భారీగా ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ల ట్రాన్స్‌ఫర్‌.. బదిలీలకు ఈనెల 31 టార్గెట్‌.. | Massive Transfer Of ACP And Inspectors | Sakshi
Sakshi News home page

భారీగా ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ల ట్రాన్స్‌ఫర్‌.. బదిలీలకు ఈనెల 31 టార్గెట్‌..

Published Sun, Jul 23 2023 10:30 AM | Last Updated on Sun, Jul 23 2023 10:30 AM

Massive Transfer Of ACP And Inspectors - Sakshi

వరంగల్‌: పోలీసుశాఖలో బదిలీలు భారీగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి అనధికారికంగా ప్రారంభమైంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డీసీపీ స్థాయి అధికారి నుంచి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అధికారి వరకు ఎన్నికల ఎఫెక్ట్‌లో భాగంగా బదిలీలు జరుగుతున్నాయి.

జాతీయ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనరేట్ల కమిషనర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. దీనికి అనుగుణంగా ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించే పోలీస్‌ శాఖలో భారీగా మార్పులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం.

దానికి అనుగుణంగా ఎన్నికల నిబంధనలు వర్తించే పోలీస్‌ అధికారులను ఆయా నియోజకవర్గాలకు సాగనంపుతున్నారు. దీంతోపాటు ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాలతో పాటు ఏమేరకు ఎన్నికల విధుల్లో ఉపయోగపడుతారనే కోణంలో క్షుణంగా పరిశీలించిన తర్వాతనే పోస్టింగ్‌లకు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం.

ఉన్నతాధికారుల బదిలీ..

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పని చేసే ఇద్దరు డీసీపీలు పుల్లా కరుణాకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా, కర్రి పుష్పారెడ్డి తెలంగాణ కమాండ్‌ కంట్రోల్‌ విభాగం ఎస్పీగా బదిలీ అయ్యారు. వీరితో పాటు పరకాల, కాజీపేట, మామునూరు, క్రైం, ఏసీపీలు బదిలీ అయ్యారు. ఇన్‌స్పెక్టర్లు.. పరకాల, గీసుకొండతో పాటు కాజీపేట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు.

దీంతోపాటు చాలా కాలంగా ఖాళీగా ఉన్న హసన్‌పర్తి, కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్లకు ఖమ్మం, కొత్తగూడెం నుంచి వచ్చిన ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్‌లు కేటాయించారు. కోడ్‌ ఎఫెక్ట్‌లో భాగంగా సుబేదారిలోని రూరల్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్, భరోసా ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. గత నాలుగైదు రోజుల్లో వరుసగా సబ్‌ ఇన్‌స్పెక్టర్లను వివిధ పోలీస్‌స్టేషన్లకు బదిలీ చేస్తూ.. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ.రంగనా«థ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

 నేతల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు!

ఎన్నికల ముందు ప్రశాంతత కోసం కొంత మంది అధికారులు లూపులైన్ల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా.. మరికొంత మంది ఎన్నికల కోడ్‌ వర్తించని చాలామంది అధికారులు సిఫారసు లేఖల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసమయంలో నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏమేరకు ఉపయోగపడతారని వారి అనుచర గణంతో లెక్కలు వేసుకుంటున్నారు.

అధికారి పనితీరుతో పాటు సామాజిక అంశాన్ని ప్రధానంగా చూస్తున్నారు. ఒక్కో పోస్టింగ్‌ కోసం పదుల సంఖ్యలో అధికారులు క్యూ కట్టడం విశేషం. ఏసీపీ పోస్టుల కోసం కూడా అధికారులు ఒక్కో ప్రజాప్రతినిధిని పలుమార్లు కలుస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కొంత మంది అధికారులు వారి పీరియడ్‌ పూర్తి కాకపోయినప్పటికీ పోస్టింగ్‌ ఉంటుందో? ఉడుతుందో.. తెలియని అయోమయ స్థితిలో ఉద్యోగం నెట్టుకొస్తున్నారు.

వరంగల్‌ సబ్‌ డివిజన్‌లో మిల్స్‌కాలనీ, ఇంతేజార్‌గంజ్‌ వర్ధన్నపేట, ధర్మసాగర్, కమలాపూర్, నర్సంపేట, రఘునా«థపల్లి, నర్సంపేట రూరల్, నర్మెట్ట పోలీస్‌స్టేషన్లకు కొత్త అధికారులు రానున్నారు. ఈపోస్టింగ్‌ల కోసం ఇప్పటికే చాలా మంది అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి లెటర్లు పోలీస్‌బాస్‌కు అందించినట్లు సమాచారం. ఇందులో కొంత మందికి ఎలక్షన్‌ ఎఫెక్ట్‌ ఉండగా.. మరికొంత మంది ప్రవర్తన సరిగ్గా లేక మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. 

అరెస్ట్‌లకు రంగం సిద్ధం!

పోలీసు అధికారుల లెక్కల ప్రకారం వివిధ కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న సుమారు 180 మంది నిందితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీరిని అరెస్ట్‌ చేయడానికి ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఎస్‌హెచ్‌ఓలకు నిర్ధిష్టమైన ఆదేశాలు అందాయి.

ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నిందితులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపనున్నారు. దీంతో పాటు ఆయా పోలింగ్‌స్టేషన్ల వారీగా మాజీలతో పాటు గతంలో జరిగిన ఎన్నికల్లో ఇబ్బదులు సృష్టించిన వ్యక్తుల జాబితాలు కూడా ఆయా పోలీస్‌స్టేషన్లలో సిద్ధంగా ఉన్నాయి.

తుపాకుల జాబితా రెడీ..

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో తుపాకుల లైసెన్స్‌లు 230 ఉన్నాయి. ప్రస్తుతం తుపాకుల లైసెన్స్‌ కలిగిన వ్యక్తులు వివిధ గొడవల్లో చిక్కుకున్న, కేసులు నమోదైన వారి లైసెన్స్‌లు రద్దు చేశారు. దీంతో కమిషనరేట్‌ పరిధిలో 180 వరకు లైసెన్స్‌ తుపాకులున్నాయి. ఎన్నికల ముందు వీటిని ఆయా పోలీస్‌ స్టేషన్లలో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. తుపాకుల లెక్కలను సైతం పోలీసు అధికారులు సిద్ధం చేసి ఉంచారు.

ఈనెల 31 వరకు  ప్రక్రియ పూర్తి చేస్తాం..

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈనెల 31వ తేదీ వరకు ఎన్నికల బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తాం. సొంత జిల్లా, సొంత నియోజవర్గం ఉన్న అధికారులతో పాటు చివరి నాలుగేళ్లలో మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసే అధికారులను నిబంధనల ప్రకారం బదిలీ చేస్తాం. ప్రస్తుతం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పని చేస్తున్న అధికారులను రెవెన్యూ జిల్లాను ప్రతిపాదికన బదిలీలు చేపడుతున్నాం. ఏసీబీ, క్రిమినల్‌ కేసులు ఉన్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతాం. – ఏవీ. రంగన్నాథ్, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement