తెలంగాణలో వర్షాలు, వరదలు తగ్గాయి. బురద రాజకీయాలకు తెరలేచింది. వరద బాధితులను ఆదుకునే బాధ్యత మీదంటే, మీదనే స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిందించుకుంటున్నాయి. వర్షం, వరదల నష్టంపై రాష్ట్రం సమాచారం ఇవ్వకపోయినా మానవతా దృక్పథంతో కేంద్ర బృందాలను పంపించి ఆదుకునే చర్యలు చేపట్టామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించి కేంద్రమంత్రి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు.
వర్షం వరదలు సృష్టించిన భీభత్సంపై రాజకీయ దుమారం నెలకొంది. వరదలు సృష్టించిన బీభత్సంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. రాజకీయ పార్టీల నేతలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి బురద రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం వరదల ధాటికి 31 మంది ప్రాణాలు కోల్పోగా నలుగురి ఆచూకీ లభించకలేదు. ఆపార నష్టం వాటిల్లింది. వరద నష్టాన్ని పరిశీలించి బాధితులకు భరోసా కల్పించే పనిలో ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీల నేతలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ పరంగా సహాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
గ్రేటర్ వరంగల్, భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి పర్యటించి వర్షం వరదలు సృష్టించిన బీభత్సాన్ని పరిశీలించారు. పార్టీపరంగా నిత్యావసర సరకులు, దుప్పట్లు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద జాతీయ విపత్తు నిధులు రూ. 914 కోట్ల వరకు ఉన్నాయని, ప్రస్తుతం 2023-24 సంవత్సరానికి సంబంధించిన 197 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
యూసీ తీసుకువస్తే రాష్ట్రప్రభుత్వ అకౌంట్‌లో జమ చేస్తామన్నారు. వర్షం వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నివేదిక పంపకపోయినప్పటికి మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వమే కేంద్ర బృందాలను పంపించిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో వరద బాధితులకు ప్రతి కుటుంబానికి నాలుగు లక్షల చొప్పున ఇవ్వొచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల ఫసల్ బీమాను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇక నాలుగు నెలలు మాత్రమే ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పంటల పసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించి అవగాహన లేకుండా అనవసర వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రం పన్నుల రూపంలో చెల్లించే డబ్బులతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందనే విషయాన్ని గమనించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ యాక్ట్ కింద కేంద్రం నిధులు ఇచ్చి ఖర్చు చేయకుండా అనేక నిబంధనలు పెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే జాతీయ సమైక్యతకు ముప్పు వస్తుందని స్పష్టం చేశారు.
దయచేసి రాజకీయాలు మాట్లాడకుండా ఏం చేద్దామో చెప్పండని కోరారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుస్తుందని, నీళ్ళు, నిప్పును ఎవరు ఎదుర్కోలేరని తెలిపారు. వరద నష్టాన్ని అంచనా వేస్తున్నాం, వర్షం వరద నష్టంపై డిపిఆర్ తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. వరంగల్ మహానగరంలో రెండు రివర్ ఫ్రంట్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతలు మద్య విమర్శలు వరద బాధితులను ఆవేదనకు గురిచేస్తోంది. బురద రాజకీయాలు మానుకుని బాధితులను ఆదుకునే తక్షణం చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment