ్)కి ఈ సీటు ఇవ్వడం చిన్నయ్యకు ఊరట కలిగించే అం శం. అయితే, వినోద్ బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో చిన్నయ్యకు గట్టిపోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా వినోద్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. పోటీ టీఆర్‌ఎస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్యనే ఉండే పరిస్థితి..
- సింగరేణి భూముల లీజులు రద్దు, స్థలాల క్రమబద్ధీకరణ హామీ ఈ ఎన్నికల్లో కీలకం
- ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైన్‌పై అసంతృప్తి
- మంజూరైన ’టెస్లా’ మెడికల్ కాలేజీని పునరుద్ధరించాలనే డిమాండ్ ఊపందుకుంది.
ఓటెయ్యాలని ‘చెప్పు’కుంటూ..
ఓట్లడగడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. తాను మాత్రం ఇలాగే ఓటెయ్యాలని అభ్యర్థిస్తానంటూ పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ ప్రజల పార్టీ అభ్యర్థి ఆకుల వివేక్ సోమవారం ఇలా కొంతసేపు చెప్పులు కుట్టారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
కాళ్లు పట్టుడు..హార్మోనియం కొట్టుడు
‘కనిపిస్తే పాపం.. కాళ్లు పట్టుడే’ అన్నట్టుంది జనగామ స్వతంత్ర అభ్యర్థి మెరుగు శ్రీనివాస్‌గౌడ్ ప్రచారం తీరు. వృద్ధుల కాళ్లు మొక్కుతూ తన హార్మోనియం గుర్తుకు ఓటెయ్యాలంటూ ఈయన అభ్యర్థిస్తున్న తీరు చూసి అందరూ ఔరా అనుకుంటున్నారు.
– కొమురవెల్లి (సిద్దిపేట)
సన్ని‘వేషా’నికి తగినట్టు..
ప్రచారంలో పదనిసలు తారస్థాయికి చేరుతున్నాయి. ఆయా సన్నివేశాలకు తగ్గట్టు అభ్యర్థులు వేషమేస్తున్నారు. సోమవారం బచ్చన్నపేట మండలంలో జనగామ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య బోనమెత్తి ప్రచారం నిర్వహించారు.
– బచ్చన్నపేట
Comments
Please login to add a commentAdd a comment