మన్యంలో కాఫీ పథకం విజయవంతమైంది. ఏజెన్సీలో వీటి పరిమళాలు గుబాళిస్తున్నాయి. సుమారు ఆరు వేలమంది గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. దీనిని ప్రోత్సహించి మరింత మందికి ఆర్థిక ఆసరా కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. ‘అరకులోయ కాఫీ’ పేరిట అంతర్జాతీయ గుర్తింపుపొందిన దీనికి ఇటీవల ఫ్రాన్స్ ప్రభుత్వ పురస్కారం దక్కింది. రూ.కోట్లతో కాఫీ సాగుకు అవసరమైన రాయితీలను ఇవ్వడంతోపాటు సామగ్రిని అందజేయనుంది. గిరిజన రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు ఇస్తారు.
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : పదేళ్లుగా అరకువేలీ కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతూ వస్తోంది. ఆంధ్రలో ఒక్క విశాఖ మన్యంలోనే సాగవుతున్న దీనికి ఏజెన్సీలో అనుకూల పరిస్థితులున్నాయి. కాఫీ గింజల అమ్మకాలకు మా ర్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరిన్ని లాభాలు రా నున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా రంప చోడవరం పరిధిలో సమారుగా 4వేల హెక్టార్లలో కాఫీ సాగవుతోంది. వీటి నుంచి ఏటా సుమారు 600 టన్నుల కాఫీ గింజల దిగుబడి వస్తోంది. 2004-05లో అధికంగా 18వందల టన్నుల మే ర దిగుబడి వచ్చింది. ఒకసారి పంట వేస్తే 40 నుంచి 50 ఏళ్ల వరకు దిగుబడి ఉంటుంది. ఏజెన్సీలో సాగు భూములకు అనుకూలమైన అగా రో, ఎస్-5, కావేరి, చంద్రగిరి, ఎస్-9, ఎస్5-బి రకాలను సాగు చేస్తున్నారు. కాఫీ బోర్డు ఆధ్వర్యంలో సాగవుతున్న ఈ పంటకు అనుసంధానంగా మిరియాలను చేపట్టడంతో గిరి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతోంది.
పదేళ్లుగా అంతర్జాతీయ గుర్తింపు
పాడేరు డివిజన్‌లోని పెదబయలు, అనంతగిరి మండలాల పరిధిలో సాగవుతున్న కాఫీ గింజలు నాణ్యమైనవి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జరిగిన ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ఫైన్‌కప్ అవార్డుల కార్యక్రమంలో అరుకు లోయ కాఫీ ‘ఉత్తమ అరబికా కాఫీ’గా గుర్తింపు పొందింది. అరకువేలీ కాఫీకి 2003 నుంచి ప్రత్యేక అవార్డులు వస్తూనే ఉన్నాయి. కాఫీ క్యూరింగ్‌లో అవలంభిస్తున్న విధానాలే నాణ్యతకు దోహదపడుతున్నాయి. అరకు అసెంబ్లీ సెగ్మెంటుపరిధిలోని పెదబయలు, అనంతగిరి మండలాల్లో సాగవుతున్న ఈ పంటకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులున్నాయి. గింజల సేకరణతో పాటు క్యూరింగ్ దశ వరకు అనుసరిస్తున్న శాస్త్రీయ విధానాల వల్లే ఇది నాణ్యమైనదిగా గుర్తింపు పొందుతోంది. పదేళ్ల నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతూ వస్తోంది.
మార్కెటింగ్ వ్యవస్థ ఉంటే..
ఏజెన్సీలో పండించే కాఫీకి ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థ లేదు. అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టిసారిస్తే మరింత లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పండిన కాఫీని శుద్ధి చేసి నేరుగా విజయవాడ మార్కెట్లో వేలం వేయడం ఆనవాయితీ. వేలం సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి ధర పలుకుతూ ఉంటుంది. గతేడాది కిలో రూ.150 వరకు పలికింది. ఇదేకాకుండా ఈ పంట ఆధారంగా ఏజెన్సీలో మిరియాలను సాగుతో గిరిరైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. గత ఏడాది వచ్చిన వంద టన్నుల వరకు దిగుబడి వల్ల అదనపు ఆదాయం రూ. 3కోట్ల మేర ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.
కాఫీ పరిమళాలు
Published Wed, Aug 28 2013 3:36 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement