జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం (సరస్వతీ) బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో ఐదేళ్లుగా సమీప ప్రాంత ప్రజలు, రైతులు ఐదేళ్లుగా అరిగోస పడుతున్నారు. పంటలు నీటమునిగి తీవ్రంగా నష్టపోతున్నారు. భారీవర్షాలతో వరద ఉధృతి పెరిగితే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. రూ.50కోట్లతో కరకట్ట నిర్మాణానికి గతేడాది అధి కారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో వరద కష్టాలను తలుచుకుంటూ ఆందోళనకు గురవుతున్నారు. కాటారం మండలం లక్ష్మిపూర్ వద్ద మానేరు వాగు వచ్చి గోదావరి నదిలో కలుస్తుంది. రెండు నదులు ఒకే చోట కలవడంతో వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రవాహ ఉధృతి విలాసాగర్, దామెరకుంట, గుండ్రాత్‌పల్లి గ్రామాల వరకు కొనసాగుతుంది.
2019లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలోని గోదావరిపై ప్రభుత్వం సరస్వతీ బ్యారేజీ నిర్మించింది. బ్యారేజీ నిర్మాణానికి ముందు రెండు నదుల్లోని నీరు దిగువకు సులువుగా వెళ్లిపోయేది. భారీ వర్షాలు కురిసినప్పుడు మాత్రమే తీరప్రాంతాల్లో కొంత మేర నష్టం వాటిల్లేది. కానీ ప్రస్తుతం బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో ఐదేళ్లుగా పంటలు పూర్తిగా మునిగిపోతున్నాయి.
నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో బ్యారేజీ గేట్లు తెరవడంతో పంట పొలాల్లో ఇసుక మేటలు పెడుతున్నాయి. బ్యాక్ వాటర్ గ్రామాలను చుట్టేయడంతో దామెరకుంట, లక్ష్మిపూర్, గుండ్రాత్‌పల్లి, మల్లారం, విలాసాగర్, గంగారం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఇరుక్కుపోతున్నాయి. రైతులు జూలైలో పత్తి, వరి, మిర్చి పంటలు సాగుచేస్తే ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో రైతులు, ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
ప్రతిపాదనలకే పరిమితం..
కాటారం మండలం లక్ష్మీపూర్ సమీపంలో మానేరు నది గోదావరిలో కలుస్తుండటంతో గోదావరి నీరు వెనక్కి వచ్చి మానేరుకు పోటెత్తడంతో రెండుతీరాలు తీవ్ర కోతకు గురవుతున్నాయి. ఈ కారణంతో గతేడాది దామెరకుంటను గోదావరి వరదనీరు చుట్టేసింది. మండలంలోని గంగారం, విలాసాగర్, లక్ష్మీపూర్, దామెరకుంట, గుండ్రాత్‌పల్లి తదితర గ్రామాలకు గోదావరి వరద నీటితో ముంపు నెలకొంది.
ఇది గ్రహించిన ప్రభుత్వం, అధికారులు లక్ష్మీపూర్ నుంచి గంగారం వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ.50 కోట్లతో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు గతేడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మూడు నెలల్లో పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు పైసా నిధులు ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు.
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలి..
తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని అన్నారం బ్యారేజీ బ్యాక్‌వాటర్ ముంపు ప్రభావిత ప్రాంతాల బాధితులు అధికారులను వేడుకొంటున్నారు. ప్రతి ఏటా సుమారు 800ఎకరాల పంటపొలాలను బ్యాక్‌వాటర్ ముంచేస్తుంది. అధికారులు మాత్రం వందలోపు ఎకరాలు నష్టపోతున్నట్లు నివేదిక ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ముంపు గ్రామాలైన దామెరకుంట, లక్ష్మీపూర్. గుండ్రాత్‌పల్లి గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని కోరుతున్నారు. తమ పంట పొలాలను ప్రభుత్వం తీసుకొని నష్టపరిహారం చెల్లించడంతో పాటు తమకు పునరావాసం కల్పించి ఆదుకోవాలని వేడుకొంటున్నారు. ఈ విషయంలో ఆందోళనలు చేయడంతో పాటు కలెక్టర్‌కు వినతిపత్రాలు సైతం సమర్పించారు.
అందని నష్టపరిహారం..
బ్యారేజీ బ్యాక్‌వాటర్ ద్వారా వందలాది ఎకరాల పంటపొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ నష్టపరిహారం అందడం లేదు. ఐదేళ్లుగా ప్రతీ ఏడాది పెద్ద ఎత్తున పంట నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదని బాధిత రైతులు అంటున్నారు. పంటలు మునిగినపుడు అధికారులు గ్రామాల్లోకి వచ్చి పంట నష్టం లెక్కలు రాసుకొని ప్రభుత్వానికి నివేదించినప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి ముంపు ప్రాంత ప్రజలు, రైతులకు శాశ్వత పరిష్కారం చూపించాలని పలువురు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం..
లక్ష్మీపూర్ నుంచి గంగారం వరకు కరకట్ట నిర్మాణం, గతంలో నిర్మించిన కరకట్ట పునరుద్ధరణ పనుల కోసం రూ.50కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కరకట్ట నిర్మాణ పనులు చేపడుతాం. – రవిచంద్ర, ఇరిగేషన్ డీఈఈ
ఏటా మునుగుడే..
దామెరకుంట శివారులో నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ప్రతి ఏడాది వరి పంట సాగు చేస్తా. వరి ఎదిగే సమయానికి బ్యాక్‌వాటర్ పంటను నిండా ముంచేస్తుంది. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి. నష్టపోతున్నప్పటికీ తప్పక పంట సాగుచేయాల్సి వస్తుంది. బ్యాక్ వాటర్ సమస్య తీరితేనే మా పరిస్థితులు మారుతాయి. – రౌతు మల్లన్న, రైతు, గంగపురి
కౌలుకు తీసుకొని నష్టపోతున్నా..
నాకు స్వంత భూమి లేదు. వ్యవసాయమే నా కుటుంబానికి దిక్కు. దీంతో ఐదెకరాల చేను కౌలుకు తీసుకొని మూడేళ్లుగా సాగుచేస్తున్న. ప్రతి ఏడాది బ్యాక్‌వాటర్ పత్తిపంటను దెబ్బతీస్తుంది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు, కౌలు డబ్బులు కలుపుకొని రెండు, మూడు లక్షల వరకు అప్పు అవుతున్నా. – అంకయ్య, రైతు, గుండ్రాత్‌పల్లి
Comments
Please login to add a commentAdd a comment