కడప కేంద్రంగా నకిలీ నోట్ల దందా నడుస్తోందా.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయా.. బుధవారం బద్వేలులో జరిగిన పరిణామాలు చూస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా ఈ విధంగానే దర్యాప్తు సాగిస్తున్నారు.
బద్వేలు, న్యూస్‌లైన్: పట్టణంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో బుధవారం రూ.1.62లక్షల విలువైన 162 వెయ్యి రూపాయల నకిలీ నోట్లు దొరికాయి. బద్వేలు సీఐ రాజా, ఎస్‌ఐ నాగమురళి చెప్పిన వివరాల మేరకు... మండలంలోని రెడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసుల రెడ్డి కొంతకాలం కిందట పెంచల్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద బద్వేలు పట్టణంలో స్థలం రిజిస్ట్రేషన్‌కు రూ.2లక్షలు అప్పు తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లిన శ్రీనివాసుల రెడ్డి వారం క్రితం కడపకు చెందిన కొండయ్య అనే వ్యక్తికి డబ్బు పంపించి తన ఇంట్లో ఇవ్వాలని చెప్పాడు. ఈ మేరకు కొండయ్య ఆ డబ్బును తీసుకొచ్చి శ్రీనివాసుల రెడ్డి భార్య యశోదమ్మకు అప్పగించాడు. తన వివరాలేమీ చెప్పకుండా తన ఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చాడు. డబ్బును తీసుకున్న ఆమె బాకీ ఉన్న పెంచల్‌రెడ్డికి ఇచ్చారు..
ఈ నేపథ్యంలో మడకలవారిపల్లెకు చెందిన పల్లె చిన్నపురెడ్డి బ్యాంకులో తాకట్టులో ఉన్న తన నగలను విడిపించుకోవాలని పెంచల్ రెడ్డిని అప్పు అడిగాడు. దీంతో యశోదమ్మతో ఇచ్చిన డబ్బుతోపాటు మొత్తం రూ. 2 లక్షలు చిన్నపురెడ్డికి అప్పుగా ఇచ్చారు. దీన్ని ఆయన బంగారు విడిపించేందుకు బుధవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో జమ చేయగా క్యాషీయర్ వీటిలో 162 నోట్లు నకిలీవని గుర్తించారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు బ్యాంకు మేనేజరు దామోదర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ రాజా తెలిపారు. కొండయ్య పట్టుబడితే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని, ఆయన ఫోన్ నెంబరుకు యశోదతో ఫోన్ చేయించగా తాను కావలిలో ఉన్నానని నాలుగు రోజుల తర్వాత వస్తానని సమాధానం చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. కడప కేంద్రంగానే ఈ నకిలీ నోట్ల దందా నడుస్తుందనే అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
అమ్మో..!
Published Fri, Apr 4 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM
Advertisement
Advertisement