గిరిజనతండాల్లో తీజ్ సంబురాలు..
గిరిజనులకు తల్లీ తండ్రి ప్రకృతే. కొరత లేకుండా ధాన్యాన్ని పస్తులు ఉంచకుండా పంటల్ని పుష్కలంగా ఇవ్వడమే కాదు తమకు అనువైన తోడును కూడా ప్రకృతి మాతే తీసుకువస్తుందన్నది ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకం పెళ్లీడుకు వచ్చిన పడతుల్లో కోటి ఆశలను విరబూయిస్తుంది. ఆ ఆశలే ఇంటింటా సంబరమవుతాయి.
పంట సాగు నుండి కన్నెపిల్లల పరిణయాల వరకు అంతా ప్రకృతి చెప్పిన విధంగానే నడుచుకుంటారు గిరిజనులు. అంతటి ప్రాధాన్యత కల్గిన వాటిల్లో ‘తీజ్’ పండుగ ముఖ్యమైనది.
"నాకు అరవై ఏళ్లు. మా చిన్నప్పుడు కూడా తీజ్ పండుగ చేసుకున్నాం. తీజ్ పెరిగిన తీరును చూసి మా అమ్మానాన్నలు, తండా పెద్దలు నాకు పెళ్లి చేశారు. ఇదే ఆనవాయితీ మా పిల్లలు కూడా చేస్తున్నారు0." – భూక్యా వీరమ్మ గన్యాతండ, మహబూబాబాద్
తీజ్ అంటే..
పెళ్లీడుకు వచ్చిన గిరిజన (లంబాడ) అమ్మాయిలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. గోధుమ నారునే కాదు ఈ కాలాన కనిపించే ఆరుద్ర పురుగులనూ తీజ్ అంటారు. ఎర్రగా అందంగా ఉండే ఆరుద్ర పురుగులను దేవుడు తమకోసం పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు మనసులో కోరుకున్న కోరిక ఫలిస్తుందని వీరి నమ్మకం.
ఇంటింటి ఆశీస్సులు..
పెళ్లీడుకు వచ్చిన యువతులు తమకు కావాల్సిన వరుడి కోసం చేసే ఈ పండగకు ముందు గా తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. యువతులందరు ఇంటింటికి వెళ్లి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, వారు కానుకగా ఇచ్చే విరాళం తీసుకోవడంతో తండా అంతా సందడిగా మారుతుంది. ఇలా సేకరించిన విరాళం (ధాన్యం) తో తమకు కావాల్సిన గోధుమలు, శనగలు, ఇతర సామాన్లు కొనుగోలు చేస్తారు.
గోధుమ మొలకలు..
తీజ్ పండుగలో ముఖ్యమైనది తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్ళి దుస్సేరు తీగలు తెచ్చి, బుట్టలను అల్లి, తమ ఆరాధ్య దైవం తుల్జా భవాని, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి, పుట్టమట్టిని తెస్తారు. మేకల ఎరువును కలిపి తండా నాయక్ చేతిలో ఉంచిన బుట్టలో ΄ోస్తారు. అప్పటికే నానబెట్టి ఉంచిన గోధుమలను అందులో వేస్తారు.
శనగలకు రేగుముళ్లు
తీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనగలకు యువతులు రేగుముళ్లు గుచ్చుతారు. ఈ ప్రక్రియను బావ వరుసయ్యే వారు పడతుల మనస్సు చెదిరేలా వారిని కదిలిస్తూ ఉంటారు.
నియమ నిష్టలతో..
తండాలోని యువతులందరు తమ బుట్టలను ఒకేచోట పెడతారు. ఈ తొమ్మిది రోజులు పెట్టిన బుట్టలకు నీళ్లు ΄ోస్తూ, వాటి చుట్టూ తిరుగుతూ గిరిజన నృత్యాలు, పాటలు పాడుతూ గడుపుతారు.
ఏడవ రోజు ఢమోళీ..
ఏడవరోజు జరిగే ఢమోళీ చుర్మోను మేరామా భవానీకి నివేదిస్తారు. వెండితో చేసిన విగ్రహం, రూపాయి బిళ్ల అమ్మవారి ముందు పెట్టి మేక΄ోతులు బలి ఇచ్చే తంతును‘ఆకాడో’ అంటారు.
దేవతల ప్రతిరూపాలకు..
ఎనిమిదవ రోజు మట్టితో ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సాంప్రదాయాల ప్రకారం పెండ్లి చేస్తారు. ఆడపిల్లలు పెళ్లి కూతురుగా, మగ పిల్లలు పెళ్లికొడుకుగా ఊహించుకుంటూ ఈ తంతులో పాల్గొంటారు. పెళ్లి తర్వాత తమ కుటుంబ సభ్యులను విడిచి పెడుతున్నట్లు ఊహించుకుని ఏడ్వడం, వారిని కుటుంబ సభ్యులు ఓదార్చడంతో ఈ తంతును నిర్వహిస్తారు.
తొమ్మిదవ రోజు నిమజ్జనం..
డప్పు చప్పుళ్లు, నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను అందజేస్తారు. యువతులు ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ పూజాఫలంగా పెరిగిన తీజ్‌ను అన్నదమ్ముళ్లకు ఇచ్చి.. వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తర్వాత యువతీ, యువకులు బుట్టలను పట్టుకొని ఊరేగింపుగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. – ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్, ఫొటోలు: మురళీ కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment