అడవి బిడ్డే హక్కుదారు | ROFR Patta for Every Tribal who owns land in forest in AP | Sakshi
Sakshi News home page

అడవి బిడ్డే హక్కుదారు

Published Mon, Jun 15 2020 2:56 AM | Last Updated on Mon, Jun 15 2020 9:16 AM

ROFR Patta for Every Tribal who owns land in forest in AP - Sakshi

సాక్షి, అమరావతి: అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ భూమి హక్కు పత్రాలు (పట్టాలు) మరోసారి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివాసీ దినోత్సవమైన ఆగస్టు 9వ తేదీన పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు 50 వేల ఎకరాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైఎస్సార్‌ అనంతరం 12 ఏళ్ల తరువాత గిరిజనులకు భూమి హక్కు పత్రాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ అడుగు ముందుకు వేశారు. పట్టాలు పొందడం ద్వారా గిరిజనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. 

గిరిజనుల కష్టాలను తెలుసుకుని...
దివంగత వైఎస్సార్‌ రైతును రాజు చేయాలన్న ఆలోచనతో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులందరికీ భూమి హక్కు పత్రాలు ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన పాలకులు ఆదివాసీల గురించి పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తరువాత గిరిజనులు నమ్ముకున్న పోడు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన పాదయాత్రలో గిరిజనుల సమస్యను తెలుసుకున్న ఆయన అటవీ శాఖ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఆర్‌వోఎఫ్‌ఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) కింద పట్టాలివ్వాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 87,166 మంది గిరిజన రైతులు 1,64,616 ఎకరాలపై సాగు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై పరిశీలన కొనసాగుతోంది. ఆ భూమిలో ఎవరు వ్యవసాయం చేస్తుంటే వారి పేరుతోనే పట్టా ఇస్తారు. ఈ సర్వే ఇప్పటికే మొదలైంది. 

అడవి బిడ్డలకు ఇబ్బంది లేకుండా...
పోడు వ్యవసాయం వల్ల అడవులు దెబ్బతింటున్నాయని అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. అయితే అడవితల్లినే నమ్ముకున్న గిరిజన రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలివ్వడం ద్వారా పోడు వ్యవసాయానికి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గిరిజనులు చేతుల్లో భూమి హక్కు పత్రాలుంటే అటవీ అధికారుల నుంచి ఇబ్బందులుండవు.

ప్రభుత్వ సాయం పొందేందుకు అర్హత
గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలివ్వడం ద్వారా ప్రభుత్వ నుంచి సాయం పొందేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా అందుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు కూడా తీసుకుంటున్నారు. 

గడువు పెంచాలని కేంద్రాన్ని కోరిన సీఎం
ఇప్పటివరకు 2005 డిసెంబరు 13వతేదీ నాటికి ముందు నుంచి సాగు చేస్తున్నవారికే ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇవ్వాలని, ఆ తరువాత సాగు చేపట్టిన వారికి పట్టాలిచ్చేందుకు వీలు లేదని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఈ నిబంధనను 2008 జనవరి 1వతేదీ వరకు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. 

వైఎస్సార్‌ హయాంలో 2.22 లక్షల ఎకరాలకుపైగా పంపిణీ
దివంగత వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2,22,383.02 ఎకరాల భూమిని గిరిజన రైతులకు పంపిణీ చేశారు. దీనిద్వారా మొత్తం 88,991 మంది గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్‌ వారికి హక్కు పత్రాలు ఇవ్వడంతో అటవీ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా గిరిజన రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు.

15 మందితో కమిటీ సర్వే...
‘పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతుల దరఖాస్తులపై ప్రస్తుతం సర్వే జరుగుతోంది. 15 మందితో ఫారెస్ట్, రెవెన్యూ శాఖ నుంచి వీఆర్‌వో, గిరిజన సంక్షేమ శాఖ నుంచి అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అధికారితో కూడిన కమిటీ సర్వే చేస్తోంది. పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న గిరిజనులు ఎంత కాలం నుంచి భూమిలో వ్యవసాయం చేస్తున్నారనేది ప్రధానంగా పరిశీలిస్తారు. జూన్‌ 25 నాటికి తుది జాబితా తయారవుతుంది. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీపై సోమవారం జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందుకు వెళతాం’ 
– పి రంజిత్‌బాషా, డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ.             

చాలా సంతోషంగా ఉంది 
‘దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతోమంది గిరిజన రైతులకు పట్టాలిచ్చారు. ఆయన అకాల మరణం తర్వాత పోడు సాగుదారుల గోడు విన్న నాథుడే లేడు. మళ్లీ సీఎం జగన్‌ చొరవతో పోడు భూములపై అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆదివాసీలకు అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు పంపిణి చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’
– కాకి మధు, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు, బుట్టాయిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా.  

వైఎస్సార్‌ తరువాత నిర్లక్ష్యం... 
‘దివంగత వైఎస్సార్‌ గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించడంతో జీడి మామిడి మొక్కలు పెంచుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. ఏపీ ఫోరం ఫర్‌ ల్యాండ్‌ రైట్స్‌ తరఫున గత ప్రభుత్వంలో గిరిజన మంత్రిని అనేకసార్లు కలిసినా ప్రయోజనం లేదు. గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తున్న ఘనత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుంది’
– కర్రి అబ్బాయిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఫోరం ఫర్‌ ల్యాండ్‌ రైట్స్‌.

కల నెరవేరుతోంది... 
‘గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదీవాసీ దినోత్సవం సందర్భంగా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలను అందచేయనుండటంతో గిరిజనుల సుదీర్ఘ కల నెరవేరనుంది. ఆ రోజు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు’ 
– పాలక రంజిత్‌కుమార్‌ , గిరిజన సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘాల నాయకుడు, పార్వతీపురం

ఇప్పుడు అందరికీ న్యాయం
‘అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషంంగా ఉంది. ఇప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. గత  ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో సాగు భూమి పట్టాలను పంపిణీ చేయలేదు. ఎన్నికలకు ముందు కొంతమందికి మాత్రమే పట్టాలు పంపిణీ చేశారు. తీరా సంబంధిత భూములను వారికి స్వాధీనం చేయలేదు’
– పాచిపెంట అప్పలనర్స, గిరిజన సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాడేరు, విశాఖ జిల్లా

రైతు భరోసాతో ఆదుకున్నారు..
‘రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు మావి. అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం. నిరుపేదలం కావడంతో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడేవాళ్లం. ముఖ్యమంత్రి జగన్‌ రైతు భరోసా ద్వారా మాకు  పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నారు’
–కుంబి అప్పారావు, ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ పట్టాదారు, రైతు భరోసా లబ్దిదారుడు,పనసలపాడు గ్రామం, ,పి.కోనవలస పంచాయతి, పాచిపెంట మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement