తండాలను పంచాయతీలుగా గుర్తించాలి
– ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్ నాయక్
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా 500 జనాభా కలిగిన గిరిజన తండాలు, చెంచు గూడేలు, ఎరుకల కాలనీలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కైలాస్‌నాయక్ కోరారు. బుధవారం స్థానిక కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారామ్ నాయక్ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు కరపత్రాలను కైలాస్‌నాయక్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది లంబాడీ, చెంచు, యానాది, ఎరుకల తదితర గిరిజన తెగలకు చెందిన వారు ఉన్నారని, వీరి సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ముఖ్యమైన పదవులను గిరిజన వర్గాలకు రిటైర్డు ఐఏఎస్, ఐపీఎస్‌లతో భర్తీ చేయాలన్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు నెలకు రూ.5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, 50 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.1500 వృద్ధాప్య పింఛన్‌తోపాటు నిత్యావసరాలు అందించాలన్నారు. వచ్చే ఎన్నికల్లోS కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కనీసం ఒక్కో ఎమ్మెల్యే సీటును గిరిజనులకు కేటాయించాలన్నారు. అక్టోబర్ 2న అనంతపురం జిల్లా పుట్టపర్తిలో భారీ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమితి రాయలసీమ ఇంచార్జీ రామచంద్రనాయక్, జాతీయ నాయకులు శంకర్‌నాయక్, నాయకులు ఆనంద్‌నాయక్, మల్యానాయక్, మారుబాయి, ఇజ్జిబాయి, మహేష్‌నాయక్, లోకేష్‌నాయక్ పాల్గొన్నారు.