గిరిజనులు నా సొంత కుటుంబ సభ్యులు | Tribes Are Like My Own Family Members Says CM Jagan | Sakshi
Sakshi News home page

గిరిజనులు నా సొంత కుటుంబ సభ్యులు

Published Sat, Oct 3 2020 3:50 AM | Last Updated on Sat, Oct 3 2020 7:31 AM

Tribes Are Like My Own Family Members Says CM Jagan - Sakshi

గిరిజనులకు అటవీ భూములపై హక్కుపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం స్వయంగా పలువురు మహిళలకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలను అందిస్తున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: గిరిజనులను తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి అడుగులు ముందుకు వేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గిరిజనుల ఆదాయం పెంచేందుకు, వారిని రైతులుగా చేసి మంచి జరిగేలా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఏళ్ల నాటి గిరిపుత్రుల కలలను నెరవేరుస్తూ గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ప్రారంభించారు. పలువురు గిరిజన మహిళలకు స్వయంగా క్యాంపు కార్యాలయంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలను అందజేశారు.

మొత్తం 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాలపై హక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల, ఐటీడీఏ పరిధిలో వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు, విజయనగరం జిల్లా కురుపాంలో ఏర్పాటు చేయనున్న గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం వివరాలు ఇలా ఉన్నాయి. 

గిరిజనుల మేలు కోసమే.. 

  • రాష్ట్రంలో దాదాపు 6 శాతం ఉన్న గిరిజనులకు మంచి చేయాలని, వారి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రయత్నం చేస్తున్నాం. నాడు నాన్నగారి హయాంలో ఆ తపన చూశాం. మళ్లీ ఇవాళ దాదాపు 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తున్నాం.
  • ఈ కార్యక్రమం నెల రోజులు కొనసాగుతుంది. హక్కుల పత్రాల పంపిణీ, దాంతో పాటు రైతు భరోసా సొమ్ము ఇస్తాం. గిరిజనులను రైతులుగా చేసి, వారికి మంచి జరిగేలా చేయాలన్నదే మా లక్ష్యం.

మాట నిలబెట్టుకున్నాం

  • ఎన్నికల ప్రణాళికను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తామని చెప్పాం. అందులో చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తానని చెప్పాను. ఆ మాట ప్రకారం పేద గిరిజనులందరికీ కనీసం 2 ఎకరాల భూమి ఇవ్వాలన్న తాపత్రయంతో, ఆ అక్క చెల్లెమ్మలకు ఇవాల్టి నుంచి పత్రాలు ఇస్తున్నాం.
  • పట్టాలు పొందిన అక్క చెల్లెమ్మలకు భూమి అభివృద్ధి మాత్రమే కాకుండా, నీటి సదుపాయం, తోటల పెంపకానికి సహాయం చేస్తున్నాం. గిరిజనుల ఆదాయం పెంచడంతో పాటు, అడవుల్లో మరింత పచ్చదనం పెరిగేలా చర్యలు చేపడుతున్నాం. ఆ దిశలో కలెక్టర్లు, అటవీ అధికారులతో కలిసి పని చేస్తారు. 

ఎస్సీ, ఎస్టీలకు న్యాయం

  • నామినేటెడ్‌ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం ఇస్తూ అండగా నిలిచాం. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి, ఆ మేరకు చట్టం చేశాం. గిరిజనులకు మరింత మేలు చేసే విధంగా గిరిజన సలహా మండలి కూడా ఏర్పాటు చేశాం. 
  • గత ప్రభుత్వ హయాంలో గిరిజనుల పట్ల చాలా వివక్ష కొనసాగింది. వారికి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. చివరకు సలహా మండలి కూడా ఏర్పాటు చేయలేదు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆలోచన చేయలేదు. ప్రస్తుతం గిరిజనులు నా సొంత కుటుంబం అనుకుని అడుగులు ముందుకు వేస్తున్నాను. 
  • గతంలో గిరిజనులకు వైద్యం అందక చనిపోయేవారు. నేను పాదయాత్రలో స్వయంగా చూశాను. ఆ పరిస్థితులను మారుస్తూ పలు చర్యలు చేపడుతున్నాం. పాడేరులో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల నిర్మాణ పనులు మొదలు పెడుతున్నాం. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల పనులు కూడా ఇవాళే మొదలు పెడుతున్నాం. 
  • 5 ఐటీడీఏల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులు కూడా ఇవాళే మొదలు పెడుతున్నాం. ఆ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందనున్నాయి. గిరిజన ప్రాంతాల్లో కార్పొరేట్‌ స్థాయి విద్యతో పాటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల తరహాలో సేవలందించడమే లక్ష్యం. 

ఎన్నో కార్యక్రమాలతో అండగా..

  • అమ్మ కడుపులో బిడ్డ పెరగడం మొదలైనప్పటి నుంచి అవ్వా తాతల వరకు అందరికీ మేలు చేసే పనులు చేస్తున్నాం. గర్భిణులు మొదలు పిల్లలకు ఆరేళ్లు వచ్చే వరకు పోషణ పథకంలో పౌష్టికాహారం అందజేస్తున్నాం. 
  • 5 లక్షల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తున్నాం. 500 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్పు చేశాం. అనేక పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు మేలు చేస్తున్నాం. 
  • నాడు–నేడులో పాఠ«శాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇంగ్లిష్‌ మీడియమ్‌తో పేద కుటుంబాల పిల్లలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. చేతి రాతతో పాటు, తల రాత కూడా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం. స్వచ్ఛమైన మనసున్న గిరిజనులకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను.
  • క్యాంపు కార్యాలయంలో ప్రదర్శించిన రంపచోడవరం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, పాడేరు వైద్య కళాశాల నమూనాలను సీఎం జగన్‌ పరిశీలించారు. 
  • ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, మంత్రులు బొత్స, బాలినేని, సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మీరు గిరిజన పక్షపాతి
కొండల్లో జీవిస్తూ, అటవీ భూములు సాగు చేస్తున్న వారిపై గతంలో కేసులు పెట్టారు. ఇవాళ మీరు అడవి బిడ్డలకు అండగా నిలుస్తూ, ఆ భూములపై హక్కు కల్పిస్తూ, పట్టాలు ఇస్తున్నారు. ఆ విధంగా మీరు గిరిజన పక్షపాతిగా నిల్చారు. నాడు మహానేత వైఎస్సార్‌ 55,513 మందికి 1,30,679 ఎకరాల ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలిచ్చారు. ఆ తర్వాత మా గురించి ఎవరూ పట్టించుకోలేదు. మీరు వచ్చాకే మాకు నమ్మకం ఏర్పడింది. అందుకే మేమంతా మీ వెంట నడిచాం. ఇప్పుడు మీరు అడగకుండానే మాకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. ఉపాధి, విద్య, వైద్యంతో పాటు మరెన్నో కార్యక్రమాలతో మాకు అండగా నిలిచారు. మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం.      
– పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement