ఆపాదమస్తకం.. రామనామం | Chhattisgarhs Ramnamis With Full Bodied Ram Ram Tattoos | Sakshi
Sakshi News home page

ఆపాదమస్తకం.. రామనామం

Published Fri, Feb 5 2021 2:46 AM | Last Updated on Fri, Feb 5 2021 5:26 AM

Chhattisgarhs Ramnamis With Full Bodied Ram Ram Tattoos - Sakshi

సాక్షి, భద్రాచలం: ‘ఓ రామ.. శ్రీరామ.. నీ నామమెంతో రుచిరా’అంటూ వేనోళ్ల కీర్తించాడు భక్త రామదాసు. కానీ ఆ గ్రామంలోని అందరూ వయో, లింగ భేదం లేకుండా ఆపాదమస్తకం రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకుని తమ దేహాన్నే దేవాలయం గా మార్చుకున్నారు. మనసును, దేహాన్ని శ్రీరామమయంగా మలుచుకున్నారు. అపర రామదాసుల్లా శ్రీరాముడిని నిత్యం కీర్తిస్తుంటారు.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌ జిల్లా సారంగడ్‌ తాలూకాలో నందేలి అటవీ ప్రాంతంలో ‘శ్రీరామనామి’తెగ వారు జీవిస్తుంటారు. వారి సంస్కృతి సంప్రదాయాలు చాలా వినూత్నంగా ఉంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు శిరస్సు నుంచి పాదం వరకు శ్రీరామ నామాలను పచ్చబొట్టుతో పొడిపించుకుంటారు. శ్రీరాముడిని ఆవహించుకున్నట్లు భక్తిభావంతో ప్రతిరోజూ శ్రీరామ నామాన్ని జపిస్తుంటారు. ఈ తెగలోని వారు మాంసాహారం, ధూమపానం, మద్యపానం సేవించకుండా నియమ నిష్టలతో రాముడిని పూజిస్తుంటారు. తమ పనులు, ఇళ్లలో శుభకార్యాలు జరిగినా శ్రీరామనామంతోనే ప్రారంభిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. 

దేహాన్నే ఆలయంగా మార్చుకుని.. 
19వ శతాబ్దంలో నాటి సామాజిక పరిస్థితుల వల్లే ‘శ్రీరామనామి’తెగ ఆవిర్భవించినట్లు ప్రచారంలో ఉంది. అప్పటి ఉన్నత తెగల వారు దేవాలయాల్లోకి కింది వర్గాల వారిని అనుమతించకపోయేవారు. దీంతో 1890వ దశకంలో పరశురామ్‌ అనే వ్యక్తి తన నుదిటిపై శ్రీరామ నామాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నాడని ప్రచారంలో ఉంది. ఆయనే ‘శ్రీరామనామి సమాజ్‌’కు ఆద్యుడు అని చెబుతుంటారు. అప్పటి నుంచి ఆ తెగకు చెందిన వారు శ్రీరామనామాన్ని చెరిగిపోని ముద్రగా భక్తి భావంతో ఉంచుకొని తమ దేహాన్నే దేవాలయంగా మలుచుకొని శ్రీరాముడిని కొలుస్తున్నట్లు చెబుతారు. ఒంటిపైనే కాకుండా వస్త్రాలను, నెమలి ఈకలతో చేసిన శిరస్త్రానంపై కూడా శ్రీరామ నామమే ఉంటుంది. 

ఏటా మూడ్రోజులు భజన 
రామనామి తెగ ఆధ్వర్యంలో ఏటా అక్కడ డిసెంబర్, జనవరిలో మూడు రోజుల పాటు భజన మేళా నిర్వహిస్తారు. అక్కడి తెగ వారి సంస్కృతీ సంప్రదాయాలకు విలువిచ్చి ఆ రాష్ట్రంలో ప్రభుత్వ నేతలు ఈ మేళాకు హాజరవుతారు. జాతరకు పెద్ద సంఖ్యలో తెగకు చెందిన వారు హాజరుకావడంతో పాటు ఆ తెగకు చెందిన యువతీ యువకులకు పెళ్లిళ్లు జరిపిస్తుంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement