
ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు
కాటారం: ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలో ఆదివారం పర్యటించిన మంత్రి శ్రీధర్‌బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షలతో నిర్మించిన కాటారం గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి నుంచి గ్రామాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రోడ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని తెలిపారు. అనంతరం కాటారం సబ్ డివిజన్‌లోని పలు మండలాలకు సంబంధించిన వైకుంఠరథాలను మంత్రి ప్రారంభించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.3,12,64,235 చెక్కును సభ్యులకు అందజేశారు. 243 మంది లబ్ధిదారులకు సంబంధించిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ధన్వాడలో రూ. కోటి వ్యయంతో నిర్మించిన అదనపు ఉప విద్యుత్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ధన్వాడ ప్రభుత్వ పాఠశాలకు వంద డెస్క్ బెంచీలను మంత్రి అందజేశారు.
సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకం..
నిరుపేద ప్రజలు సైతం సన్న బియ్యం అన్నం తినాలని సంకల్పించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సన్న బియ్యం పంపిణీ నిర్ణయం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం మండల పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్‌బాబు మండలంలోని కొత్తపల్లి తండాకు చెందిన వాంకుతోడు సమ్మక్క అనే లబ్ధిదారురాలు ఇంట్లో కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి మంత్రి భోజనం చేశారు. మంత్రి, అధికారులు తండావాసులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవారు సంతోషంగా ఉండాలనే భావనతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు వెంట డీపీఓ నారాయణ, డీఆర్‌డీఓ నరేశ్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, తదితరులు ఉన్నారు.
గ్రామాల్లో మౌలిక వసతుల
కల్పనకు కృషి
సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
శ్రీధర్‌బాబు

ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు