nakli notes
-
సకుటుంబ కరెన్సీ ముద్రణ!
మహబూబాబాద్ రూరల్: చిన్నచిన్న వ్యాపారాలు చేసినా కలిసి రాలేదు. దీంతో డబ్బుల కోసం దొంగ నోట్లు ముద్రించాలని నిర్ణయించుకున్నాడు. యూ ట్యూబ్‌లో తయారీ విధానం నేర్చుకుని దొంగ నోట్లు ముద్రించాక చలామణి ప్రారంభించాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడగా భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు కుమారులను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో సామల శ్రీనివాస్ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేసేవాడు. భార్య, ఇద్దరు కుమారులతో హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు సాయిచరణ్ డిగ్రీ చదువుతూ సినిమా రంగం వైపు మళ్లాడు. షార్ట్ ఫిల్మ్‌లు, ప్రైవేటు సాంగ్ ఆల్బమ్ లు తయారు చేస్తున్నాడు. ఇంతలో ఓ పెద్ద సినిమాలో నటించేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్ దగ్గర పనిచేసే పేట శ్రీనివాస్ అవకాశం ఇచ్చినా పెట్టుబడి కావాలనడంతో మరోమా ర్గంలేక యూట్యూబ్‌లో నకిలీ నోట్లు తయారీ విధానం నేర్చుకుని ఒక కలర్ ప్రింటర్, రెవెన్యూ స్టాంప్లకు ఉపయోగించే పేపర్లను కొనుగోలు చేసుకుని రూ.200, రూ. 500, రూ.2వేల నకిలీ నోట్లను తయారు చేశాడు. గ్రామాల్లోనైతే సులువు నకిలీ నోట్లు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మార్పిడి చేస్తే గుర్తు పడతారని భావించిన శ్రీనివాస్ గ్రామాలను ఎంచుకున్నాడు. ఇందుకు ఓ మహింద్రా జైలో వాహనాన్ని సమకూర్చుకుని మూడు నెలల నుంచి వరంగల్, ఖమ్మం, నల్ల గొండ ఉమ్మడి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతా ల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 19వ తేదీ సాయంత్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లిలో బెల్టు షాపులో రూ.500 నోటు, మరో మహిళ వద్ద రూ.500 నోటు మార్పిడి చేద్దామని యత్నించాడు. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసముద్రం ఎస్సై బి.సతీశ్ విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కేసముద్రం వద్ద మహింద్రా జైలో వాహనంలో వెళ్తున్న సామల శ్రీనివాస్, ఆయన భార్య నాగలక్ష్మి, వారి కుమారులు సాయిచరణ్, అఖిల్ పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.69,900 నకిలీ నోట్లు, రూ.29,870 అసలైన నోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
అమ్మో..!
కడప కేంద్రంగా నకిలీ నోట్ల దందా నడుస్తోందా.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయా.. బుధవారం బద్వేలులో జరిగిన పరిణామాలు చూస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా ఈ విధంగానే దర్యాప్తు సాగిస్తున్నారు. బద్వేలు, న్యూస్‌లైన్: పట్టణంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో బుధవారం రూ.1.62లక్షల విలువైన 162 వెయ్యి రూపాయల నకిలీ నోట్లు దొరికాయి. బద్వేలు సీఐ రాజా, ఎస్ఐ నాగమురళి చెప్పిన వివరాల మేరకు... మండలంలోని రెడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసుల రెడ్డి కొంతకాలం కిందట పెంచల్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద బద్వేలు పట్టణంలో స్థలం రిజిస్ట్రేషన్‌కు రూ.2లక్షలు అప్పు తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లిన శ్రీనివాసుల రెడ్డి వారం క్రితం కడపకు చెందిన కొండయ్య అనే వ్యక్తికి డబ్బు పంపించి తన ఇంట్లో ఇవ్వాలని చెప్పాడు. ఈ మేరకు కొండయ్య ఆ డబ్బును తీసుకొచ్చి శ్రీనివాసుల రెడ్డి భార్య యశోదమ్మకు అప్పగించాడు. తన వివరాలేమీ చెప్పకుండా తన ఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చాడు. డబ్బును తీసుకున్న ఆమె బాకీ ఉన్న పెంచల్రెడ్డికి ఇచ్చారు.. ఈ నేపథ్యంలో మడకలవారిపల్లెకు చెందిన పల్లె చిన్నపురెడ్డి బ్యాంకులో తాకట్టులో ఉన్న తన నగలను విడిపించుకోవాలని పెంచల్ రెడ్డిని అప్పు అడిగాడు. దీంతో యశోదమ్మతో ఇచ్చిన డబ్బుతోపాటు మొత్తం రూ. 2 లక్షలు చిన్నపురెడ్డికి అప్పుగా ఇచ్చారు. దీన్ని ఆయన బంగారు విడిపించేందుకు బుధవారం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జమ చేయగా క్యాషీయర్ వీటిలో 162 నోట్లు నకిలీవని గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు బ్యాంకు మేనేజరు దామోదర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ రాజా తెలిపారు. కొండయ్య పట్టుబడితే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని, ఆయన ఫోన్ నెంబరుకు యశోదతో ఫోన్ చేయించగా తాను కావలిలో ఉన్నానని నాలుగు రోజుల తర్వాత వస్తానని సమాధానం చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. కడప కేంద్రంగానే ఈ నకిలీ నోట్ల దందా నడుస్తుందనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. -
నకిలీనోట్ల చెలామణి
మానవపాడు, న్యూస్‌లైన్: చిరు వ్యాపారులతో పాటు కూల్‌డ్రింక్స్ షాపులు, బె ల్టుషాపులను ఎంచుకుని నకిలీనోట్లను చెలామణి చేసేందుకు వచ్చిన ముఠాను మానవపాడు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని చంద్రశేఖర్ నగర్లో పట్టుకున్న వారి నుంచి 64 నకిలీ వెయ్యి రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను అలంపూర్ సీఐ రాజు వెల్లడించారు. కర్నూలు పట్టణంలోని బాలాజీనగర్ కాలనీకు చెందిన సాయిప్రకాశ్‌రెడ్డి వృత్తిరీత్యా ప్రైవేట్ లెక్చరర్. మూడేళ్ల క్రితం మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రి లెక్చరర్‌గా పనిచేశాడు. అయితే ఈ పరిసర ప్రాంతాలు పూర్తిగా తెలియడంతో నకిలీనోట్లను చెలామణి చేయొచ్చని ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం (ఏపీ 21 ఏటీ 4366 టాటాసుమో) వాహనంలో వచ్చి మండలంలోని పుల్లూరు, మెన్నిపాడు, కొర్విపాడు, చంద్రశేఖర్‌నగర్ గ్రామాల్లోని పలు బెల్టుషాపులు, చిన్న చిన్న దుకాణాల్లో నకిలీ వెయ్యి రూపాయల నోట్లు ఇస్తూ మద్యం కొనుగోలు చేశాడు. అయితే మెన్నిపాడు గ్రామంలో లక్షణ్గౌడ్ అనే కిరాణ దుకాణం యజమాని వారిచ్చిన నకిలీ నోటును గుర్తించి గ్రామస్తులను వెంటపెట్టుకుని చెలామణి చేసేందుకు వచ్చిన వాహనాన్ని వెంబడించారు. వారు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అలాగే చంద్రశేఖర్‌నగర్‌లోని మరో బెల్టుషాపులో వెయ్యిరూపాయల నకిలీనోటు ఇచ్చి రెండు బీర్లు కొన్నాడు. అనుమానం కలిగిన యజమాని నకిలీనోటు ఇచ్చావేంటని ప్రశ్నించగా..సాయిప్రకాశ్రెడ్డిడ్రైవర్ను వాహనం తీయాల్సిందిగా పురమాయించాడు. అయితే స్థానికులు చుట్టుముట్టి సాయిప్రకాశ్‌రెడ్డితో పాటు కారు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 64 వెయ్యి రూపాయల నకిలీనోట్లు, అలాగే 52 అసలు ఐదువందల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఐపీసీ 489ఏ, 489 బీ, 489 సీ కేసులు నమోదుచేసి దర్యాపు చేస్తున్నామని సీఐ రాజు తెలిపారు. సాయిప్రకాశ్‌రెడ్డితో పాటు ఇంకా నలుగురు ఉన్నట్లు సమాచారం. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని సీఐ రాజు తెలిపారు. ఇటిక్యాల ఎస్ఐ జయశంకర్, శాంతినగర్ ఎస్ఐ నరేందర్, మానవపాడు ఎస్ఐ మధుసూదన్‌గౌడ్‌కు కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రవాణా? కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి నకిలీనోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చెలామణి చేస్తున్నట్లు తెలిసింది. టాటాసుమో వాహనంలో ఎక్స్‌ఆర్మీ బోర్డును ఏర్పాటు చేసుకుని, మారుమూల గ్రామాల్లోని నిరక్షరాస్యులు, చిరువ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈ నోట్లను చెలామణి చేసేందుకు శ్రీకారం చుట్టారు. వారు ప్రయాణించిన వాహనంలో కర్ణాటకలోని మరూర్ టోల్‌గేట్‌కు సంబంధించిన టోల్‌చార్జీ రసీదు లభించింది. అక్కడ ఆదివారం ఉదయం ఏడుగంటలకు టోల్బిల్లు తీసుకున్నట్లుగా ఉంది. అదే విధంగా 44వ హైవే బెంగళూర్ రోడ్డు అమకటాడు టోల్‌ప్లాజా వద్ద టోల్‌చార్జీ చెల్లించి తెల్లవారుజామున అక్కడ నుంచి పయనమయ్యారు. అంటే అక్కడినుంచి నేరుగా నకిలీనోట్ల నోట్లను తీసుకుని మానవపాడు మండలంలో చెలామణి చేసినట్లు తెలుస్తోంది.