telangana floods
-
వరద బాధితులకు రూ.2 కోట్ల విరాళం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం వ్యాక్సిన్ల తయారీ సంస్థ భారత్ బయోటెక్ రూ. 2 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదలతో అతలాకుతలమైన బాధితులను ఆదుకునేందకు ఇరు రాష్ట్రాల సీఎం వరద సహాయ నిధులకు చెరో రూ.1 కోటి చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లంది. భారీ వర్షపాతం విస్తృతంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వరద బాధితుల సహాయార్థం పలు సంస్థలు విరాళాలు అందిస్తున్నాయి. -
సహాయక చర్యలేం చేపట్టారు..?
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద నివారణ, బాధితులకు సహాయం, పరిహారం అందజేత లాంటి వివరాలపై, అలాగే భవిష్యత్‌లో వరదలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా శాశ్వత నివారణ చర్యలు ఏం చేపట్టారో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ 2020లో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజా వర్షాలు, వరదల నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలైంది. ఈ ఐఏపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ‘వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలి. వాతారణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా భవిష్యత్ చర్యలు చేపట్టాలి. బాధితులను గుర్తించి పునరావాసం సహా ఇతర సహాయక చర్యలు చేపట్టాలి. బాధితుల కోసం టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలి. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి..’ అని సూచించింది. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం ‘కేటాయించిన రూ.500 కోట్లు ఎలా పంపిణీ చేస్తారు? కడెం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? వర్షాలు, వరదలపై కేంద్రం ఎప్పుడు హెచ్చరించింది? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సహాయక చర్యలు ప్రారంభించింది?..’ అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ‘గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యల గురించి కూడా నివేదించాలి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రాంతవాసులు విషయంలో తీసుకున్న చర్యలు వివరించాలి. గోదావరి పరీవాహక జిల్లాల్లో ఏం సహాయక చర్యలు తీసుకున్నారో చెప్పాలి. వరద బాధితులకు కనీస సౌకర్యాల కల్పనకు తీసుకున్న చర్యలు వివరించాలి. వరద బాధిత కుటుంబాల్లోని వృద్ధులు, మహిళలు, పిల్లలకు ఆహారం, వసతి వంటి ఏర్పాట్లు ఏం చేశారో చెప్పాలి..’ అని ఆదేశించింది. ఈ మేరకు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని, భవిష్యత్ వరదలు దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ముందస్తు నిర్దిష్టమైన శాశ్వత ప్రణాళికపై మరో అఫిడవిట్ దాఖలు సూచించింది. జనం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదిక స్పందించాలని హితవు పలికింది. తాము అవసరమైతే గ్రామాల వారీగా కూడా పరిశీలన చేసి విచారణ చేస్తామని చెప్పింది. తదుపరి విచారణను 4వ తేదీకి వాయిదా వేసింది. నివేదికకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ‘క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకు, ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికకు పొంతన లేదు. ఏదో కంటి తుడుపు చర్యగా ప్రభుత్వం నివేదిక అందజేసినట్లు ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో విపత్తు ప్రమాదం పొంచి ఉందని గత నెల 19న కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం 28వ తేదీ వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకోని కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది..’ అని కోర్టుకు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోరంచలో ఐదుగురు చనిపోతే నివేదికలో కనీస ప్రస్తావన లేదని అన్నారు. కడెం ప్రాజెక్టు గేట్లు తెరుచుకోకపోవడంతో వరద నీరు ప్రాజెక్టు పైనుంచి పారిందని, ఒకవేళ ప్రాజెక్టు తెగితే దిగువనున్న 178 గ్రామాల్లోని ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రూ.500 కోట్లు కేటాయించాం.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ.. ‘ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సేవల్ని ప్రభుత్వం వినియోగిస్తోంది. బాధితుల కోసం అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రూ.500 కోట్లు కేటాయించాం. ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా పూర్తి వివరాలను నివేదిస్తాం’ అని పేర్కొన్నారు. భారీ వర్షాలతో తీరని నష్టం ప్రభుత్వ ప్రాథమిక నివేదిక ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలకు 240 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 6,443 ఇళ్లకు పాక్షిక నష్టం వాటిల్లింది. 1,59,960 ఎకరాల్లో పంటలు వరద బారిన పడ్డాయి. భూములు ముంపునకు గురికావడంతో 57,088 మంది రైతులు నష్టపోయారు. సోయాబీన్, చెరుకు, కందులు, మినుములు వంటి పంటలు నీటమునిగాయి. 190 నీటిపారుదల చెరువులకు గండ్లు పడ్డాయి. 168 రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. -
తప్పించుకుందామనుకున్నారు.. తనువులు చాలించారు!
వరద ముంపు నుంచి తప్పించుకునేందుకు మరోచోటికి బయలుదేరారు. వారిలో భార్యాభర్తలు, తండ్రీ కొడుకులు, బంధువులు ఉన్నారు. మధ్యలో వాగు పొంగుతుండటంతో.. ఒకరి చేతులు పట్టుకుని మరొకరుగా 15 మంది నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ప్రవాహం ధాటికి అంతా కొట్టుకుపోయారు. ఇందులో ఎనిమిది మంది మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగతావారి ఆచూకీ కూడా ఇంకా దొరకలేదు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో జరిగిన విషాదం ఇది. కల్వర్టు ఉందనుకుని వెళ్తే.. భారీ వర్షాలతో గురువారం జంపన్నవాగు ఉప్పొంగి కొండాయి గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. దీనితో 15 మంది పక్కనే ఉన్న మల్యాలలో తలదాచుకునేందుకు బయలుదేరారు. ఆ రహదారిలో ఉన్న వాగుపై ఇటీవలే పైపులు వేసి కల్వర్టు నిర్మించారు. వరద తాకిడికి పైపులు, కల్వర్టు కొట్టుకుపోయాయి. అక్కడ వరద నిండుగా ప్రవహిస్తోంది. కానీ కల్వర్టు ఉందన్న ఉద్దేశంతో ఈ 15 మంది ఒకరినొకరు చేతులు పట్టుకుని దాటడం మొదలుపెట్టారు. కొంతదూరం రాగానే వాగులో పడి కొట్టుకుపోయారు. వీరిలో శుక్రవారం కొండాయి గ్రామానికి చెందిన గిరిజన మహిళా దబ్బగట్ల సమ్మక్క(60), భార్యాభర్తలు ఎండీ రషీద్ (55), కరీమా(45), తండ్రీకొడుకులు ఎండీ షరీఫ్ (60), అజహర్ (25), భార్యాభర్తలు మజీద్‌ఖాన్ (65), లాల్‌బీ (60), మరో వ్యక్తి ఎస్కే మహబూబ్‌ఖాన్ (58) ఉన్నారు. వీరిలో సమ్మక్క మినహా మిగతా ఏడుగురు సమీప బంధువులే. గల్లంతైన మిగతా వారి కోసం బంధువులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. -
Telangana: 19 ప్రాణాలు.. 10 లక్షల ఎకరాలు.. వరదలతో అతలాకుతలం
భారీ వర్షాలు, వరదలు పలుచోట్ల తీవ్ర విషాదాన్ని నింపాయి. గత మూడు రోజుల్లో వాగులు, వరద నీటిలో పదుల సంఖ్యలో జనం గల్లంతుకాగా.. వారిలో కొందరి మృతదేహాలు గురు, శుక్రవారాల్లో బయటపడ్డాయి. దీనితో వారి కుటుంబాలన్నీ తీవ్ర విషాదంలో చిక్కుకున్నాయి. జిల్లాల నుంచి అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి వరకు 19 మంది మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన వారి సంఖ్య ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉందని స్థానికులు చెప్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయిలో జంపన్నవాగు వరదలో గల్లంతైన 15మందిలో ఎనిమిది మంది మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగతావారి కోసం గాలింపు కొనసాగుతోంది. భూపాలపల్లి జిల్లాలో హెలికాప్టర్ ద్వారా ఆహారం జార విడుస్తున్న ఐఏఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో గురువారం రాత్రి వరదలో గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్ష్మి, గంగిడి సరోజన గల్లంతయ్యారు. వారి కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు కూడా వారి ఆచూకీ దొరకలేదు.సంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రుప్ప గ్రామ పెద్ద చెరువులో కృష్ణ అనే యువకుడు, మెదక్ జిల్లా హవేలీ ఘన్‌పూర్‌లో పడమంచి నర్సింహులు, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాములు చెరువులో చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్‌కు చెందిన పెండ్ర సతీశ్ (23) గురువారం రాత్రి మున్నేటి వరదలో గల్లంతుకాగా. శుక్రవారం మృతదేహం లభ్యమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంకు చెందిన ఎస్కే గాలీబ్ పాషా (33) ఈ నెల 26న భార్యతో గొడవ పడి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం తిప్పనపల్లి వద్ద వాగులో ఆయన మృతదేహం లభించింది. భద్రాచలం వద్ద మహోగ్రంగా గోదావరి.. 53 అడుగులకు నీటిమట్టం బుధవారం భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కుమ్మరిపాడులోని పాములేరు వాగులో కొట్టుకుపోయిన కుంజా సీత (60) మృతదేహం శుక్రవారం మామిళ్లగూడెం శివారులోని వాగులో బయటపడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వివిధ చోట్ల వాగుల్లో గల్లంతైన నలుగురు మరణించారు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి మొరంవాగులో రేకల కౌశిక్ (9), మోహన్ (40) కొట్టుకుపోయారు. ఆదిలాబాద్ జిల్లా సిరి కొండ మండలం వైపేట్కు చెందిన సంగం గంగాధర్ (45) స్థానిక వాగులో గల్లంతయ్యాడు. భూపాలపల్లి అర్బన్: మొత్తం 285 ఇళ్లు.. అందులో నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి.. ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రుమట్టి.. చెల్లాచెదురుగా ఉన్న సామగ్రి.. బైక్‌లు, ఇతర వాహనాలు ఎక్కడున్నాయో తెలియదు.. తినటానికి తిండి లేదు.. తాగేందుకు నీరు లేదు.. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి.. సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్ జిల్లా మోరంచపల్లి గ్రామం బోరుమంటోంది. మరోవైపు గల్లంతైన నలుగురి ఆచూకీ దొరకక.. వారి కుటుంబాలు ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నాయి. గల్లంతైన గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ దంపతులు, గడ్డ మహలక్షి్మ, గంగిడి సరోజనల ఆచూకీ కోసం గ్రామస్తులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. మంథనిలో పొలాలను ముంచిన గోదావరి ఏ ఆధారమూ లేని పరిస్థితిలో.. గురువారం తనను చుట్టేసిన మోరంచవాగు వరద ఉధృతికి మోరంచపల్లి గ్రామం సర్వం కోల్పోయింది. ఇళ్లలో సుమారు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు వరద నీరు చేరింది. ప్రతి ఇంట్లో బియ్యం, పప్పుల వంటి నిత్యావసరాల నుంచి టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎల్రక్టానిక్ పరికరాల దాకా వస్తువులన్నీ నీట మునిగిపోయాయి. కొన్ని వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గ్రామంలో మొత్తం 285 ఇళ్లు ఉండగా 4 ఇళ్లు పూర్తిగా, 281 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒండ్రు మట్టి, ఇసుక మేట, చెత్తాచెదారంతో నిండిపోయాయి. శుక్రవారం వరద తగ్గాక గ్రామస్తులు ఇళ్లలో ఒండ్రుమట్టిని ఎత్తిపోస్తూ, తడిసిన వస్తువులను ఆరబెట్టుకుంటూ కనిపించారు. వరద తాకిడికి కొన్ని ఇళ్ల పునాదులు కూడా కదలడం, ఇంటి గోడలు, ప్రహరీలు కూలిపోవడం ఆందోళనకరంగా మారింది. అన్నీ కొట్టుకుపోయి.. మోరంచపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో కుటుంబ పోషణ నిమిత్తం గేదెలు, కోళ్లు పెంచుకుంటున్నారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయి పొలాలు, చెట్లపోదల్లో చిక్కుకున్నాయి. కొన్నింటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. మొత్తం 159 పశువులు, గేదెలు, 3 ఎద్దులు, 855 కోళ్లు, 3 బాతులు చనిపోయాయి. గ్రామ పరిసరాల్లో అక్కడక్కడా చనిపోయి ఉన్న గేదెలను అధికారులు శుక్రవారం జేసీబీల సహాయంతో గ్రామానికి దూరంగా తరలించి ఖననం చేశారు. వరద ముంపులో వరంగల్ గ్రామస్తులకు భరోసా.. తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామాన్ని మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అధికారులు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డి రూ.10 లక్షలను గ్రామ ప్రజలకు ఆర్థిక సాయంగా అందించారు. గల్లంతై.. కరెంటు తీగలపై వేలాడి.. మేడారం జంపన్నవాగులో గల్లంతైన యాచకుడి మృతదేహం శుక్రవారం వరద తగ్గిన తర్వాత ఇలా కరెంట్ తీగలకు చిక్కుకొని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని కరెంట్ తీగలపై నుంచి తొలగించి పంచనామా నిర్వహించారు. -
తప్పిన పెనుప్రమాదం
కరీంనగర్ (మానకొండూర్): మహిళా కూలీలు వరదలో కొట్టుకుపోగా గ్రామస్తులు కాపాడారు. ఈ ఘటన మండలంలోని అర్కండ్ల లోలెవల్ వంతెనపై సాయంత్రం జరిగింది. వివరాలు.. మండలంలోని అర్కండ్ల రైతుల వ్యవసాయ భూములు గ్రామానికి అవతలి వైపు ఉన్నాయి. మంగళవారం ఉదయం లోలెవల్ వంతెనపై నీటి ప్రవాహం తక్కువ ఉండడంతో వరినాట్లు వేసేందుకు మహిళలు వంతెనమీదుగా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని వెళ్లారు. సాయంత్రం నీటి ప్రవాహం పెరిగింది. గమనించని మహిళలు తిరిగి వస్తున్న క్రమంలో కొంత మంది బ్రిడ్జి దాటగా.. నేదురు సారమ్మ, నేదురు ఐలమ్మ, ఇజ్జిగిరి వనమ్మ, ఇజ్జిగిరి భాగ్యమ్మ, ఇజ్జిగిరి మొగిళి వాగులో నీటి ప్రమావాహంలో కొట్టుకుపోయారు. మిగతా కూలీలు కేకలు వేయడంతో పొలం పనులు ముగించి ఇంటికి వస్తున్న రైతులు, గ్రామస్తులు వెంటనే వరదలో కొట్టుకుపోతున్న ఐదుగురిని కాపాడి గట్టుకు చేర్చారు. అందరూ ప్రాణాలతో బయట పడడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. గట్టుకు చేరిన తర్వాత బాధితులు చచ్చి బతికామంటూ రోదించారు. -
ప్రధాని మోదీకి రేవంత్‌రెడ్డి లేఖ
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓ లేఖ రాశారు. తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఎన్డీఆర్ఎఫ్ విస్తరణ, రైతులు, మృతుల బంధువులకు ఆర్థిక పరిహారం ప్రకటించాలని కోరారు. అలాగే వీటితో పాటు రోడ్ల మరమ్మతులు, నిర్మాణం కోసం తక్షణ సహాయ ప్యాకేజీని రూ.2,000 కోట్లు విడుదల చేయాలని లేఖలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. Telangana Congress chief Revanth Reddy writes to PM Modi, requesting to declare Telangana floods a National Disaster, along with NDRF deployment, financial compensation to farmers & kin of deceased & an immediate relief package of Rs 2000cr for repair & construction of roads pic.twitter.com/jissNY9M1x — ANI (@ANI) July 16, 2022 -
రాజ్ నాథ్ భరోసాయిచ్చారు: ఈటల
-
రాజ్ నాథ్ భరోసాయిచ్చారు: ఈటల
న్యూఢిల్లీ: తమ రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించామని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసి ఆయన ఆదివారం ఢిల్లీలో రాజ్ నాథ్ ను కలిశారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... భారీ వర్షాలతో రూ.2,200 కోట్ల నష్టం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు చెప్పారు. 671 చెరువులకు గండ్లు పెడ్డాయని, భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపుతామని రాజ్ నాథ్ చెప్పారని అన్నారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసాయిచ్చారని చెప్పారు.