సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనతో ఎలాంటి మార్పు రాలేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ నేతల గాలి మాటలతో ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు పెద్ద తేడా ఏమీలేదన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘పోలింగ్ బూత్ కమిటీల ఎన్నిక ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలి. సాధారణ సభ్యత్వం తీసుకున్న ప్రతీ కార్యకర్తకు సమాచారం ఇచ్చిన తర్వాతే పోలింగ్ బూత్ కమిటీ వేయాలి. పోలింగ్ బూత్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి. నేతల వ్యక్తిగత ఇష్టాలకు తావులేకుండా అందరి ఆమోదంతో బూత్ కమిటీలు వేసుకోవాలి. క్రియాశీల సభ్యత్వం ఉన్నవారికే పార్టీ పదవులు. పార్టీ కోసం సమయం కేటాయించి పనిచేసే సమర్ధులకు కమిటీల్లో అవకాశం ఇవ్వాలి. 30 శాతం కొత్త వారికి పార్టీ మండల కమిటీల్లో ఛాన్స్ దక్కేలా చూడాలి.
రాష్ర్టంలో కాంగ్రెస్ పాలనతో ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పాలన సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు మధ్య తేడా ఏమీ లేదు. గాలి మాటలతో ప్రజలు విసిగిపోతున్నారు. వ్యక్తులను విమర్శించడమే రాజకీయం అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. రెండు పార్టీ నేతల మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. బాధ్యతారహితంగా ఇరు పార్టీల నేతలు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించింది. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా అబద్దపు ప్రచారం చేస్తున్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి ?
కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటలీకి గులాం. కిషన్ రెడ్డి ఎవరికి గులాం కాదు.. భారతీయులకు మాత్రమే గులాం. నా తెలంగాణను నిజాం నుంచి కాపాడిన గుజరాత్ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నేను గులాంనే. కాంగ్రెస్ నేతలు నకిలీ గాంధీలకు గులాంలు. వ్యక్తిగతంగా బురద చల్లే ప్రయత్నం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు చేస్తున్నాయి. తాత్కాలికంగా ప్రజలు వారికి జై కొట్టవచ్చు. ఎక్కువసార్లు ప్రజలను ఎవరు మోసం చేయలేరు. నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేసే వారికే ప్రజలు అండగా ఉంటారు. తెలంగాణలో ఉన్నంత దిగజారుడు రాజకీయాలు మరే రాష్ట్రంలో లేవు. మూడు వందల రోజులు పూర్తయినా.. హామీల అమలు చేయగలరా? అని ప్రశ్నించారు. అలాగే, బీఆర్‌ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment