
సాక్షి, భూపాలపల్లి: ‘మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు గడిచింది. మొదటిసారిగా గిరిజన గ్రామం బోడగూడెంను సందర్శించ డం సంతోషం కలిగించింది. గవర్నర్‌గా కాకుండా ఓ సోదరిలా మీ ఊరికి వచ్చాను’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం గవర్నర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. కాటారం మండలం బోడగూడెంలో గిరిజనులతో మమేకమయ్యారు.
తొలి సారి తమ గ్రామానికి వచ్చిన గవర్నర్‌కు గిరిజన సంప్రదాయ పద్దతుల్లో స్వాగతం పలికారు. గిరిజనులనుద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ.. అవకా శాలను అందిపుచ్చుకుని సమాజంలో ఉన్నతస్థాయికి చేరాలని సూచించారు. గ్రామంలోని కాల్నేని వనిత ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. గ్రామస్తులతో ముఖాముఖిలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము ఇప్పటికీ గుడిసెల్లోనే నివసిస్తున్నా మని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, వ్యవసాయానికి మూడె కరాలు భూమిని ప్రభుత్వం మంజూరు చేసే లా చూడాలని గవర్నర్‌ను గ్రామస్తులు కోరారు.
వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అంగన్‌వాడీ కేం ద్రంలో అందిస్తున్న పోషకాహరం గురించి ఆరాతీశారు. గిరిజన ఆదివాసీలు చూపించిన అభిమానం, ఆప్యాయత తనను కదిలించాయని తమిళిసై పేర్కొన్నారు. బోడగూడెం ప్రజలంతా రాజ్‌భవన్ కు రావాలన్నారు. అనంతరం గ్రామంలోని లక్ష్మీ దేవర ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.
రైతులకు వరం.. కాళేశ్వరం
రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప వరమని గవర్నర్ కొనియాడారు. దీనివల్ల సాగునీటితో పాటు రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంపు హౌస్, బ్యారేజీలను ఆమె సందర్శించారు. కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌హౌస్‌ను సందర్శించిన గవర్నర్‌కు.. 12 మోటార్లతో గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలించే విధానాన్ని ఇంజనీ ర్లు వివరించారు. పంప్‌హౌస్ నుంచి గ్రావిటీ కెనాల్‌లోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని చూసి అద్భుతమని ఆమె అభినందించారు. లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ బ్యారేజీ) సందర్శించారు. తర్వాత సరస్వతి బ్యారేజ్‌ను పరిశీలించి పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళ్లారు.
ముక్తీశ్వర ఆలయంలో పూజలు
జిల్లా సందర్శనలో భాగంగా కాళేశ్వరానికి వచ్చిన గవర్నర్ దంపతులు కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని దర్శించారు. ఆలయ సిబ్బంది గవర్నర్ దంపతులను పూర్ణకుంభంతో ఆహ్వానించారు. స్వామి ని దర్శించుకున్న గవర్నర్ దంపతు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.