
బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరిస్తున్న కుక్కునూరు పీహెచ్‌సీ డాక్టర్ జెస్సీలివింగ్ ఫెయిత్
కుక్కునూరు: ఏజెన్సీలోని కుక్కునూరు మండలం మారేడుబాక పంచాయతీ చుక్కలలొద్ది గ్రామంలో నెల రోజుల వ్యవధిలో ఐదుగురు గిరిజనులు అంతుచిక్కని వ్యాధులతో మృతిచెందడం కలకలం రేపుతోంది. మార్చిలో ఇద్దరు, ఈ నెలలో ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందారు. మండల కేంద్రమైన కుక్కునూరుకు 10 కి.మీ దూరంలోని అటవీ ప్రాంతంలో చుక్కలలొద్ది గ్రామం ఉంది. 11 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నుంచి 20 గుత్తికోయ కుటుంబాలు ఆ గ్రామానికి వలస వచ్చి పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి.
గతనెల మూడో వారంలో మడకం మాడా (38), కొవ్వాసి సోమడ (35) అంతుచిక్కని వ్యాధులతో మృతి చెందారు. ఈనెల 18, 19 తేదీల్లో మడకం అడమయ్య (50), సోడే సోమ (32), కుడం గంగమ్మ (28) ఇదే విధంగా మృతి చెందడంతో గ్రా మంలో కలకలం రేగింది. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది సోమవారం చుక్కలలొద్ది గ్రామాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు.
గిరిజనులు తాగుతున్న నీటి నమూనాలను ల్యాబ్ టెస్టింగ్‌కు పంపేందుకు సేకరించారు. ఈ విషయమై కుక్కునూరు పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ జెస్సీలివింగ్ ఫెయిత్ మాట్లాడుతూ కలుషిత నీరే గ్రామంలో మరణాలకు కారణమై ఉంటుందని తాము భావిస్తున్నట్టు తెలిపారు. అక్కడ నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment