
ఆదివాసీల ఆశాకిరణం తుకారాం ఐఏఎస్
‘దట్టమైన అడవులు గల ఆదిలాబాద్ జిల్లాలో అత్యం త వెనుకబడిన ఆదిమ జాతికి చెందిన గోండుల్లో మడవి తుకారాంను ఐఏఎస్‌గా చూడటం గర్వంగా ఉంది’ అనేవారు ప్రపంచ ప్రఖ్యాత మానవ పరిణామశాస్త్ర వేత్త హైమండార్ఫ్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని లక్సెట్టిపేట ఏజెన్సీ గూడెంలో మడవి బాబూరావ్, మాన్కుబాయి దంపతులకు మూడో సంతానంగా 1941 మే 4న జన్మించాడు తుకారాం. తండ్రి చిరుద్యోగం చేస్తూ, తన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తపన పడేవారు.
ఆ తపనే తుకారాంను గోండుల్లో తొలి ఐఏఎస్ అధికారిని చేసింది. పేదరికంలో మగ్గుతూనే ఎంఏ వరకు చదువు కున్నారు. మాతృభాష గోండితో పాటు మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో పట్టు సాధించాడు. దేశంలో గిరిజన జాతులు, భాషా సంస్కృతుల అధ్యయనం కోసం నైజాం కాలంలో రెండోసారి వచ్చిన హైమండార్ఫ్ వద్ద గోండి భాషలో అనువాదకుడిగా పని చేశారు. హైమండార్ఫ్ లండన్ వెళ్లిన తర్వాత ఆయన స్ఫూర్తితో గ్రూప్-1 అధికారిగా ఎన్నికైన తుకారాం మొదట కాకినాడ ఆర్డీ వోగా విధుల్లో చేరారు. 1981 ఏప్రిల్ 21న ఇంద్రవెల్లిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎందరో ఆదివాసులు మృతి చెందినప్పుడు ఉట్నూరు ఐటీడీఏ సహాయ అధి కారిగా ఉన్న తుకారాం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. ఆదివాసీల సమస్యల పరిష్కారాలకు ఏర్పా టైన రాయ్ సెంటర్లకు తోడ్పడ్డారు.
కరీంనగర్‌లో డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్‌గా, హైదరాబాద్‌లో గిరిజన సంస్కృతీ పరిశోధన శిక్షణా సంస్థలో ఇన్‌చార్జి డెరైక్ట ర్‌గా, మహబూబ్‌నగర్‌లో డీఆర్‌డీవోగా సేవలందించిన తుకా రాం అనంతరం ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. తొలుత నిజా మాబాద్ జిల్లా కలెక్టరుగా, తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌గా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సంస్థ కమిషనర్‌గా, ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998 నవంబర్ 29న ఆయన అస్వస్థతతో తనువు చాలించారు. ప్రతియేటా తుకా రాం వర్ధంతి రోజున గోండు ఆదివాసులు ఆనవాయితీగా నివాళు లర్పిస్తారు. తుకారాం చూపిన బాటలో నడవటమే నేటి ఆదివాసీ యువత ఆయనకు అర్పించే నిజమైన నివాళి.
(నేడు తుకారాం గోండ్ 16వ వర్ధంతి)
గుమ్మడి లక్ష్మీనారాయణ నర్సంపేట, వరంగల్