కరీంనగర్ (మానకొండూర్): మహిళా కూలీలు వరదలో కొట్టుకుపోగా గ్రామస్తులు కాపాడారు. ఈ ఘటన మండలంలోని అర్కండ్ల లోలెవల్ వంతెనపై సాయంత్రం జరిగింది. వివరాలు.. మండలంలోని అర్కండ్ల రైతుల వ్యవసాయ భూములు గ్రామానికి అవతలి వైపు ఉన్నాయి. మంగళవారం ఉదయం లోలెవల్ వంతెనపై నీటి ప్రవాహం తక్కువ ఉండడంతో వరినాట్లు వేసేందుకు మహిళలు వంతెనమీదుగా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని వెళ్లారు.
సాయంత్రం నీటి ప్రవాహం పెరిగింది. గమనించని మహిళలు తిరిగి వస్తున్న క్రమంలో కొంత మంది బ్రిడ్జి దాటగా.. నేదురు సారమ్మ, నేదురు ఐలమ్మ, ఇజ్జిగిరి వనమ్మ, ఇజ్జిగిరి భాగ్యమ్మ, ఇజ్జిగిరి మొగిళి వాగులో నీటి ప్రమావాహంలో కొట్టుకుపోయారు. మిగతా కూలీలు కేకలు వేయడంతో పొలం పనులు ముగించి ఇంటికి వస్తున్న రైతులు, గ్రామస్తులు వెంటనే వరదలో కొట్టుకుపోతున్న ఐదుగురిని కాపాడి గట్టుకు చేర్చారు. అందరూ ప్రాణాలతో బయట పడడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. గట్టుకు చేరిన తర్వాత బాధితులు చచ్చి బతికామంటూ రోదించారు.
Comments
Please login to add a commentAdd a comment