వరద ముంపు నుంచి తప్పించుకునేందుకు మరోచోటికి బయలుదేరారు. వారిలో భార్యాభర్తలు, తండ్రీ కొడుకులు, బంధువులు ఉన్నారు. మధ్యలో వాగు పొంగుతుండటంతో.. ఒకరి చేతులు పట్టుకుని మరొకరుగా 15 మంది నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ప్రవాహం ధాటికి అంతా కొట్టుకుపోయారు. ఇందులో ఎనిమిది మంది మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగతావారి ఆచూకీ కూడా ఇంకా దొరకలేదు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో జరిగిన విషాదం ఇది.
కల్వర్టు ఉందనుకుని వెళ్తే..
భారీ వర్షాలతో గురువారం జంపన్నవాగు ఉప్పొంగి కొండాయి గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. దీనితో 15 మంది పక్కనే ఉన్న మల్యాలలో తలదాచుకునేందుకు బయలుదేరారు. ఆ రహదారిలో ఉన్న వాగుపై ఇటీవలే పైపులు వేసి కల్వర్టు నిర్మించారు. వరద తాకిడికి పైపులు, కల్వర్టు కొట్టుకుపోయాయి. అక్కడ వరద నిండుగా ప్రవహిస్తోంది. కానీ కల్వర్టు ఉందన్న ఉద్దేశంతో ఈ 15 మంది ఒకరినొకరు చేతులు పట్టుకుని దాటడం మొదలుపెట్టారు.
కొంతదూరం రాగానే వాగులో పడి కొట్టుకుపోయారు. వీరిలో శుక్రవారం కొండాయి గ్రామానికి చెందిన గిరిజన మహిళా దబ్బగట్ల సమ్మక్క(60), భార్యాభర్తలు ఎండీ రషీద్ (55), కరీమా(45), తండ్రీకొడుకులు ఎండీ షరీఫ్ (60), అజహర్ (25), భార్యాభర్తలు మజీద్‌ఖాన్ (65), లాల్‌బీ (60), మరో వ్యక్తి ఎస్‌కే మహబూబ్‌ఖాన్ (58) ఉన్నారు. వీరిలో సమ్మక్క మినహా మిగతా ఏడుగురు సమీప బంధువులే. గల్లంతైన మిగతా వారి కోసం బంధువులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment