నకిలీనోట్ల చెలామణి | duplicate money notes police people received from thives | Sakshi
Sakshi News home page

నకిలీనోట్ల చెలామణి

Published Mon, Sep 2 2013 5:08 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM

duplicate money notes police people received from thives

మానవపాడు, న్యూస్‌లైన్: చిరు వ్యాపారులతో పాటు కూల్‌డ్రింక్స్ షాపులు, బె ల్టుషాపులను ఎంచుకుని నకిలీనోట్లను చెలామణి చేసేందుకు వచ్చిన ముఠాను మానవపాడు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని చంద్రశేఖర్ నగర్‌లో పట్టుకున్న వారి నుంచి 64 నకిలీ వెయ్యి రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను అలంపూర్ సీఐ రాజు వెల్లడించారు. కర్నూలు పట్టణంలోని బాలాజీనగర్ కాలనీకు చెందిన సాయిప్రకాశ్‌రెడ్డి వృత్తిరీత్యా ప్రైవేట్ లెక్చరర్. మూడేళ్ల క్రితం మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రి లెక్చరర్‌గా పనిచేశాడు. అయితే ఈ పరిసర ప్రాంతాలు పూర్తిగా తెలియడంతో నకిలీనోట్లను చెలామణి చేయొచ్చని ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నాడు.
 
 ఈ క్రమంలో ఆదివారం (ఏపీ 21 ఏటీ 4366 టాటాసుమో) వాహనంలో వచ్చి మండలంలోని పుల్లూరు, మెన్నిపాడు, కొర్విపాడు, చంద్రశేఖర్‌నగర్ గ్రామాల్లోని పలు బెల్టుషాపులు, చిన్న చిన్న దుకాణాల్లో నకిలీ వెయ్యి రూపాయల నోట్లు ఇస్తూ మద్యం కొనుగోలు చేశాడు. అయితే మెన్నిపాడు గ్రామంలో లక్షణ్‌గౌడ్ అనే కిరాణ దుకాణం యజమాని వారిచ్చిన నకిలీ నోటును గుర్తించి గ్రామస్తులను వెంటపెట్టుకుని చెలామణి చేసేందుకు వచ్చిన వాహనాన్ని వెంబడించారు. వారు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అలాగే చంద్రశేఖర్‌నగర్‌లోని మరో బెల్టుషాపులో వెయ్యిరూపాయల నకిలీనోటు ఇచ్చి రెండు బీర్లు కొన్నాడు. అనుమానం కలిగిన యజమాని నకిలీనోటు ఇచ్చావేంటని ప్రశ్నించగా..సాయిప్రకాశ్‌రెడ్డిడ్రైవర్‌ను వాహనం తీయాల్సిందిగా పురమాయించాడు. అయితే స్థానికులు చుట్టుముట్టి సాయిప్రకాశ్‌రెడ్డితో పాటు కారు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 64 వెయ్యి రూపాయల నకిలీనోట్లు, అలాగే 52 అసలు ఐదువందల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఐపీసీ 489ఏ, 489 బీ, 489 సీ కేసులు నమోదుచేసి దర్యాపు చేస్తున్నామని సీఐ రాజు తెలిపారు. సాయిప్రకాశ్‌రెడ్డితో పాటు ఇంకా నలుగురు ఉన్నట్లు సమాచారం. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని సీఐ రాజు తెలిపారు. ఇటిక్యాల ఎస్‌ఐ జయశంకర్, శాంతినగర్ ఎస్‌ఐ నరేందర్, మానవపాడు ఎస్‌ఐ మధుసూదన్‌గౌడ్‌కు కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.
 
 కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రవాణా?
 కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి నకిలీనోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చెలామణి చేస్తున్నట్లు తెలిసింది. టాటాసుమో వాహనంలో ఎక్స్‌ఆర్మీ బోర్డును ఏర్పాటు చేసుకుని, మారుమూల గ్రామాల్లోని నిరక్షరాస్యులు, చిరువ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈ నోట్లను చెలామణి చేసేందుకు శ్రీకారం చుట్టారు. వారు ప్రయాణించిన వాహనంలో కర్ణాటకలోని మరూర్ టోల్‌గేట్‌కు సంబంధించిన టోల్‌చార్జీ రసీదు లభించింది. అక్కడ ఆదివారం ఉదయం ఏడుగంటలకు టోల్‌బిల్లు తీసుకున్నట్లుగా ఉంది. అదే విధంగా 44వ హైవే బెంగళూర్ రోడ్డు అమకటాడు టోల్‌ప్లాజా వద్ద టోల్‌చార్జీ చెల్లించి తెల్లవారుజామున అక్కడ నుంచి పయనమయ్యారు. అంటే అక్కడినుంచి నేరుగా నకిలీనోట్ల నోట్లను తీసుకుని మానవపాడు మండలంలో చెలామణి చేసినట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement