bhoopalapally
-
భారీగా ఏసీపీ, ఇన్స్పెక్టర్ల ట్రాన్స్ఫర్.. బదిలీలకు ఈనెల 31 టార్గెట్..
వరంగల్: పోలీసుశాఖలో బదిలీలు భారీగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి అనధికారికంగా ప్రారంభమైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీపీ స్థాయి అధికారి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అధికారి వరకు ఎన్నికల ఎఫెక్ట్‌లో భాగంగా బదిలీలు జరుగుతున్నాయి. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. దీనికి అనుగుణంగా ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించే పోలీస్ శాఖలో భారీగా మార్పులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం. దానికి అనుగుణంగా ఎన్నికల నిబంధనలు వర్తించే పోలీస్ అధికారులను ఆయా నియోజకవర్గాలకు సాగనంపుతున్నారు. దీంతోపాటు ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాలతో పాటు ఏమేరకు ఎన్నికల విధుల్లో ఉపయోగపడుతారనే కోణంలో క్షుణంగా పరిశీలించిన తర్వాతనే పోస్టింగ్‌లకు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల బదిలీ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే ఇద్దరు డీసీపీలు పుల్లా కరుణాకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా, కర్రి పుష్పారెడ్డి తెలంగాణ కమాండ్ కంట్రోల్ విభాగం ఎస్పీగా బదిలీ అయ్యారు. వీరితో పాటు పరకాల, కాజీపేట, మామునూరు, క్రైం, ఏసీపీలు బదిలీ అయ్యారు. ఇన్స్పెక్టర్లు.. పరకాల, గీసుకొండతో పాటు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. దీంతోపాటు చాలా కాలంగా ఖాళీగా ఉన్న హసన్‌పర్తి, కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లకు ఖమ్మం, కొత్తగూడెం నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్‌లు కేటాయించారు. కోడ్ ఎఫెక్ట్‌లో భాగంగా సుబేదారిలోని రూరల్ మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్, భరోసా ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. గత నాలుగైదు రోజుల్లో వరుసగా సబ్ ఇన్స్పెక్టర్లను వివిధ పోలీస్స్టేషన్లకు బదిలీ చేస్తూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనా«థ్ ఉత్తర్వులు జారీ చేశారు. నేతల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు! ఎన్నికల ముందు ప్రశాంతత కోసం కొంత మంది అధికారులు లూపులైన్ల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా.. మరికొంత మంది ఎన్నికల కోడ్ వర్తించని చాలామంది అధికారులు సిఫారసు లేఖల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసమయంలో నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏమేరకు ఉపయోగపడతారని వారి అనుచర గణంతో లెక్కలు వేసుకుంటున్నారు. అధికారి పనితీరుతో పాటు సామాజిక అంశాన్ని ప్రధానంగా చూస్తున్నారు. ఒక్కో పోస్టింగ్ కోసం పదుల సంఖ్యలో అధికారులు క్యూ కట్టడం విశేషం. ఏసీపీ పోస్టుల కోసం కూడా అధికారులు ఒక్కో ప్రజాప్రతినిధిని పలుమార్లు కలుస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కొంత మంది అధికారులు వారి పీరియడ్ పూర్తి కాకపోయినప్పటికీ పోస్టింగ్ ఉంటుందో? ఉడుతుందో.. తెలియని అయోమయ స్థితిలో ఉద్యోగం నెట్టుకొస్తున్నారు. వరంగల్ సబ్ డివిజన్లో మిల్స్‌కాలనీ, ఇంతేజార్గంజ్ వర్ధన్నపేట, ధర్మసాగర్, కమలాపూర్, నర్సంపేట, రఘునా«థపల్లి, నర్సంపేట రూరల్, నర్మెట్ట పోలీస్స్టేషన్లకు కొత్త అధికారులు రానున్నారు. ఈపోస్టింగ్ల కోసం ఇప్పటికే చాలా మంది అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి లెటర్లు పోలీస్‌బాస్‌కు అందించినట్లు సమాచారం. ఇందులో కొంత మందికి ఎలక్షన్ ఎఫెక్ట్ ఉండగా.. మరికొంత మంది ప్రవర్తన సరిగ్గా లేక మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అరెస్ట్‌లకు రంగం సిద్ధం! పోలీసు అధికారుల లెక్కల ప్రకారం వివిధ కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న సుమారు 180 మంది నిందితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీరిని అరెస్ట్ చేయడానికి ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఎస్హెచ్ఓలకు నిర్ధిష్టమైన ఆదేశాలు అందాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపనున్నారు. దీంతో పాటు ఆయా పోలింగ్స్టేషన్ల వారీగా మాజీలతో పాటు గతంలో జరిగిన ఎన్నికల్లో ఇబ్బదులు సృష్టించిన వ్యక్తుల జాబితాలు కూడా ఆయా పోలీస్స్టేషన్లలో సిద్ధంగా ఉన్నాయి. తుపాకుల జాబితా రెడీ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తుపాకుల లైసెన్స్‌లు 230 ఉన్నాయి. ప్రస్తుతం తుపాకుల లైసెన్స్ కలిగిన వ్యక్తులు వివిధ గొడవల్లో చిక్కుకున్న, కేసులు నమోదైన వారి లైసెన్స్‌లు రద్దు చేశారు. దీంతో కమిషనరేట్ పరిధిలో 180 వరకు లైసెన్స్ తుపాకులున్నాయి. ఎన్నికల ముందు వీటిని ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తుపాకుల లెక్కలను సైతం పోలీసు అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఈనెల 31 వరకు ప్రక్రియ పూర్తి చేస్తాం.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈనెల 31వ తేదీ వరకు ఎన్నికల బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తాం. సొంత జిల్లా, సొంత నియోజవర్గం ఉన్న అధికారులతో పాటు చివరి నాలుగేళ్లలో మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసే అధికారులను నిబంధనల ప్రకారం బదిలీ చేస్తాం. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పని చేస్తున్న అధికారులను రెవెన్యూ జిల్లాను ప్రతిపాదికన బదిలీలు చేపడుతున్నాం. ఏసీబీ, క్రిమినల్ కేసులు ఉన్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతాం. – ఏవీ. రంగన్నాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
ఐదేళ్లుగా ఆరని అరిగోస !
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం (సరస్వతీ) బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో ఐదేళ్లుగా సమీప ప్రాంత ప్రజలు, రైతులు ఐదేళ్లుగా అరిగోస పడుతున్నారు. పంటలు నీటమునిగి తీవ్రంగా నష్టపోతున్నారు. భారీవర్షాలతో వరద ఉధృతి పెరిగితే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. రూ.50కోట్లతో కరకట్ట నిర్మాణానికి గతేడాది అధి కారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో వరద కష్టాలను తలుచుకుంటూ ఆందోళనకు గురవుతున్నారు. కాటారం మండలం లక్ష్మిపూర్ వద్ద మానేరు వాగు వచ్చి గోదావరి నదిలో కలుస్తుంది. రెండు నదులు ఒకే చోట కలవడంతో వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రవాహ ఉధృతి విలాసాగర్, దామెరకుంట, గుండ్రాత్‌పల్లి గ్రామాల వరకు కొనసాగుతుంది. 2019లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలోని గోదావరిపై ప్రభుత్వం సరస్వతీ బ్యారేజీ నిర్మించింది. బ్యారేజీ నిర్మాణానికి ముందు రెండు నదుల్లోని నీరు దిగువకు సులువుగా వెళ్లిపోయేది. భారీ వర్షాలు కురిసినప్పుడు మాత్రమే తీరప్రాంతాల్లో కొంత మేర నష్టం వాటిల్లేది. కానీ ప్రస్తుతం బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో ఐదేళ్లుగా పంటలు పూర్తిగా మునిగిపోతున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో బ్యారేజీ గేట్లు తెరవడంతో పంట పొలాల్లో ఇసుక మేటలు పెడుతున్నాయి. బ్యాక్ వాటర్ గ్రామాలను చుట్టేయడంతో దామెరకుంట, లక్ష్మిపూర్, గుండ్రాత్‌పల్లి, మల్లారం, విలాసాగర్, గంగారం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఇరుక్కుపోతున్నాయి. రైతులు జూలైలో పత్తి, వరి, మిర్చి పంటలు సాగుచేస్తే ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో రైతులు, ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రతిపాదనలకే పరిమితం.. కాటారం మండలం లక్ష్మీపూర్ సమీపంలో మానేరు నది గోదావరిలో కలుస్తుండటంతో గోదావరి నీరు వెనక్కి వచ్చి మానేరుకు పోటెత్తడంతో రెండుతీరాలు తీవ్ర కోతకు గురవుతున్నాయి. ఈ కారణంతో గతేడాది దామెరకుంటను గోదావరి వరదనీరు చుట్టేసింది. మండలంలోని గంగారం, విలాసాగర్, లక్ష్మీపూర్, దామెరకుంట, గుండ్రాత్‌పల్లి తదితర గ్రామాలకు గోదావరి వరద నీటితో ముంపు నెలకొంది. ఇది గ్రహించిన ప్రభుత్వం, అధికారులు లక్ష్మీపూర్ నుంచి గంగారం వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ.50 కోట్లతో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు గతేడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మూడు నెలల్లో పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు పైసా నిధులు ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలి.. తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని అన్నారం బ్యారేజీ బ్యాక్‌వాటర్ ముంపు ప్రభావిత ప్రాంతాల బాధితులు అధికారులను వేడుకొంటున్నారు. ప్రతి ఏటా సుమారు 800ఎకరాల పంటపొలాలను బ్యాక్‌వాటర్ ముంచేస్తుంది. అధికారులు మాత్రం వందలోపు ఎకరాలు నష్టపోతున్నట్లు నివేదిక ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముంపు గ్రామాలైన దామెరకుంట, లక్ష్మీపూర్. గుండ్రాత్‌పల్లి గ్రామాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని కోరుతున్నారు. తమ పంట పొలాలను ప్రభుత్వం తీసుకొని నష్టపరిహారం చెల్లించడంతో పాటు తమకు పునరావాసం కల్పించి ఆదుకోవాలని వేడుకొంటున్నారు. ఈ విషయంలో ఆందోళనలు చేయడంతో పాటు కలెక్టర్‌కు వినతిపత్రాలు సైతం సమర్పించారు. అందని నష్టపరిహారం.. బ్యారేజీ బ్యాక్‌వాటర్ ద్వారా వందలాది ఎకరాల పంటపొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ నష్టపరిహారం అందడం లేదు. ఐదేళ్లుగా ప్రతీ ఏడాది పెద్ద ఎత్తున పంట నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదని బాధిత రైతులు అంటున్నారు. పంటలు మునిగినపుడు అధికారులు గ్రామాల్లోకి వచ్చి పంట నష్టం లెక్కలు రాసుకొని ప్రభుత్వానికి నివేదించినప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి ముంపు ప్రాంత ప్రజలు, రైతులకు శాశ్వత పరిష్కారం చూపించాలని పలువురు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం.. లక్ష్మీపూర్ నుంచి గంగారం వరకు కరకట్ట నిర్మాణం, గతంలో నిర్మించిన కరకట్ట పునరుద్ధరణ పనుల కోసం రూ.50కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కరకట్ట నిర్మాణ పనులు చేపడుతాం. – రవిచంద్ర, ఇరిగేషన్ డీఈఈ ఏటా మునుగుడే.. దామెరకుంట శివారులో నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ప్రతి ఏడాది వరి పంట సాగు చేస్తా. వరి ఎదిగే సమయానికి బ్యాక్‌వాటర్ పంటను నిండా ముంచేస్తుంది. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి. నష్టపోతున్నప్పటికీ తప్పక పంట సాగుచేయాల్సి వస్తుంది. బ్యాక్ వాటర్ సమస్య తీరితేనే మా పరిస్థితులు మారుతాయి. – రౌతు మల్లన్న, రైతు, గంగపురి కౌలుకు తీసుకొని నష్టపోతున్నా.. నాకు స్వంత భూమి లేదు. వ్యవసాయమే నా కుటుంబానికి దిక్కు. దీంతో ఐదెకరాల చేను కౌలుకు తీసుకొని మూడేళ్లుగా సాగుచేస్తున్న. ప్రతి ఏడాది బ్యాక్‌వాటర్ పత్తిపంటను దెబ్బతీస్తుంది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు, కౌలు డబ్బులు కలుపుకొని రెండు, మూడు లక్షల వరకు అప్పు అవుతున్నా. – అంకయ్య, రైతు, గుండ్రాత్‌పల్లి -
పల్లె ప్రగతిలో ‘వీడియో షూట్’
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి కార్యక్రమ అమలు, పర్యవేక్షణ విషయంలో ఉన్నతాధికారులు, పంచాయతీ సిబ్బంది మధ్య పొసగడంలేదు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కొందరు జిల్లా కలెక్టర్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఇబ్బందిగా మారాయని పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఉదయం 6 గంటలకే గ్రామాల్లో పర్యటించాలని, విధిగా వాట్సాప్ కాల్ చేయాలని, ప్రతి 2 గంటలకు వీడియో ఫుటేజీని పోస్ట్ చేయా లనే షరతులు విధించడం పట్ల ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. వర్క్ టు రూల్ నిబంధనకు విరుద్ధంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేయాలని ఒత్తిడి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కామారెడ్డి మొదలు భూపాలపల్లి వరకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే రెండు విడతల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాల్వల్లో పూడిక తీత, పాత బావులు, బోరుబావుల పూడ్చివేత తదితర చర్యలు తీసుకోవాల ని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని గ్రామ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులను ఆదేశించింది. పల్లె ప్రగతి పనుల్లో వేగం పెంచేందుకు కలెక్టర్లు/అదనపు కలెక్టర్లు కొందరు.. గ్రామ కార్యదర్శులు ప్రభాతవేళ పంచాయతీల్లో సందర్శించాలని ఆదేశించారు. ఉదయం 8 గంటలకు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఏ వీధిలో పర్యటిస్తున్నారో తెలపాలని కామారెడ్డి కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును 30 సెకన్ల నిడివి గల వీడియో చిత్రీకరించి.. ప్రతి 2 గంటల కోసారి పోస్టు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ నిర్దేశించారు. ఉదయం 6 మొదలు సాయంత్రం 6 గంటలకు చివరిసారిగా ఈ వీడియో పోస్టు చేయాలన్నారు. పల్లె నిద్రలు చేయాలని, గ్రామస్తులతో మమేకం కావాలని మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయం పట్ల ఉద్యోగసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అవమానించేలా చర్యలు పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సమర్థనీయం కాదు. 12 గంటలపాటు విధులు నిర్వర్తించాలనే ఆదేశాలు ఉపసంహరించుకోవాలి. అత్యవసరవేళల్లో పనులు చేసేందుకు అభ్యంతరంలేదు. పారిశుద్ధ్య నిర్వహణ, పల్లె ప్రగతి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కానీ, తమను అవమాన పరిచేలా వీడియో కాల్, ఫుటేజీ పంపాలనడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వర్క్ టు రూల్ పాటిస్తామని ఆయన హెచ్చరించారు. – మధుసూదన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
‘మేడిగడ్డ’లో పెరిగిన ముంపు!
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పరిధిలో ముంపు మరింతగా పెరిగింది. ఈ బ్యారేజీకి ఆనుకుని ప్రవహించే ప్రధానమైన నాలుగు పిల్ల వాగులు గోదావరిలో కలిసే చోట కరకట్టల నిర్మాణం జరగలేదు. దీంతో పంట చేన్లలోకి నిల్వ నీరు బ్యాక్ వాటర్ రూపంలో చేరుతోంది. తెలంగాణ, మహారాష్ట్రంలో వందల ఎకరాల్లో పంట నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబర్ 21 నుంచి లక్ష్మీ బ్యారేజీలోని 85 గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రాణహిత ద్వారా వచ్చే నీటిని బ్యారేజీ వద్ద ఒడిసి పడుతున్నారు. ప్రాణహిత ద్వారా 2,200 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. లక్ష్మీ బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా.. మంగళవారం సాయంత్రం వరకు 14 టీఎంసీలకు చేరింది. బ్యారేజీలో ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్ఆర్ఎల్) 99 మీటర్ల వరకు చేరగా ఈనెల 14లోగా 100 మీటర్లకు చేర్చి పూర్తి సామర్ధ్యంతో నీటిని నిల్వ చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాకాలంలోనే.. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కురిసి భారీ వర్షాలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటి మట్టం 7.5 టీఎంసీల వరకు మాత్రమే నిలిపారు. అప్పుడు పాణహిత, గోదావరి ద్వారా వచ్చే వరద ప్రవాహంతో పాటు వర్షాలు కురుస్తుండటంతో బ్యాక్ వాటర్ మొత్తం ఇరురాష్ట్రాల్లోని బ్యారేజీ సరిహద్దులోని పంట చేలలోకి చేరాయి. అప్పుడు ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజీలోని 85 గేట్లు పూర్తిగా ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు. ఆ సమయంలో రోజుకు 3 లక్షల నుంచి 8 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వృథాగా తరలిపోయింది. తెలంగాణ, మహారాష్ట్రాలలో పంట నష్టం మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో నిర్మించారు. గోదావరి అవుతలి వైపు1.6 కిలోమీటర్ల దూరం వరకు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా పోచంపల్లి ఒడ్డుపైకి మేడిగడ్డ బ్యారేజీ వ్యాపించి ఉంది. ఈ నిర్మాణం కోసం మండలంలోని అంబట్పల్లిలో 698 ఎకరాలు, మహారాష్ట్ర వైపున 568 ఎకరాల వరకు భూసేకరణ చేసి రైతులకు పరిహారం అందజేశారు. ప్రస్తుతం నవంబర్ 21 నుంచి మేడిగడ్డ గేట్లు పూర్తిగా మూసివేయడంతో బ్యాక్‌వాటర్ నిల్వ రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో రోజుకు 0.2 టీఎంసీ చొప్పున నీరు పెరుగుతోంది. ప్రస్తుతం మేడిగడ్డలో 14 టీఎంసీల నీరు చేరడంతో పంట చేనుల్లోకి నీరు అధికంగా చేరిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహదేవపూర్ మండలంలో ఇంజనీరింగ్ అధికారులు పంట నష్టంపై సర్వే చేపట్టారు. రైతులు అధైర్యపడొద్దు కాళేశ్వరం ప్రాజెక్టులోనే కీలకమైనది మేడిగడ్డ బ్యారేజీ. ఇందులో పూర్తి 100 ఎఫ్ఆర్ఎల్ నీరు నిల్వ చేసేందుకు టెస్టింగ్ చేస్తున్నాం. వర్షాకాలంలో పూర్తి సామర్థ్యం చూడలేం. ఇప్పుడు సాధ్యమైంది కనుక బ్యారేజీలో 100 ఎఫ్ఆర్ఎల్ వరకు నీరు చేరితే ఎంత వరకు ముంపునకు గురవుతుందనేది సర్వే ద్వారా తెలుస్తుంది. తెలంగాణలో 190, మహారాష్ట్రలో 40 ఎకరాల్లో పంట నష్టం ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. ఆయా రైతులకు పరిహారం చెల్లిస్తాం. ముంపు భూములను తీసుకోవడానికి కూడా సీఎం అనుమతి తీసుకున్నాం. మూడు నెలల్లో భూసేకరణ ప్రక్రియ జరుగుతుంది. ఇరు రాష్ట్రాల్లోని రైతులు అధైర్యపడొద్దు. – నల్ల వెంకటేశ్వర్లు, కాళేశ్వరం బ్యారేజీ ఈఎన్సీ బ్రాహ్మణపల్లిలో నీట మునిగిన మిర్చి పంటను చూపుతున్న రైతు -
‘కాళేశ్వరం’ ఇంజనీర్లకు ప్రమోషన్
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఐదుగురు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజనీర్లు కుటుంబాలకు దూరంగా ఉండి రాత్రింబవళ్లు శ్రమించి లక్ష్యానికి అనుగుణంగా కృషి చేసినందుకు ప్రభుత్వం స్పెషల్ ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లింకు–1లోని మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీవీ రమణారెడ్డికి ఎస్ఈగా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.రాజుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా, అన్నారం సరస్వతీ బ్యారేజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.యాదగిరికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవిచంద్రకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పదోన్నతి ఇవ్వనున్నారు. అలాగే లింకు–2 పరిధిలోని నంది, గాయత్రి పంపుహౌస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌కు ఎస్ఈగా ప్రమోషన్ రానుంది. వీరందరికి ఒక నెల జీతం లేదా ఒక ఇంక్రిమెంట్‌ను ఇవ్వనున్నారు. -
గవర్నర్‌గా కాదు..సోదరిగా వచ్చా
సాక్షి, భూపాలపల్లి: ‘మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు గడిచింది. మొదటిసారిగా గిరిజన గ్రామం బోడగూడెంను సందర్శించ డం సంతోషం కలిగించింది. గవర్నర్‌గా కాకుండా ఓ సోదరిలా మీ ఊరికి వచ్చాను’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం గవర్నర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. కాటారం మండలం బోడగూడెంలో గిరిజనులతో మమేకమయ్యారు. తొలి సారి తమ గ్రామానికి వచ్చిన గవర్నర్‌కు గిరిజన సంప్రదాయ పద్దతుల్లో స్వాగతం పలికారు. గిరిజనులనుద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ.. అవకా శాలను అందిపుచ్చుకుని సమాజంలో ఉన్నతస్థాయికి చేరాలని సూచించారు. గ్రామంలోని కాల్నేని వనిత ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. గ్రామస్తులతో ముఖాముఖిలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము ఇప్పటికీ గుడిసెల్లోనే నివసిస్తున్నా మని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, వ్యవసాయానికి మూడె కరాలు భూమిని ప్రభుత్వం మంజూరు చేసే లా చూడాలని గవర్నర్‌ను గ్రామస్తులు కోరారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేం ద్రంలో అందిస్తున్న పోషకాహరం గురించి ఆరాతీశారు. గిరిజన ఆదివాసీలు చూపించిన అభిమానం, ఆప్యాయత తనను కదిలించాయని తమిళిసై పేర్కొన్నారు. బోడగూడెం ప్రజలంతా రాజ్‌భవన్ కు రావాలన్నారు. అనంతరం గ్రామంలోని లక్ష్మీ దేవర ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. రైతులకు వరం.. కాళేశ్వరం రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప వరమని గవర్నర్ కొనియాడారు. దీనివల్ల సాగునీటితో పాటు రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంపు హౌస్, బ్యారేజీలను ఆమె సందర్శించారు. కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్‌హౌస్‌ను సందర్శించిన గవర్నర్‌కు.. 12 మోటార్లతో గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలించే విధానాన్ని ఇంజనీ ర్లు వివరించారు. పంప్‌హౌస్ నుంచి గ్రావిటీ కెనాల్లోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని చూసి అద్భుతమని ఆమె అభినందించారు. లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ బ్యారేజీ) సందర్శించారు. తర్వాత సరస్వతి బ్యారేజ్‌ను పరిశీలించి పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళ్లారు. ముక్తీశ్వర ఆలయంలో పూజలు జిల్లా సందర్శనలో భాగంగా కాళేశ్వరానికి వచ్చిన గవర్నర్ దంపతులు కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని దర్శించారు. ఆలయ సిబ్బంది గవర్నర్ దంపతులను పూర్ణకుంభంతో ఆహ్వానించారు. స్వామి ని దర్శించుకున్న గవర్నర్ దంపతు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంచాలి
సాక్షి, భూపాలపల్లి: ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసాను లెక్కించి, వారి ఖర్చుల్లో జమ చేయాలని వరంగల్ లోక్‌సభ ఎన్నికల వ్యయ పరిశీలకులు విజయ్‌అగర్వాల్ అధికారులను ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వరంగల్ లోక్‌సభ పరిధిలో నిభూపాలపల్లి, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలో వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నుంచి నియమించబడిన విజయ్‌అగర్వాల్ శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచార ఖర్చులను లెక్కించడానికి సంబంధిత అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా రెవెన్యూ అధికారి, లోక్‌సభ ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి వెంకటాచారి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా విజయ్‌అగర్వాల్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రతీ అభ్యర్థి రూ. 70 లక్షలు వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు లోబడి ముందస్తూ అనుమతితోనే ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే అభ్యర్థులు చేసే ఖర్చులను పరిశీలించి లెక్కించడానికి ఏర్పాటు చేసిన బృందాన్ని సమర్థవంతంగా పనిచేసి ప్రతీ పైసాను లెక్కించి అభ్యర్థి ఖర్చులో జమ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచిన ఈవీఎం, వీవీప్యాట్ల అవగాహన, మోడల్ పోలింగ్ కేంద్రంను పరిశీలించి ఈవీఎంల పనితీరును చెక్ చేశారు. డీపీఆర్వో చాంబర్‌లోని ఎంసీఎంసీ కేం ద్రంను తనిఖీ చేసి పత్రికలు, కేబుల్ నెట్‌వర్క్‌లో ప్రచురితం, ప్రసారమయ్యే ప్రతి అడ్వర్టైజ్మెంట్ను లెక్కించాలన్నారు. అలాగే పెయిడ్ న్యూస్‌లను జాగ్రత్తగా గుర్తించి వాటి విలువను లెక్కించి అభ్యర్థుల ఖర్చుల్లో జమ చేయాలని ఆదేశించారు. భూపాలపల్లి డీఎస్పీ కిరణ్‌కుమార్, జిల్లా పౌరసంబంధాల అధికారి బి రవికుమార్, స్పెషల్‌బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వేణు పాల్గొన్నారు. -
కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే 100 రోజుల్లో..
భూపాలపల్లి జిల్లా: తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగాన్ని ప్రజలు ఊడగొడితే వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, సమ్మక్క సారలమ్మలపై ఓట్టేసి వాగ్దానం చేస్తున్నానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు నియోజకవర్గానికి వచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధాటిగా ప్రసంగించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. ములుగు నియోజకవర్గంలో మేడారం జాతరపై చిన్న చూపు చూసిన కేసీఆర్‌కు ఓట్ల కోసం ములుగులో అడుగు పెట్టేందుకు మాత్రం సమయం దొరుకుతుందా అని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం సీతక్క అడవుల నుంచి ప్రజల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రజా తెలంగాణ కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. గిరిజనులకు, ఇతర బలహీనవర్గాలకు ఇండ్లు కట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రూ.6 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని అన్నారు. పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ కాలంలో వందల మంది చావుకు కారణమైన టీఆర్ఎస్ ఇప్పటి వరకు ఎంత మందికి న్యాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చుపెట్టి తమాషా చూస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు, మైనార్టీలకు12 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి మాట తప్పిన కేసీఆర్‌కు బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఢిల్లీలో మోదీ పాలన తెలంగాణ కేడీ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గిరిజనులపై టీఆర్ఎస్ నాయకులు చేసిన అఘాయిత్యాలను రేవంత్ రెడ్డి వివరిస్తుండగా పక్కనే కాంగ్రెస్ ములుగు అభ్యర్థి సీతక్క కంటతడి పెట్టారు. -
‘మిమ్మల్ని నేనే చంపాలా.. మీరే చస్తారా’
కాళేశ్వరం(మంథని) : సహజీవనం చేస్తున్న ఓ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి నదిలో బుధవారం జరిగింది. వారిలో పురుషుడు మృతిచెందగా, మహిళ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన జంగా హరినాథ్(48) మొదటి భార్య మృతిచెందడంతో మల్హర్ మండలం కొయ్యూర్‌కు చెందిన శ్యామలతో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే వారిద్దరు కలిసి ఉండడం ఇష్టం లేని శ్యామల చిన్న సోదరుడు పండ్ల రాము పలుమార్లు వారిపై దాడి చేశాడు. కలిసి ఉండొద్దని బెదిరించాడు. అయినా వారు కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలోనే అతడి వేధింపులు భరించలేక ఇద్దరు బుధవారం ఉదయం 7.30 గంటలకు కాళేశ్వరంలోని గోదావరి నదిలో వీఐపీ ఘాట్ వద్ద క్రిమిసంహారక మందు తాగారు. హరినాథ్ అక్కడికక్కడే మృతిచెందగా, శ్యామల అపస్మారక స్థితికి చేరింది. స్థానికులు గమనించి 108లో మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ‘మిమ్మల్ని నేనే చంపాలా.. మీరే చస్తారా’ అని రాజు బెదిరించడంతో తాము మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు హరినాథ్ రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ సంఘటన స్థలంలో ఓ చేతి సంచిలో వారిద్దరి ఫొటోలతో కలిపి లభించింది. కాగా హరినాథ్ మొదటి భార్య కుమారుడు ప్రసన్నకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రామ్‌సింగ్ తెలిపారు. మృతుడు స్థానికంగా డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పలిమెల ఎస్సై నరేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సూసైడ్ నోట్లో ఇలా.. శ్యామల చిన్న తమ్ముడు పండ్ల రాజు తరచు మా ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేశాడు. ఇద్దరిని కొట్టి దూరం చేశాడు. అయినా మేమిద్దరం ఒక్కటయ్యాం. చంపుతానని బెదిరించాడు. మీరే చావండి లేదా నేనే చంపుతా అని వేధించడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
రేగొండ(భూపాలపల్లి): ప్రమాదవశాత్తు బైక్ చెట్టుకు ఢీకొని దంపతులు మృతి చెందిన సంఘటన రేగొండ శివారులోని జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని సుల్తాన్పురం శివారు వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన చిరిపోతుల రవి, అరుణ దంపతులు చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి వివాహానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో సుల్తాన్పురం శివారులోని కోళ్లఫారం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. దీంతో రవి, అరుణ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులకు కొడుకు, కూతురు ఉన్నారు. తల్లిదండ్రులు ప్రమాదంలో మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మిగిలారు -
చనిపోయిన భార్య పుర్రెను తీసుకొచ్చి..
-
విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి
భూపాలపల్లి: స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ అన్నారు. సమాఖ్య 81వ ఆవిర్భావ వేడుకలను భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. సమాఖ్య జెండాను ఆవిష్కరించిన అనంతరం 80 మీట ర్ల పతాకంతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాని కి పూల మాలలు వేశారు. అనంతరం జూని యర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో శివరామక్రిష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తానంటూ మభ్యపెడుతూ ఆంధ్రా కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గిన్నారపు రోహిత్, ఉపాధ్యక్షుడు సొత్కు ప్రవీణ్, నాయకులు మట్టి సర్వేష్, భగత్, వెంకటేష్, నవీన్, రాజేందర్, మహేందర్, సీపీఐ నాయకులు రాజ్‌కుమార్, రమేష్ పాల్గొన్నారు.