‘అరణ్య’ రోదన!
జీవనాధారమైన అడవి నుంచి ఆదివాసీల గెంటివేత
పోడు చేసుకుని బతుకుతున్న గిరిజనులపై సర్కారు కేసులు
అవి అటవీ భూములని.. వాటిలో పోడు చేయొద్దని హుకుం
బలవంతంగా లాక్కుని మొక్కలు నాటే యత్నం
రేషన్ కార్డులు రద్దు.. నిత్యావసరాల పంపిణీ నిలిపివేత
మరో దారిలేక గిరిజనులు వలస పోతారనే వ్యూహం
వరంగల్‌లో పోడు బావులను మూసేసే యత్నం
కవ్వాల్ టైగర్ రిజర్వు పేరుతో గూడేలకే ఎసరు
పోడు లేక.. రేషన్ రాక గిరిపుత్రుల ఆకలికేకలు
ఎక్కడికి పోవాలి.. ఎలా బతకాలంటూ ఆవేదన
గిరిపుత్రులను వారి జీవనాధారమైన అడవి తల్లి నుంచి దూరం చేస్తున్నారు. పోడు కొట్టుకుని సాగు చేసుకునే అడవి బిడ్డల పొట్టకొడుతున్నారు. అటవీ భూములను ఆక్రమిస్తున్నారంటూ ఆదివాసీలపైనే కేసులు పెడుతున్నారు. తరతరాలుగా వారు సాగుచేసుకుంటున్న భూమిని లాగేసు కుంటున్నారు. ఎలాగైనా అడవి నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా వారి రేషన్ కార్డులను, ఆధార్ కార్డులనూ రద్దు చేస్తున్నారు. అటు పోడు సాగూ లేక.. ఇటు రేషన్ సరుకులూ అందక ఆకలితో అలమటిస్తున్నారు. పుట్టిన గడ్డ నుంచే తమను గెంటేస్తే ఎక్కడికెళ్లి బతకాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పోడు తప్ప మరే పనీ తెలియని తాము బతికేదెలాగన్న వారి ఆవేదన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. అధికారుల తీరుతో.. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో వేలాది మంది గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.
సాక్షి నెట్‌వర్క్ అటవీ డివిజన్ల పరిధిలో పోడు కొట్టుకుని వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు అందించారు.2005 డిసెంబర్ 31 నాటికి పోడు చేస్తున్న భూములకు ఈ పత్రాలను అందించారు. అయితే.. అనంతర ప్రభుత్వాలు ఈ పత్రాల జారీని విస్మరించాయి. దశాబ్దాల పాటు పోడు చేసుకుంటున్న చాలా మంది గిరిజనులకు హక్కు పత్రాలు అందలేదు. ఆ తర్వాతి కాలంలోనూ చాలా గిరిజన కుటుంబాలు తమ జీవనాధారం కోసం అర ఎకరా, ఎకరా పోడు కొట్టుకుని బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం వారికి హక్కు పత్రాలు ఇవ్వకపోగా.. అటవీ భూములను ఆక్రమిస్తున్నారంటూ వారిపై కేసులు నమోదు చేస్తోంది. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ గిరి జనులకు, గొత్తి కోయలకు రేషన్ కార్డులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయాన్నీ నిలిపివేస్తున్నారు.
దీంతో అటు పోడు చేసుకుని కుటుంబ పోషణకు ఏమైనా తెచ్చుకోవడానికి భూమీ లేక.. ఇటు ఇంట్లో రేషన్ కార్డుపై బియ్యం, నిత్యావసర సరుకులూ అందక.. చాలా రోజులుగా గిరిజనుల కుటుంబాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. భూముల్లో సాగు చేసుకోనివ్వకుండా.. ప్రభుత్వ సదుపాయాలను నిలిపివేయటం ద్వారా.. గిరిజనులను ఏకంగా వారి నివాస ప్రాంతాల నుంచే పంపించేయాలనేది అధికారుల వ్యూహంగా చెప్తున్నారు. ఈ పరిస్థితులపై గిరిజన సంఘాలు ఆందోళనబాట పడుతున్నాయి. వారికి అనేక రాజకీయపక్షాలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి.
గిరిజనులపై కేసులు.. కార్డుల రద్దులు...
ఖమ్మం అటవీ డివిజన్‌లో రిజర్వ్ ఫారెస్ట్ విస్తీర్ణం 1,51,350 హెక్టార్లు ఉంది. వీటిలో 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం 8,561 మంది గిరిజనులకు 13,921 హెక్టార్లకు హక్కులు కల్పించారు. ఇవికాక ప్రస్తుతం సుమారు 8,000 ఎకరాల అటవీ భూమిలో పోడు సాగు చేస్తున్నారని చెప్తున్న అధికారులు.. ఆ భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో మొక్కలు నాటేందుకు ఉద్యుక్తులయ్యారు. పోడు వ్యవసా యం చేస్తున్న గొత్తి కోయలకు రేషన్‌కార్డులు, ఆధార్, ఓటరు కార్డులు రద్దు చేశారు. కొత్తగూడెం మండలం పెనగడప పంచాయతీ చండ్రుపట్లలో 200 మంది గొత్తి కోయలకు ఇలా గుర్తింపు కార్డులన్నీ రద్దుచేశారు. భద్రాచలం నార్త్ డివిజన్ పరిధిలో పోడు కొట్టిన 226 మంది గిరిజనులపై అధికారులు కేసులు నమోదు చేశారు.