నీట మునిగిన మోరంచపల్లి
భారీ వర్షాలు, వరదలు పలుచోట్ల తీవ్ర విషాదాన్ని నింపాయి. గత మూడు రోజుల్లో వాగులు, వరద నీటిలో పదుల సంఖ్యలో జనం గల్లంతుకాగా.. వారిలో కొందరి మృతదేహాలు గురు, శుక్రవారాల్లో బయటపడ్డాయి. దీనితో వారి కుటుంబాలన్నీ తీవ్ర విషాదంలో చిక్కుకున్నాయి. జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి వరకు 19 మంది మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన వారి సంఖ్య ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉందని స్థానికులు చెప్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయిలో జంపన్నవాగు వరదలో గల్లంతైన 15మందిలో ఎనిమిది మంది మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోంది.
భూపాలపల్లి జిల్లాలో హెలికాప్టర్ ద్వారా ఆహారం జార విడుస్తున్న ఐఏఎఫ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో గురువారం రాత్రి వరదలో గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్ష్మి, గంగిడి సరోజన గల్లంతయ్యారు. వారి కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు కూడా వారి ఆచూకీ దొరకలేదు.సంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రుప్ప గ్రామ పెద్ద చెరువులో కృష్ణ అనే యువకుడు, మెదక్ జిల్లా హవేలీ ఘన్‌పూర్‌లో పడమంచి నర్సింహులు, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాములు చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందారు.
ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్‌కు చెందిన పెండ్ర సతీశ్ (23) గురువారం రాత్రి మున్నేటి వరదలో గల్లంతుకాగా. శుక్రవారం మృతదేహం లభ్యమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంకు చెందిన ఎస్‌కే గాలీబ్ పాషా (33) ఈ నెల 26న భార్యతో గొడవ పడి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం తిప్పనపల్లి వద్ద వాగులో ఆయన మృతదేహం లభించింది.
భద్రాచలం వద్ద మహోగ్రంగా గోదావరి.. 53 అడుగులకు నీటిమట్టం
బుధవారం భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కుమ్మరిపాడులోని పాములేరు వాగులో కొట్టుకుపోయిన కుంజా సీత (60) మృతదేహం శుక్రవారం మామిళ్లగూడెం శివారులోని వాగులో బయటపడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వివిధ చోట్ల వాగుల్లో గల్లంతైన నలుగురు మరణించారు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి మొరంవాగులో రేకల కౌశిక్ (9), మోహన్ (40) కొట్టుకుపోయారు. ఆదిలాబాద్ జిల్లా సిరి కొండ మండలం వైపేట్‌కు చెందిన సంగం గంగాధర్ (45) స్థానిక వాగులో గల్లంతయ్యాడు.
భూపాలపల్లి అర్బన్: మొత్తం 285 ఇళ్లు.. అందులో నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి.. ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రుమట్టి.. చెల్లాచెదురుగా ఉన్న సామగ్రి.. బైక్‌లు, ఇతర వాహనాలు ఎక్కడున్నాయో తెలియదు.. తినటానికి తిండి లేదు.. తాగేందుకు నీరు లేదు.. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి.. సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్ జిల్లా మోరంచపల్లి గ్రామం బోరుమంటోంది. మరోవైపు గల్లంతైన నలుగురి ఆచూకీ దొరకక.. వారి కుటుంబాలు ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నాయి. గల్లంతైన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్షి్మ, గంగిడి సరోజనల ఆచూకీ కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.
మంథనిలో పొలాలను ముంచిన గోదావరి
ఏ ఆధారమూ లేని పరిస్థితిలో..
గురువారం తనను చుట్టేసిన మోరంచవాగు వరద ఉధృతికి మోరంచపల్లి గ్రామం సర్వం కోల్పోయింది. ఇళ్లలో సుమారు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు వరద నీరు చేరింది. ప్రతి ఇంట్లో బియ్యం, పప్పుల వంటి నిత్యావసరాల నుంచి టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎల్రక్టానిక్ పరికరాల దాకా వస్తువులన్నీ నీట మునిగిపోయాయి. కొన్ని వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గ్రామంలో మొత్తం 285 ఇళ్లు ఉండగా 4 ఇళ్లు పూర్తిగా, 281 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒండ్రు మట్టి, ఇసుక మేట, చెత్తాచెదారంతో నిండిపోయాయి. శుక్రవారం వరద తగ్గాక గ్రామస్తులు ఇళ్లలో ఒండ్రుమట్టిని ఎత్తిపోస్తూ, తడిసిన వస్తువులను ఆరబెట్టుకుంటూ కనిపించారు. వరద తాకిడికి కొన్ని ఇళ్ల పునాదులు కూడా కదలడం, ఇంటి గోడలు, ప్రహరీలు కూలిపోవడం ఆందోళనకరంగా మారింది.
అన్నీ కొట్టుకుపోయి..
మోరంచపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో కుటుంబ పోషణ నిమిత్తం గేదెలు, కోళ్లు పెంచుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయి పొలాలు, చెట్లపోదల్లో చిక్కుకున్నాయి. కొన్నింటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. మొత్తం 159 పశువులు, గేదెలు, 3 ఎద్దులు, 855 కోళ్లు, 3 బాతులు చనిపోయాయి. గ్రామ పరిసరాల్లో అక్కడక్కడా చనిపోయి ఉన్న గేదెలను అధికారులు శుక్రవారం జేసీబీల సహాయంతో గ్రామానికి దూరంగా తరలించి ఖననం చేశారు.
వరద ముంపులో వరంగల్
గ్రామస్తులకు భరోసా..
తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామాన్ని మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అధికారులు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డి రూ.10 లక్షలను గ్రామ ప్రజలకు ఆర్థిక సాయంగా అందించారు.
గల్లంతై.. కరెంటు తీగలపై వేలాడి..
మేడారం జంపన్నవాగులో గల్లంతైన యాచకుడి మృతదేహం శుక్రవారం వరద తగ్గిన తర్వాత ఇలా కరెంట్ తీగలకు చిక్కుకొని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని కరెంట్ తీగలపై నుంచి తొలగించి పంచనామా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment