సకుటుంబ కరెన్సీ ముద్రణ! | Mahabubabad Police Arrested A Family For Making Nakli Notes | Sakshi
Sakshi News home page

సకుటుంబ కరెన్సీ ముద్రణ!

Published Sat, Nov 23 2019 4:57 AM | Last Updated on Sat, Nov 23 2019 7:44 AM

Mahabubabad Police Arrested A Family For Making Nakli Notes - Sakshi

మహబూబాబాద్‌ రూరల్‌: చిన్నచిన్న వ్యాపారాలు చేసినా కలిసి రాలేదు. దీంతో డబ్బుల కోసం దొంగ నోట్లు ముద్రించాలని నిర్ణయించుకున్నాడు. యూ ట్యూబ్‌లో తయారీ విధానం నేర్చుకుని దొంగ నోట్లు ముద్రించాక చలామణి ప్రారంభించాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడగా భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు కుమారులను మహబూబాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో సామల శ్రీనివాస్‌ మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం మడగూడలో ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్‌ చేసేవాడు. భార్య, ఇద్దరు కుమారులతో హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు సాయిచరణ్‌ డిగ్రీ చదువుతూ సినిమా రంగం వైపు మళ్లాడు. షార్ట్‌ ఫిల్మ్‌లు, ప్రైవేటు సాంగ్‌ ఆల్బమ్‌ లు తయారు చేస్తున్నాడు. ఇంతలో ఓ పెద్ద సినిమాలో నటించేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ దగ్గర పనిచేసే పేట శ్రీనివాస్‌ అవకాశం ఇచ్చినా పెట్టుబడి కావాలనడంతో మరోమా ర్గంలేక యూట్యూబ్‌లో నకిలీ నోట్లు తయారీ విధానం నేర్చుకుని ఒక కలర్‌ ప్రింటర్, రెవెన్యూ స్టాంప్‌లకు ఉపయోగించే పేపర్లను కొనుగోలు చేసుకుని రూ.200, రూ. 500, రూ.2వేల నకిలీ నోట్లను తయారు చేశాడు.

గ్రామాల్లోనైతే సులువు 
నకిలీ నోట్లు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మార్పిడి చేస్తే గుర్తు పడతారని భావించిన శ్రీనివాస్‌ గ్రామాలను ఎంచుకున్నాడు. ఇందుకు ఓ మహింద్రా జైలో వాహనాన్ని సమకూర్చుకుని మూడు నెలల నుంచి వరంగల్, ఖమ్మం, నల్ల గొండ ఉమ్మడి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతా ల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లిలో బెల్టు షాపులో రూ.500 నోటు, మరో మహిళ వద్ద రూ.500 నోటు మార్పిడి చేద్దామని యత్నించాడు. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసముద్రం ఎస్సై బి.సతీశ్‌ విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కేసముద్రం వద్ద మహింద్రా జైలో వాహనంలో వెళ్తున్న సామల శ్రీనివాస్, ఆయన భార్య నాగలక్ష్మి, వారి కుమారులు సాయిచరణ్, అఖిల్‌ పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.69,900 నకిలీ నోట్లు, రూ.29,870 అసలైన నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement