సాక్షి, హైదరాబాద్: బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అయ్యే ప్రసక్తే లేదన్నారు కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీకి కేడర్‌కు ఉంది. తెలంగాణలో అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు.
కాగా, బండి సంజయ్ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘సీఎం రేవంత్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కేటీఆర్‌ను కచ్చితంగా జైలులో వేస్తారు. ఒకవేళ కేటీఆర్‌ను జైల్లో పెట్టకపోతే బీజేపీ నుంచి పెద్ద యుద్ధమే ఉంటుంది. బీఆర్‌ఎస్ పాలనను మా కేడర్ మరిచిపోదు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అనే ప్రసక్తే లేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీ కేడర్‌కు ఉంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తే బీజేపీనే ఇప్పించిదనే ప్రచారం చేస్తారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను యూరప్ దేశాలకు కాదు.. బంగ్లాదేశ్‌కు పంపించాలి.
మేడిగడ్డ మీద ఫిర్యాదు వచ్చింది. దీన్ని ఎన్డీఎస్‌ఏ పరిశీలించింది. సుంకిశాలపై కూడా ఫిర్యాదు వస్తే కచ్చితంగా కేంద్రం పరిశీలిస్తుంది. నిజాయితీగా పనిచేసే అధికారులకు కాంగ్రెస్ పోస్టింగ్ ఇవ్వడం లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారికే మళ్లీ పోస్టింగ్ ఇస్తున్నారు. నిజంగా బీఆర్‌ఎస్‌కు సపోర్ట్ చేసిన వాళ్ళే మంచి పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. అతి తక్కువ సమయంలోనే ప్రజల నుంచి కాంగ్రెస్ వ్యతిరేకత మూటకట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది. బీజేపీకి ప్రచారం చేసేది మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలే. కేంద్రమే నిధులు ఇస్తుందని మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తెలుసు. కేంద్రం నిధులు ఇస్తుందని హరీష్ రావు చెప్తున్నారు కాబట్టే.. ఆయన మంచి లీడర్ అన్నాను. ముచ్చర్ల చుట్టూ ఎన్ని భూములు కొట్టేశారో అందుకే ప్రభుత్వం అక్కడ ఫోర్త్ సిటీ అంటున్నారు. సొంత వ్యవహారాల కోసమే విదేశాలకు అప్పుడు బీఆర్‌ఎస్ పెద్దలు వెళ్ళారు.. ఇప్పుడు రేవంత్ వెళ్ళారు.. దీంట్లో తేడా ఏమీ లేదు.
రోహింగ్యాలకు సంబంధించి ఇప్పుడు ఒక అసోసియేషన్ ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో నేను మాట్లాడితే కేసీఆర్, కేటీఆర్ హేళన చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఎన్ని వక్ఫ్ భూములు కాపాడారు?. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చిన పోలింగ్ బూతు కమిటీలకు సన్మానం చేస్తాం. కరీంనగర్‌లో ఆగస్టు 15వ తేదీ తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారో తెలియదు. దీనిపై బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment