Tanda
-
చదువుల తండా.. రూప్లానాయక్ తండా
సాక్షి, మహబూబాబాద్: లంబాడ తండాలు అంటే అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటాయని అనుకుంటారు. కానీ ఏడు దశాబ్దాల క్రితమే ఆ తండా అక్షరాస్యతతో అభివృద్ధి దిశగా పయనించింది. మహబూబాబాద్ జిల్లాలోని సీరోలు మండలం రూప్లానాయక్ తండా (కలెక్టర్ తండా)లో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో దాదాపు అన్ని విభాగాలు, దేశ విదేశాల్లో.. డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు ఇలా అన్ని రంగాల్లో రాణించారు. జలపతినాయక్ నుంచి చదువుల ప్రస్థానం భారతదేశాన్ని బ్రిటీష్ వారు పాలిస్తున్న కాలంలో బానోత్, తేజావత్ కుటుంబాలకు చెందినవారు సీరోలు గ్రామానికి సమీపంలో తండాను ఏర్పాటు చేశారు. ఈ తండాకు చెందిన జలపతినాయక్ అప్పటి మదరాసాల్లో ఉర్దూ మీడియంలో ఐదోతరగతి వరకు చదువుకొని సమీపంలోని చింతపల్లి గ్రామ పోలీస్ పటేల్‌గా ఉద్యోగం చేశారు. ఆయన్ను చూసి తండాకు చెందిన బానోత్ చంద్రమౌళినాయక్ హెచ్ఎస్సీ చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు.. ఇలా మొదలైన తండాలో విద్యా ప్రస్థానం.. పిల్లలను పనికి కాకుండా బడికి పంపించడం అలవాటుగా మారింది. ఒకరిని చూసి ఒకరు పిల్లలను పక్కనే ఉన్న కాంపెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపించారు. ఆపై మహబూబాబాద్, అక్కడి నుంచి హైదరాబాద్ వరకు పిల్లలను పంపించి ఉన్నత చదువులు చదివించారు. అప్పుడు 20...నేడు 80 కుటుంబాలుమొదట 20 కుటుంబాలుగా ఉన్న రూప్లాతండా ఇప్పుడు 80 కుటుంబాలకు చేరింది. జనాభా 150 మంది ఉండగా, వీరిలో దాదాపు 90 శాతం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగులుగా, జాతీయ అంతర్జాతీయ రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తండాకు చెందిన జలపతినాయక్ కు ఎనిమిది మంది కుమారులు, ఎనిమిది మంది కుమా ర్తెలు.. వారి కుటుంబాల్లో మొత్తం 13 మంది డాక్టర్లు, ఒక ఐపీఎస్, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్, ఫార్మా, డిఫెన్స్, యూనివ ర్సిటీ ప్రొఫెసర్లుగా ఉన్నారు. చంద్రమౌళినాయక్ నలుగురి సంతానంలో యూఎస్, ఇతర దేశాల్లో స్థిరపడినవారు, డాక్టర్లు ఉన్నారు. బీమ్లానాయక్ కుటుంబానికి చెందిన రాంచంద్రునాయక్ లంబాడ నుంచి మొదటగా ఐఏఎస్ అధి కారిగా ఎంపికయ్యారు. రామోజీనాయక్ కుటుంబం నుంచి రమేష్‌నాయక్ ఐపీఎస్ కాగా, డిఫెన్స్, ఎయిర్‌ఫోర్స్, డాక్టర్లు ఇలా ఉన్నత చదువులు, అత్యున్నత ఉద్యోగాలు సాధించిన వారూ ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు ఆ తండా నుంచి ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, 20 మంది డాక్టర్లు, 25 మంది ఇంజనీర్లు, 10 మంది విదేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడ్డారు. ఆరుగురు పోలీస్ డిపార్ట్మెంట్లో, మరో పది మంది ఫార్మా కంపెనీల్లో పనిచేస్తుండగా, హైదరాబాద్, ఖమ్మం, ఢిల్లీ ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు చేస్తుండగా, మిగిలిన వారిలో కూడా చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు.తండాలో పుట్టినందుకు గర్వంగా ఉందినలభై సంవత్సరాల క్రితం నేను బడికి పోతుంటే అందరూ హేళన చేసేవారు. కానీ మా నాన్న ఉపాధ్యాయుడు కావడంతో నన్ను పట్టుదలతో చదివించారు. అప్పటివరకు మా లంబాడ ఇళ్లలో డాక్టర్ చదవం నాతోటే మొదలైంది. ఈ తండాలో పుట్టినందుకు గర్వంగా ఉంది. – కళావతిబాయి, ఖమ్మం జిల్లా డీఎంహెచ్ఓనాన్న ముందు చూపేఉర్దూ మీడియంలో ఐదవ తరగతి వరకు చదువుకున్న నాన్న ముందు చూపే తండాలో పుట్టిన వారి జీవన విధానాన్నే మార్చేసింది. కుటుంబాలు గడవడం ఇబ్బందైన రోజుల్లోనే ఇంటర్ హైదరాబాద్‌లో చదవించారు. అదే స్ఫూర్తిగా ఇప్పటి వరకు తండాలో పుట్టిన మాతోపాటు, మా బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదివి దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. – డాక్టర్ రూప్‌లాల్, మహబూబాబాద్ఒకరిని చూసి ఒకరు పోటీపడి చదివాంమా తండాలో పుట్టడం ఒక వరంగా భావిస్తాం. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అందరూ బడికి పోవాలి అని చెప్పేవారు. పిల్లల ప్రవర్త నపై దృష్టి పెట్టి ఎప్పటి కప్పుడు హెచ్చరించేవారు. అందుకోసమే ఏ పాఠశాల, ఏ కళాశాలకు వెళ్లినా మా తండా విద్యార్థి అంటే ప్రత్యేకం. అందరం పో టీపడి చదివాం. ఐఏఎస్, ఐపీఎస్ నుంచి అన్ని రకాల ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. – జగదీష్, మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంవో -
‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు..
గిరిజనులకు తల్లీ తండ్రి ప్రకృతే. కొరత లేకుండా ధాన్యాన్ని పస్తులు ఉంచకుండా పంటల్ని పుష్కలంగా ఇవ్వడమే కాదు తమకు అనువైన తోడును కూడా ప్రకృతి మాతే తీసుకువస్తుందన్నది ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకం పెళ్లీడుకు వచ్చిన పడతుల్లో కోటి ఆశలను విరబూయిస్తుంది. ఆ ఆశలే ఇంటింటా సంబరమవుతాయి.పంట సాగు నుండి కన్నెపిల్లల పరిణయాల వరకు అంతా ప్రకృతి చెప్పిన విధంగానే నడుచుకుంటారు గిరిజనులు. అంతటి ప్రాధాన్యత కల్గిన వాటిల్లో ‘తీజ్’ పండుగ ముఖ్యమైనది."నాకు అరవై ఏళ్లు. మా చిన్నప్పుడు కూడా తీజ్ పండుగ చేసుకున్నాం. తీజ్ పెరిగిన తీరును చూసి మా అమ్మానాన్నలు, తండా పెద్దలు నాకు పెళ్లి చేశారు. ఇదే ఆనవాయితీ మా పిల్లలు కూడా చేస్తున్నారు0." – భూక్యా వీరమ్మ గన్యాతండ, మహబూబాబాద్తీజ్ అంటే..పెళ్లీడుకు వచ్చిన గిరిజన (లంబాడ) అమ్మాయిలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. గోధుమ నారునే కాదు ఈ కాలాన కనిపించే ఆరుద్ర పురుగులనూ తీజ్ అంటారు. ఎర్రగా అందంగా ఉండే ఆరుద్ర పురుగులను దేవుడు తమకోసం పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు మనసులో కోరుకున్న కోరిక ఫలిస్తుందని వీరి నమ్మకం.ఇంటింటి ఆశీస్సులు..పెళ్లీడుకు వచ్చిన యువతులు తమకు కావాల్సిన వరుడి కోసం చేసే ఈ పండగకు ముందు గా తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. యువతులందరు ఇంటింటికి వెళ్లి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, వారు కానుకగా ఇచ్చే విరాళం తీసుకోవడంతో తండా అంతా సందడిగా మారుతుంది. ఇలా సేకరించిన విరాళం (ధాన్యం) తో తమకు కావాల్సిన గోధుమలు, శనగలు, ఇతర సామాన్లు కొనుగోలు చేస్తారు.గోధుమ మొలకలు..తీజ్ పండుగలో ముఖ్యమైనది తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్ళి దుస్సేరు తీగలు తెచ్చి, బుట్టలను అల్లి, తమ ఆరాధ్య దైవం తుల్జా భవాని, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి, పుట్టమట్టిని తెస్తారు. మేకల ఎరువును కలిపి తండా నాయక్ చేతిలో ఉంచిన బుట్టలో ΄ోస్తారు. అప్పటికే నానబెట్టి ఉంచిన గోధుమలను అందులో వేస్తారు. శనగలకు రేగుముళ్లుతీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనగలకు యువతులు రేగుముళ్లు గుచ్చుతారు. ఈ ప్రక్రియను బావ వరుసయ్యే వారు పడతుల మనస్సు చెదిరేలా వారిని కదిలిస్తూ ఉంటారు.నియమ నిష్టలతో..తండాలోని యువతులందరు తమ బుట్టలను ఒకేచోట పెడతారు. ఈ తొమ్మిది రోజులు పెట్టిన బుట్టలకు నీళ్లు ΄ోస్తూ, వాటి చుట్టూ తిరుగుతూ గిరిజన నృత్యాలు, పాటలు పాడుతూ గడుపుతారు.ఏడవ రోజు ఢమోళీ.. ఏడవరోజు జరిగే ఢమోళీ చుర్మోను మేరామా భవానీకి నివేదిస్తారు. వెండితో చేసిన విగ్రహం, రూపాయి బిళ్ల అమ్మవారి ముందు పెట్టి మేక΄ోతులు బలి ఇచ్చే తంతును‘ఆకాడో’ అంటారు.దేవతల ప్రతిరూపాలకు..ఎనిమిదవ రోజు మట్టితో ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సాంప్రదాయాల ప్రకారం పెండ్లి చేస్తారు. ఆడపిల్లలు పెళ్లి కూతురుగా, మగ పిల్లలు పెళ్లికొడుకుగా ఊహించుకుంటూ ఈ తంతులో పాల్గొంటారు. పెళ్లి తర్వాత తమ కుటుంబ సభ్యులను విడిచి పెడుతున్నట్లు ఊహించుకుని ఏడ్వడం, వారిని కుటుంబ సభ్యులు ఓదార్చడంతో ఈ తంతును నిర్వహిస్తారు.తొమ్మిదవ రోజు నిమజ్జనం..డప్పు చప్పుళ్లు, నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను అందజేస్తారు. యువతులు ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ పూజాఫలంగా పెరిగిన తీజ్‌ను అన్నదమ్ముళ్లకు ఇచ్చి.. వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తర్వాత యువతీ, యువకులు బుట్టలను పట్టుకొని ఊరేగింపుగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. – ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్, ఫొటోలు: మురళీ కృష్ణ -
రైతు బిడ్డకు విదేశీ విద్యా దీవెన.. జర్మనీలో ఉన్నత చదువులు
పుల్లల చెరువు మండలం సుద్దకురువ గిరిజన తండా నుంచి బనావత్ పవన్‌కుమార్ నాయక్ జర్మనీలో ఉన్నత చదువులు చదివేందుకు అర్హత సాధించాడు. తండ్రి వెంకటేశ్వర్లు నాయక్ రైతు. తనకున్న 35 సెంట్లతో పాటు, ఐదు ఎకరాలు కౌలు తీసుకుని మిర్చి, పత్తి సాగు చేశాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కరువు కరాళ నృత్యం చేయడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులు తీర్చలేక 2018లో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించారు. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కింది. ఇక పవన్‌కుమార్ చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూనే ఉన్నాడు. భర్త ఆత్మహత్య చేసుకున్నా కొడుకు ఆసక్తి గమనించిన తల్లి పద్మావతి కూలి పనులు చేసుకుంటూ చదివిస్తూ వస్తోంది. పవన్‌కుమార్ కూడా చదువుపై దృష్టిని లగ్నం చేశాడు. జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపికై జర్మనీలో చదువుకుంటున్నాడు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పవనకుమార్ తల్లికి ఇంటి పట్టా ఇచ్చి సొంత ఇంటి కలను కూడా నెరవేర్చింది. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఆమెకు ప్రతి నెలా వితంతు పెన్షన్ రూ.2,750 ఇచ్చి ఆదుకుంటోంది. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో పంటలు పండక అప్పుల పాలయ్యామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమ కుటుంబాన్ని ఆదుకున్నారని, నా బిడ్డను జర్మనీ పంపించి చదివిస్తున్నారని కన్నీటి పర్యంతమైంది . -
చివరి ఊరుపై చిన్నచూపు!
నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ మండ లం చివరి గ్రామమైన ధర్మారం తండా అభివృద్ధి వి షయంలో పాలకులు, అధికారులు చిన్నచూపు చూ స్తున్నారు. అన్నిగ్రామాల్లో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తుండగా ధర్మారం తండాలో మాత్రం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. తండాలను గ్రామ పంచాయతీగా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయంతో ధర్మారం గ్రామం నుంచి తండాను వేరు చేశారు. గ్రామంలో సరైన రోడ్లు, డ్రెయినేజీలు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ భవనం మంజూరైనా.. ధర్మారం తండాలో గ్రామ పంచాయతీ భవనం ప్రస్తుతం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని ఓ గదిలో నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా స్థలం లేకపోవటంతో పనులు చేపట్టడం లేదు. గ్రామ సమీపంలో ఉన్న అటవీశాఖకు చెందిన స్థలం కొంత కేటాయిస్తే తప్పా భవన నిర్మాణం పనులు ముందుకుసాగేలా లేదు. ప్రజాప్రతినిధులు, ఫారెస్టు అధికారులు కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తే తప్పా భవనం నిర్మాణం నోచుకుంటుంది. -
బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
పెద్దేముల్: మండల పరిధిలోని ఇందూరు మీదుగా బస్సు నడపాలని సోమవారం జైరాంతండా విద్యార్థులు రోడ్డెక్కారు. సుమారు గంట పాటు ఓంలానాయక్‌తండా– జైరాంతండా రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాలు రెండువైపులా నిలిచిపోయాయి. గతంలో ఇందూరు, తట్టెపల్లి మీదుగా బస్సు నడిచేదని, ఆ బస్సును అడ్కిచెర్ల, జిన్గూర్తి మీదుగా నడపడం వల్ల పాఠశాలకు వెళ్లే, వచ్చే సమయాల్లో బస్సులు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేదిలేక ఆందోళనకు దిగాల్సివచ్చిందని వారు వాపోయారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దులో ఓంలానాయక్‌తండా, జైరాంతండా ఉండటంతో బస్సులు తప్ప మరో అవకాశం లేదని, వెంటనే సంబంధిత అధికారులు బస్సును వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు తాండూరు డిపో మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. జైరాంతండా బస్సును ఇందూరు మీదుగా నడపాలని కోరారు. వెంటనే స్పందించి డీఎం తప్పకుండా జైరాంతండా బస్సును ఇందూరు మీదుగా నడుపుతామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
భర్తల భరతం పట్టిన భార్యామణులు!
కారేపల్లి: భార్యామణులు భర్తల భరతంపట్టారు. ఇంకొందరు పచ్చ బరిగెలతో వరసైన వారి వీపులను విమానం మోత మోగించారు. చేసేదేం లేక పురుషపుంగవులు పరుగు లంకించుకున్నారు. హోలీ సందర్భంగా గిరిజన తండాల్లో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. గత ఏడాది హోలీ నుంచి ఈ ఏడాది హోలీ మధ్యకాలంలో భూక్యా, లాకావత్, తేజావత్, వడిత్యా వంశస్తుల కుటుంబాల్లో ఎవరికైతే తొలి సంతానంగా మగబిడ్డ జన్మిస్తాడో ఆ ఇంట్లో డూండ్ వేడుక వైభవంగా నిర్వహిస్తారు. కారేపల్లి మండలం సామ్యతండాలో భూక్యా నగేష్, సుజాత దంపతులకు తొలి సంతానం మగబిడ్డ దర్శక్ జన్మించడంతో ఈ వేడుక నిర్వహించారు. డూండ్ అంటే గిరిజన భాషలో వెతకడం అని అర్థం కాగా, బాలుడిని ఒక ఇంట్లో దాచిపెట్టి గ్రామస్తులంతా వెతకడమే ఈ వేడుక! ఇదంతా హోలీ రోజు ముగియగా.. గురువారం గ్రామంలో ఓ గుంజ పాతి, తినుబండారాలు ఉన్న రెండు గంగాళాలను తాళ్లతో కట్టారు. గంగాళాలకు మహిళలు పచ్చి బరిగెలతో కాపలాగా ఉండగా, పురుషులు వాటిని ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. మహిళలు, పురుషులు సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాత్రలు ఎత్తుకెళ్లేందుకు వచ్చే పురుషులను మహిళలు సరదాగా కొడుతుండటం చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ వేడుకలో బావ, బావమరిది వంటి వరసైనవారు మహిళల దెబ్బల రుచి చూడాల్సిందే. చివరకు పురుషులు గంగాళాలను ఎత్తుకెళ్లి ఆరగించడంతో వేడుక ముగిసింది. -
ప్రకృతితోనే మమేకం.. ఆయుఃప్రమాణం 90 ఏళ్లకు పైనే.. ఈ తండా వెరీ స్పెషల్!
సాక్షి, రామారెడ్డి (ఎల్లారెడ్డి): పరిపూర్ణ ఆరోగ్యం, శారీరక, మానసిక ఆధ్యాత్మిక అనుసంధానమే ప్రకృతి జీవనం. ప్రకృతి జీవనం అంటే చెట్లు, పుట్టలు కొండలు, పక్షులతో సహజీవనంలో ఉండటమే. ప్రకృతిలో భాగమైన మనిషి పాశ్చాత్య నాగరికతకు అలవాటుపడి మానసిక, శారీరక ఆరోగ్యానికి దూరమై కాలుష్య ప్రపంచంలో భారంగా జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తండా ఆధునిక మానవుడికి తిరిగి ప్రకృతిని పరిచయం చేసి.. ప్రకృతి–మనిషి సంబంధాన్ని బలోపేతం చేసి భవిష్యత్తులో మానవ మనుగడకు పొంచి ఉన్న ముప్పును తప్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రాజమ్మ తండాపై ప్రత్యేక కథనం. తండావాసులకు వరం సహజసిద్ధ వాతావరణంలో జీవించడం వల్ల వారికి రోగ నిరోధిక శక్తి బాగా ఇనుమడిస్తుంది. తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి ఇన్ఫెక్షన్లు, జబ్బులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. తాజా గాలిని పీల్చుకోవడం వల్ల మెదడు కొత్త ఉత్సాహంతో పనిచేస్తుంది. ఇదే రాజమ్మ తండా వాసులకు వరంగా మారింది. పచ్చని ప్రకృతి మధ్య జీవించే వీరి జీవనోపాధి వ్యవసాయం. వీరి ఆయుఃప్రమాణం 90 ఏళ్లకు పైనే ఉంది. ఈ తండాలో గత 30 ఏళ్లలో ఏడుగురు మృతిచెందగా, వారిలో మధ్య వయస్కులు ఇద్దరు మాత్రమే అనా రోగ్యంతో మరణించారు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు వంద ఏళ్లు పూర్తిచేసుకోగా, ముగ్గురు 90 ఏళ్లలో మరణించారు. ఇప్పటికీ 90 ఏళ్లపైబడి ఉన్న వారు వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అల్లం–ఎల్లి కారంతో కలిపి.. వీరు వంటలు మొత్తం కట్టెల పొయ్యిపైనే చేస్తారు. వీరి ప్రధాన ఆహారం మక్క రొట్టెలు. అల్లం–ఎల్లి కారంతో వీటిని తింటారు. ఏ ఇంట్లో కూడా రొట్టె లేకుండా ఒక్కపూట కూడా గడవదని తండా వాసులు చెబుతారు. ఇళ్ల పక్కనే ఉన్న తమ పొలాల్లో పండించిన తాజా కూరగాయలను వాడతారు. ఒక్కో కుటుంబానికి సగటున నాలుగెకరాల పొలం ఉంటుంది. ఎల్రక్టానిక్ వస్తువులకు దూరం తండాలోని ఇళ్లలో టీవీ, ఫోన్ తప్ప ఏ ఇతర ఎలక్ట్రిక్ వస్తువు ఉండదు. తండాలో ఏ ఇంట్లో కూడా ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, కూలర్ లాంటివేవీ ఉండవు. మినరల్ వాటర్‌కు దూరం ఆధునిక కాలంలో పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని ఇళ్లలో తాగడానికి మినరల్ వాటర్ వాడుతున్నారు. కానీ, రాజమ్మ తండావాసులు మాత్రం బోరు నీళ్లనే తాగుతారు. తండాకు సమీపంలోనే వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ మినరల్ వాటర్ తాగడానికి ఇష్టపడరు. కరోనా దరిచేరలేదు ప్రపంచాన్నే వణికించిన కరోనా వైరస్ రాజమ్మ తండా దరి చేరలేదు. వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిన తండా వాసులు కరోనా వేళ తండాకు వచ్చి సేఫ్ జోన్లోకి వెళ్లారు. కరోనా రెండు దశల్లో కూడా ఏ ఒక్కరూ వైరస్ బారిన పడలేదు. చుట్టూ మంచి వాతావరణం నా వయసు 80 ఏళ్లు. రోజూ వ్యవసాయ పనులు చేస్తా. ఎలాంటి రోగాలు లేవు. మక్క రొట్టెలను పొద్దు, మాపు తింటా. ఇంటి చుట్టూ మంచి వాతావరణం ఉంటుంది. మా చుట్టూ ఉన్న వాతావరణమే మాకు రక్షణ. –శివరాం, రాజమ్మ తండా ఎలాంటి రోగం లేదు అప్పటికప్పుడు కట్టెల పొయ్యి మీద చేసిన మక్క రొట్టెలను తింటా. 76 ఏళ్ల వయసులో ఉన్నా. చలి కాలం దగ్గు, జర్వం తప్ప ఎలాంటి రోగం ఇప్పటివరకైతే రాలేదు. –మాలిబాయి, రాజమ్మతండా బోరు నీళ్లు తాగుతాం.. మాకు మినరల్ వాట ర్ అంటే తెలియదు. బోరు నీళ్లు తాగుతాం. అడవి నుంచి ఎండిపోయిన కట్టెలను తెచ్చుకుని కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటాం. నాకు 80 ఏళ్లు. ఎలాంటి రోగాలు లేవు. ఎప్పుడైనా జ్వరం వస్తే నీళ్లు గరం చేసి తాగుతా. జ్వరం పోతుంది. –గంగవాత్ సోరాత్, రాజమ్మతండా. -
రెండేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం..
యాదాద్రి (నల్లగొండ): యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పెద్ద తండాలో దారుణం చోటు చేసుకుంది. అదే తండాకు చెందిన నవీన్ అనే యువకుడు రెండేళ్ల పసిపాపపై అత్యాచారయత్నం చేశాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రుకు తెలవడంతో నవీన్ తండా నుంచి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: హైదరాబాద్ శివార్లలో భారీగా పేకాట -
కారంపొడి చల్లి.. కర్రలతో దాడి
ఇందల్వాయి/ధర్పల్లి: (నిజామాబాద్ రూరల్): ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం ఉద్రిక్తతకు దారితీసింది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కలసి నిందితుల ఇళ్లను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిపై కారం పొడి చల్లి.. కర్రలతో దాడి చేశారు. వీరిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా దాడికి యత్నించడంతో లాఠీచార్జి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం డీబీ తండాకు చెందిన మంజుల (22)కు గుట్టకింది తండాకు చెందిన లావుడ్య గణేష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. మంజుల ప్రవర్తన బాగోలేదని ఐదు రోజుల క్రితం గణేష్ ఆమెను మందలించాడు. కలత చెందిన మంజుల ఎవరికీ చెప్పకుండా తిరుపతికి వెళ్లింది. తమ కూతురు కనిపించడం లేదని మంజుల తల్లిదండ్రులు ఈ నెల 7న ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే.. మంజుల తిరుపతి నుంచి తన భర్త మిత్రుడైన గోపాల్‌తో మాట్లాడింది. ఫోన్ నంబరు ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి వెళ్లారు. ఇంతలోనే మంజుల స్వయంగా సోమవారం సాయంత్రం డీబీ తండాకు చేరుకుంది. ఇంటికి వెళ్లని ఆమెను మంగళవారం వేకువజామున పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్త గణేష్ అతని స్నేహితుడు గోపాల్‌ను శిక్షించాలని పోస్టుమార్టంను అడ్డుకున్నారు. మరోవైపు డీబీ తండా నుంచి 200 మంది మహిళలు మంగళవారం మధ్యాహ్నం డీసీఎం వ్యానులో గుట్టకింది తండాకు బయలు దేరారు. ముందస్తు సమాచారంతో పోలీసులు వారి వాహనాన్ని మార్గమధ్యలో అడ్డుకున్నారు. అయితే మహిళలు కారం పొడి, కర్రలు పట్టుకుని కాలినడకన గుట్టకింది తండాకు చేరుకున్నారు. పోలీసులను తోసేసి గణేష్, గోపాల్ ఇళ్లపై దాడి చేసి ఫర్నిచర్, తలుపులను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహిళా పోలీసులపై దాడి జరగడంతో లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇన్చార్జి ఏసీపీ ప్రభాకర్, అడిషనల్ డీజీపీలు ఉషా విశ్వనాథ్, రఘవీర్‌లు గుట్టకింది తండాకు చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. మంజుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు. గోపాల్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. గుట్టకింది తండాలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించి పోలీసులపై దాడి చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
చల్‌చల్ గుర్రం.. తండాకో అశ్వం
కొన్ని సినిమాల్లో హీరోల పాత్ర గొప్పగా పండాలంటే.. కచ్చితంగా గుర్రాల సీన్ ఉండాల్సిందే. పాత కాలంలో ఏమో గానీ.. ఆ మధ్యన మగధీరతో మొదలైన గుర్రపు స్వారీల హవా బాహుబలితో శిఖరాగ్రానికి చేరింది. అసలు విషయానికి వస్తే.. సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ కావడానికి ఉపయోగపడే గుర్రాలు విశాఖ మన్యంలోని మారుమూల తండాల్లో దౌడు తీస్తున్నాయి. ఇక్కడి గిరిజనులకు రవాణా సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. నిజం చెప్పాలంటే ఇక్కడి గిరిజనుల జీవనంలో అశ్వాలు ఓ భాగమయ్యాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కొండకోనల్లో విసిరేసినట్టుండే తండాల్లోని గిరి పుత్రులకు గుర్రాలే అసలైన నేస్తాలు. రోడ్లు లేని గ్రామాలు, అరణ్యాల నడుమ సుదూరంగా ఉండే గూడేల్ని చేరుకునేందుకు.. వర్షాకాలంలో గెడ్డలు, వాగులు దాటేందుకు గుర్రాలే సిసలైన వాహనాలు. కనీసం ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని చోటనుంచి అటవీ ఉత్పత్తుల్ని బాహ్య ప్రపంచానికి తరలించాలన్నా.. నిత్యావసర సరుకుల్ని తండాలకు తెచ్చుకోవాలన్నా ఈ ప్రాంత గిరిజనులు అశ్వాల్నే ఆశ్రయిస్తున్నారు. గూడేల్లోని గిరిపుత్రులు మండల కేంద్రాలకు.. అరకు, పాడేరు నియోజకవర్గ కేంద్రాలకు కాలి నడకన వెళ్లాలంటే కనీసం 12 నుంచి 25 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి, దిగాల్సి ఉంటుంది. తండాకు ఓ గుర్రం ఉంటే చాలు.. గిరిజనులు ఏడాది పొడవునా పండించే రాజ్మా చిక్కుళ్లు, రాగులు, జొన్నలు, కాఫీ, మిరియాలు, కొండ చీపుర్లు తదితర ఉత్పత్తులను వారపు సంతల్లో అమ్ముకునేందుకు.. సంతలో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులు, ఇతర సామగ్రిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు విశాఖ మన్యంలోని గూడేల ప్రజలు గుర్రాలపైనే వస్తారు. అత్యవసర సమయాల్లో వైద్యసేవల కోసం మండల కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు గుర్రాలనే వినియోగిస్తుంటారు. మారుమూల తండాలు, ఆవాస ప్రాంతాల్లో 10 నుంచి 15 కుటుంబాల వరకు నివసిస్తుంటాయి. వారిలో ఏ ఒక్క కుటుంబానికి గుర్రమున్నా అందరూ వినియోగించుకుంటారు. అంతా కలిసి దాన్ని పోషిస్తారు. వీటికి గడ్డి, ధాన్యం, దాణా, ఉలవలు ఆహారంగా పెడతారు. వాటిని ప్రాణ సమానంగా చూసుకుంటారు. మాడుగుల సంతలో.. మాడుగుల మండల కేంద్రంలోని వడ్డాది ప్రాంతంలో ప్రతి దసరా రోజున గుర్రాల సంత జరుగుతుంటుంది. ఒక్కో అశ్వం ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. నర్సీపట్నం సమీపంలోని కేడీ పేటలోనూ గుర్రాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అధికారిక విధులూ నిర్వర్తిస్తాయ్ - ఇక్కడి గుర్రాలను అడపాదడపా అధికారిక విధులకు సైతం వినియోగిస్తుంటారు - ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ అధికారులను తరలించేందుకు గుర్రాలే కీలకం - అటవీ ప్రాంతంలో మావోలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన సందర్భాల్లో మృతదేహాలను తరలించేందుకు సైతం గుర్రాలనే వాడుతుంటారు. వినియోగం ఎక్కడెక్కడంటే.. - జి.మాడుగుల మండలం కిల్లంకోట, లువ్వాసింగి - గెమ్మెలి పంచాయతీల పరిధిలోని తండాలు - చింతపల్లి మండలం బలపం పంచాయతీ - కోరుకొండ పంచాయతీ పరిధిలోని సుమారు 70 పల్లెలు - జీకే వీధి మండలం గాలికొండ, అమ్మవారి దారకొండ, జర్రెల, దుప్పిలవాడ, సప్పర్ల, ఎర్రచెరువుల - మొండిగెడ్డ, దారకొండ పంచాయతీల పరిధిలోని 150 తండాలు - పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని 45 నివాస ప్రాంతాలు - గిన్నెలకోట పంచాయతీలోని 18 నివాస ప్రాంతాలు - జామిగుడ పంచాయతీలోని 19 తండాలు - ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీలోని 18 పల్లెలు - బుంగాపుట్టు పంచాయతీలోని 24 నివాస ప్రాంతాలు - రంగబయలు పంచాయతీలోని 22 తండాలు టీచర్‌కూ కొనిచ్చారు జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ పరిధిలోని సుర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో చుట్టుపక్కల తండాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 60 వరకు ఉంది. రోడ్డు మార్గం సరిగ్గా లేక.. ఉపాధ్యాయులు సక్రమంగా రాక విద్యార్థుల డ్రాప్ అవుట్స్ శాతం పెరిగింది. మూడు నెలల క్రితం ఇక్కడకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు గంపరాయి వెంకటరమణ ఇబ్బందులు పడుతూనే క్రమం తప్పకుండా స్కూలుకు వచ్చేవారు. దీంతో గిరిజనులంతా కలిసి ఆయనకు ఓ గుర్రాన్ని కొనిచ్చారు. ఆయన దానిపైనే వస్తూ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. గుర్రం లేకుంటే మాకు జీవనం లేదు మేం పండించిన పంటలను అమ్ముకునేందుకు చింతపల్లి దరి లంబసింగిలో ప్రతి గురువారం సంతకు వస్తుంటాం. గుర్రంపై బరువు వేసి.. మేం నడుచుకుంటూ వస్తాం. గుర్రం లేకుంటే మాకు జీవనమే లేదు. – గూడా బాబూరావు, చీడిమెట్ట గ్రామం, కిల్లంకోట పంచాయతీ, జి.మాడుగుల మండలం మా పిల్లలకు అవే నేస్తాలు మా గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే గుర్రాలే దిక్కు. అందుకే వాటిని మేం ప్రాణంగా చూసుకుంటాం. మా పిల్లలకు అవే నేస్తాలు.. మా గుర్రాన్ని మా పిల్లలు రాజు అని పిలవగానే పరుగెత్తుకు వస్తుంది. – ఎండ్రపల్లి సూరిబాబు, సుర్తిపల్లి, కిల్లంకోట పంచాయతీ, జి.మాడుగుల మండలం -
జిల్ జిల్ జిగర్‌ఠండా
జిగర్ ఠండా అనేది మదురై ప్రాంతంలో అందరినీ ఆకర్షిస్తున్న పానీయం. జిగర్ అంటే గుండె, ఠండా అంటే చల్లగా అని అర్థం. అంటే ఈ పానీయం తాగడం వల్ల గుండె చల్లగా ఉంటుంది అని అర్థం. కావలసినవి ఐస్‌క్రీమ్ కోసం; పాలు – 2 కప్పులు; కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు; పంచదార – అర కప్పు; తాజా క్రీమ్ – రెండ కప్పులు; తియ్యటి పాలకోవా – 200 గ్రా.; వెనిలా ఎసెన్స్ – 2 టీ స్పూన్లు; చిక్కటి తియ్యటి పాల కోసం; పాలు – 2 కప్పులు ; తియ్య కోవా – 250 గ్రా. జిగర్ కోసం: బాదం పిసిన్ – 3 టేబుల్ స్పూన్లు; నన్నారి సిరప్ –తగినంత తయారీ: ∙ఒక పాత్రలో పాలు పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙పావు కప్పు చల్లటి పాలలో వెనిలా ఎసెన్స్, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙వేరే పాత్రలో పాలు, తియ్య కోవా వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద ఉంచిన పాలు మరుగుతుండగా, కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలను ఇందులో పోసి, ఉండకట్టకుండా ఉండేందుకు ఆపకుండా కలుపుతుండాలి ∙పాలు బాగా చిక్కబడుతుండగా, కోవా వేసిన పాలు పోసి మరోమారు కలపాలి ∙పంచదార జత చేసి మరోమారు కలిపి బాగా మరిగించి దింపి చల్లారనివ్వాలి ∙చల్లారాక క్రీము జత చేసి మళ్లీ బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ కంటెయినర్లోకి తీసుకుని మూత పెట్టి, డీప్ ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచాలి ∙బయటకు తీసి పాత్రలోకి తిరగబోసి, బాగా కలిపి మళ్లీ ప్లాస్టిక్ కంటెయినర్లో పోసి, మరో గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టి తీసి, చెక్క గరిటెతో బాగా కలిపి, వేరే పాత్రలోకి తీసుకోవాలి ∙ఇలా చేయడం వల్ల మెత్తటి ఐస్‌క్రీమ్ తయారవుతుంది ∙ఇలా నాలుగైదుసార్లు, మొత్తం ఆరు గంటలు చేయడంతో మెత్తటి ఐస్‌క్రీమ్ తయారవుతుంది ∙బాదం పిసిన్ (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది)ను నీళ్లలో ముందురోజు రాత్రంతా నానబెట్టాలి ∙జిగురులా తయారవుతుంది ∙మరుసటి రోజు ఉదయం వడకట్టి, పైన మిగిలిన పదార్థం తీసి పక్కన ఉంచాలి ∙మరొక పాత్రలో పాలు పోసి మూడు వంతులకు తగ్గేవరకు మరిగించాలి ∙తియ్య కోవా జత చే సి బాగా కలిపి పక్కనుంచాలి ∙ఫ్రిజ్‌లో నుంచి ఐస్‌క్రీమ్, పాలు, బాదం పిసిన్ బయటకు తీయాలి ∙నన్నారి సిరప్‌ను కూడా తీసుకోవాలి ∙ఒకపాత్రలో తగినంత బాదం పిసిన్, కోవా పాలు, నన్నారి సిరప్ వేసి బాగా కలిపి గ్లాసులలో పోయాలి ∙ఐస్‌క్రీమ్ స్కూప్‌తో తీసి పైన వేసి అందించాలి. -
పక్కా లోకల్ !
-
తండాలను పంచాయతీలుగా గుర్తించాలి
– ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్ నాయక్ కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా 500 జనాభా కలిగిన గిరిజన తండాలు, చెంచు గూడేలు, ఎరుకల కాలనీలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కైలాస్‌నాయక్ కోరారు. బుధవారం స్థానిక కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారామ్ నాయక్ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు కరపత్రాలను కైలాస్‌నాయక్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది లంబాడీ, చెంచు, యానాది, ఎరుకల తదితర గిరిజన తెగలకు చెందిన వారు ఉన్నారని, వీరి సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ముఖ్యమైన పదవులను గిరిజన వర్గాలకు రిటైర్డు ఐఏఎస్, ఐపీఎస్‌లతో భర్తీ చేయాలన్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు నెలకు రూ.5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, 50 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.1500 వృద్ధాప్య పింఛన్‌తోపాటు నిత్యావసరాలు అందించాలన్నారు. వచ్చే ఎన్నికల్లోS కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కనీసం ఒక్కో ఎమ్మెల్యే సీటును గిరిజనులకు కేటాయించాలన్నారు. అక్టోబర్ 2న అనంతపురం జిల్లా పుట్టపర్తిలో భారీ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమితి రాయలసీమ ఇంచార్జీ రామచంద్రనాయక్, జాతీయ నాయకులు శంకర్‌నాయక్, నాయకులు ఆనంద్‌నాయక్, మల్యానాయక్, మారుబాయి, ఇజ్జిబాయి, మహేష్‌నాయక్, లోకేష్‌నాయక్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంలో ఒకరి మృతి
జహీరాబాద్ : తండాకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఆనెగుంట గ్రామ పంచాయతీ జీడిగడ్డ తండాలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. జీడిగడ్డ తండాలో ఇళ్ల కు, వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ బిల్లులు దాదాపు చెల్లించ కపోవడంతో ఆదివారం అధికారులు సరఫరాను నిలిపేశారు. దీంతో తండా అంధకారంలో ఉండిపోయింది. అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న తండాకు చెందిన రూప్లా నాయక్ మరో వ్యక్తిని వెంటపెట్టుకుని ఆదివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో గ్రామ చివరిలో ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ వద్దకు వెళ్లాడు. అప్పటికే తన వెంట తీసుకెళ్లిన విద్యుత్ వైరుకు కొండి అమర్చి 11 కేవీ విద్యుత్ లైన్ వేశాడు. చేతిలో ఉన్న మరో వైరుకు విద్యుత్ సరఫరా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న వారు సోమవారం ఉదయం రూప్లానాయక్ మృతి చెందిన విషయాన్ని గమనించి తండా ప్రజలకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకుని రాత్రి 11 గంటల ప్రాంతంలో రూప్లానాయక్ మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యమే రూప్లా ప్రాణం తీసింది! విద్యుత్ అధికారుల నిర ్లక్ష్యం వల్లే రూప్లా నాయక్ మృతి చెందాడని, ఇందుకు బాధ్యత వహిస్తూ సంబంధిత అధికారులు మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని తండా వాసులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మృతదేహంతో సంబంధిత కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమాచారం అం దుకున్న రూరల్ ఎస్ఐ సత్యనారాయణ, ట్రాన్స్‌కో ఏడీఈ తులసీరాం, ఏఈ శ్రీనివాస్‌లు జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రి వద్దకు వెళ్లి మృతుడి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడారు. విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇందుకు సంబంధించిన నివేదికను కూడా అందజేశామని ఏడీఈ తులసీరాం తెలిపారు. శాఖాపరంగా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే ఇద్దరి కుమార్తెలకు వివాహాల య్యాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. బకాయిలు చెల్లించాలని చెబుతూనే ఉన్నాం డొమెస్టిక్‌కు సంబంధించి తండాలో సుమారు రూ. 1.50 లక్షలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి రూ. 70 వేలు బాకీ ఉన్నారు. వారం, పది రోజులుగా బకాయిలు చెల్లించాలని చెబుతానే ఉన్నాం. తండాకు చెందిన పెద్దలు కూడా ఓ తేదీని ఖరారు చేశారు. ఆ తేదీ కూడా దాటి పోయినా కట్టలేదు. దీంతో ఆదివారం విద్యుత్ సరఫరాను నిలిపివేశాం. - శ్రీనివాస్, రూరల్ విద్యుత్ ఏఈ