కేటీఆర్‌ ట్వీట్‌.. కిషన్‌రెడ్డి రియాక్షన్‌ | Union Minister Kishan Reddy Reaction To Ktr Tweet | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ ట్వీట్‌.. కిషన్‌రెడ్డి రియాక్షన్‌

Published Thu, Nov 28 2024 10:00 PM | Last Updated on Thu, Nov 28 2024 10:01 PM

Union Minister Kishan Reddy Reaction To Ktr Tweet

సాక్షి, హైదరాబాద్‌: మిడిమిడి జ్ఞానంతో కేటీఆర్‌ మాట్లాడుతున్నారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌ ట్వీట్‌పై ఆయన స్పందిస్తూ.. ‘‘గురివింద గింజ తరహాలో.. బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. బీఆర్ఎస్  పార్టీ నుంచి గెలిచిన వారికి కాంగ్రెస్ లోకి.. చేతి గుర్తుపై గెలిచిన వారికి గులాబీ పార్టీలోకి పంపించుకుని.. మంత్రిపదవులు తీసుకున్నప్పడు.. ఎవరు? ఎవరితో కలిసినట్లో.. కేటీఆర్ చెప్పగలరా?’’ అంటూ ప్రశ్నించారు.

‘‘మేం గిల్లినట్లు చేస్తాను.. మీరు ఏడ్చినట్లు చేయండన్న తెరచాటు ఒప్పందంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలనే.. ఇవాళ కాంగ్రెస్ కాపీ కొట్టి ఏడాదిగా  అనుసరిస్తున్న మాట వాస్తవం కాదా? కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ మొదలైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు, కేసుల విషయంలో పురోగతి లేకపోవడం.. ఎవరితో ఎవరు కలిసున్నారని చెబుతోంది?’’ అంటూ దుయ్యబట్టారు.

‘‘రైతులను మోసం చేయడంలో, నిరుద్యోగ యువతను నడిరోడ్డుపై నిలబెట్టడంలో, ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడంలో, హిందూ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చడంలో, కుటుంబ  పాలనను ప్రోత్సహించడంలో.. అవినీతిని పెంచి పోషించడంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల ఆలోచన, పరిపాలనలో సారూప్యతను చూస్తే ఎవరు, ఎవరి చేతుల్లో ఉన్నారో, ఎవరు సంగీతం వాయిస్తే..ఎవరు డాన్స్ చేస్తున్నారో ప్రజల​​కు ఈపాటికే అర్థమైపోయింది.

..బీజేపీ ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన పార్టీ. జాతీయవాదం, అంత్యోదయ వంటి నినాదాలతో పనిచేసే పార్టీ మాది. కుటుంబపాలన, అవినీతి వంటివి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు. అందుకే ఎవరికి ఎవరు దోస్తులనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్న సందర్భంలో.. ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండాలనుకునే మనస్తత్వాలకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారు.’’ అంటూ కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement