
వెదురుచూపు
చట్టం అమలయ్యే రోజు కోసం అడవిబిడ్డలు నిరీక్షిస్తున్నారు. రెండేళ్ల క్రితం చేసిన ఈ చట్టం ప్రకారం వెదురులాంటి కలపేతర జాతులను, చిన్న తరహా అటవీ ఉత్పత్తులను గిరిజనులు గ్రామసభలో తీర్మానం ద్వారా రవాణా చేసి విక్రయించుకోవచ్చు. అయితే అటవీ అధికారులు గిరిజనులకు కనీసం అవగాహన కలిగించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ చట్టాన్ని అమలు చేస్తే వనసంరక్షణ సమితుల వారు, బినామీలు కుమ్మక్కై అడవిని కొల్లగొడతారని వారంటున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :కేంద్ర మంత్రి జైరాం రమేష్ 2012లో అటవీ చట్టాన్ని తీసుకువచ్చి వెదురును కలపేతర చిన్న తరహా అటవీ ఉత్పత్తుల జాబితాలో చేర్చారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా మంధాలేఖ్‌లో వీఎస్‌ఎస్ సభ్యులు వెదురును మార్కెట్ చేయడం ద్వారా గ్రామం అభివృద్ధి సాధించడం ప్రామాణికంగా జైరాం రమేష్ ఆరు రాష్ట్రాల్లో అమలు చేయాలని భావించి ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్తింపచేశారు. అంతవరకు వెదురు నరకడం, విక్రయాలపై అటవీశాఖకు మాత్రమే అధికారం ఉండేది. ఈ చట్టం అమలులోకి వచ్చాక వెదురును కలపేతర చిన్న తరహా అటవీ ఉత్పత్తుల్లో చేర్చడంతో గిరిజనుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
వెదురు ఎక్కువగా లభించే ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వెదురును చిన్న తరహా అటవీ ఉత్పత్తిగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటవీ హక్కుల చట్టం ద్వారా వెదురును చిన్న తరహా అటవీ ఉత్పత్తిగా సేకరించుకోవచ్చని ఆదేశాలు జారీచేసింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే అటవీ ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతంలో 620 వనసంరక్షణ సమితులు ఉన్నాయి. ఒక్క ఏజెన్సీలోనే ఉన్న 450 వనసంరక్షణ సమితులలో 350 వీఎస్‌ఎస్‌ల్లో వెదురు పుష్కలంగా ఉంది. ఒక్కో వీఎస్‌ఎస్ పరిధిలో 1125 ఎకరాల భూమి ఉంది. ఈ లెక్కల ప్రకారం తూర్పు మన్యంలో 3,93,750 ఎకరాలున్నాయి. పశ్చిమగోదావరి, విశాఖ మన్యంలో దాదాపు నాలుగు లక్షల ఎకరాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లక్షన్నర ఎకరాలుంటాయని అటవీశాఖాధికారుల అంచనా. ఒక్కో జిల్లాల్లో 300కు తక్కువ కాకుండా వనసంరక్షణ సమితులున్నాయి.
వెదురు ఎదిగి సిద్ధంగా ఉన్నా..
ఆ జిల్లాల్లోని వీఎస్‌ఎస్‌లలో ఉన్న గిరిజనులు 2000లో అమలు చేసిన జాయింట్ ఫారెస్టు, కమ్యూనిటీ ఫారెస్టు మేనేజ్‌మెంట్ ద్వారా వెదురు మొక్కలు నాటారు. ఆ జిల్లాల్లో వెదురు ఎదిగి, ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉంది. చట్టం ప్రకారం వెదురు సేకరించుకుని విక్రయించుకుందామంటే అటవీశాఖాధికారులు అడ్డుపడుతున్నారని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. గతంలో అటవీ శాఖ వీఎస్‌ఎస్‌ల లో లభించిన వెదురును మార్కెట్ చేయడం ద్వారా వచ్చిన సొమ్మును 50 శాతం వీఎస్‌ఎస్ ఖాతాల్లో జమచేసేది. ఇప్పుడు మొత్తం వెదురును వీఎస్‌ఎస్ సభ్యులే మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటును చట్టం కల్పించింది. కానీ అధికారులు మాత్రం వీఎస్‌ఎస్ సభ్యులకు వెదురు సేకరణ, విక్రయాలపై అవగాహన కల్పించడంపై ఆసక్తి చూపడం లేదు. వీఎస్‌ఎస్ పరిధిలో 100 ఎకరాల్లో వెదురు ఉంటే 50 ఎకరాల్లో వెదురు సేకరించి తరువాత అదే ప్రాంతంలో తిరిగి వెదురు పెంచే చర్యలు తీసుకుని తరువాత మిగిలిన ప్రాంతంలో వెదురు సేకరించుకోవాలి. వెదురు లభ్యమయ్యే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల మన్యంలో ఉన్న ఒక్కో వీఎస్‌ఎస్ ఏటా వెదురుతో రూ.20 లక్షలు ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది. మన్యవాసులకు ఈ చట్టం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
ఇప్పటికైనా అమలు చేయాలి..
అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు ప్రయోజనం కలుగుతుందని భావించాం. వెదురును కలపేతర అటవీ ఉత్పత్తిగా గుర్తించినప్పుడు గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని అనుకున్నాం. చట్టం అమలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండేళ్లవుతున్నా నేటికీ గిరిజనులు వెదురును సేకరించుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా చట్టాన్ని అమలు చేసి గిరిజనుల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలి.
- కోరా మోహన్, ఏపీ ఫోరం
ఫర్ ల్యాండ్ రైట్స్ సభ్యుడు,
రాజు క్యాంప్, వై.రామవరం మండలం