
భరోసా నింపని ఉపాధి..
కాటారం: గ్రామాల్లో వలసలు నివారించి పేదలకు ఉన్న ఊరిలోనే పని చూపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఉపాధిహామీ పథకం నిరుపేద కూలీలకు భరోసా నింపడం లేదు. మూడేళ్లుగా వచ్చిన నూతన మార్పులతో పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారిపోయింది. క్షేత్రస్థాయిలో పనులు చేసిన కూలీలకు రోజుల తరబడి వేతనాలు అందకపోవడంతో పాటు పనులకు వద్దామని అనుకునే అర్హులైన కూలీలకు జాబ్‌కార్డుల మంజూరు నిలిచిపోయింది. దీంతో ఇటు పనిచేసిన కూలీలు, అటు ఉపాధి పొందాలని అనుకునే కూలీలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం పనులు నిర్వహించినప్పటికీ కూలీలకు కూలి గిట్టుబాటు అవడం లేదు. ఇలా అనేక లోటుపాట్లతో ఉపాధిహామీ పథకంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలుగా నిలిచిన ఉపాధి వేతనాలు..
జిల్లాలో 2.41లక్షల మంది కూలీలు ఉండగా.. 1.31లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామాల్లోని రైతుల పొలాల్లో ఫాంఫండ్‌ల నిర్మాణం, నర్సరీల నిర్వహణ, బ్యాగ్ ఫిల్లింగ్, మొక్కల సంరక్షణ చర్యల పనులను కూలీలు చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించి గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి కూలీలకు ఇప్పటివరకు కూలి డబ్బులు అందలేదు. ఒక్కో కూలీకి సగటున రూ.1500నుంచి రూ.2వేల వరకు కూలి డబ్బులు అందాల్సి ఉంది. కూలి డబ్బుల చెల్లింపు జాప్యంలో అధికారులకు సైతం పూర్తి సమాచారం లేదు. కూలీలకు వేతనాలు ఎప్పుడు జమ అవుతాయనే స్పష్టత కరువైంది. అసలే వేసవికాలం కావడంతో కూలీలు ఇతర పనులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కూలి డబ్బులు వస్తేనే వారి కుటుంబ పోషణ ముందుకు సాగుతోంది. రోజుల తరబడి కూలి డబ్బులు చేతికి రాక ఉపాధి కూలీలు తమ పూట గడుపుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. కొంతమంది కూలీల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు అధికారులు చెప్పుకొస్తున్నప్పటికీ కూలీల నుంచి మాత్రం స్పష్టత రావడం లేదు.
నూతన జాబ్‌కార్డుల ఊసే లేదు..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కారణంగా ఉపాధిహామీ పథకానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. కనీసం 20రోజుల పనిదినాలు చేసి ఉండాలనే నిబంధనతో కూలీలు అధికంగా ఉపాధి పనులవైపు మొగ్గు చూపుతున్నారు. జాబ్‌కార్డు కలిగిన కుటుంబంలో ఒక్కరికే అవకాశం ఉండటంతో నూతన జాబ్‌కార్డులు, వేరుగా జాబ్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాలతో కొంతకాలంగా జిల్లాలో నూతన జాబ్‌కార్డుల మంజూరు నిలిచిపోయింది. రెండేళ్ల క్రితం జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఇప్పటికీ జాబ్‌కార్డు మంజూరు కాలేదని సమాచారం. జాబ్‌కార్డులో పేరు మార్పు, తొలగింపు లాంటి సవరణలకు సైతం అవకాశం లేకుండా పోయింది. దీంతో అర్హులైన నిరుపేద కూలీలు సైతం ఉపాధి పనులకు దూరమవుతున్నారు. ఇప్పటివరకు నూతన జాబ్‌కార్డుల కోసం సుమారు 200పైచిలుకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
త్వరలో ఖాతాల్లో జమ అవుతాయి
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో మూడు నెలలకు సంబంధించిన ఉపాధి కూలీల వేతనాలు నిలిచిపోయాయి. పనులు చేసిన కూలీల ఖాతాల్లో త్వరలోనే కూలి డబ్బులు జమవుతాయి. ఆందోళన చెందొద్దు. ప్రభుత్వ ఆదేశాలతో నూతన జాబ్‌కార్డుల జారీ తాత్కాలికంగా నిలిచిపోయింది. అనుమతి రాగానే నూతన కార్డులు మంజూరు చేస్తాం.
– నరేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి
2,41,667
1,09,843
244
12
గ్రామపంచాయతీలు
జాబ్‌కార్డుల సంఖ్య
మూడు నెలలుగా కూలీలకు అందని డబ్బులు
మంజూరుకు నోచుకోని నూతన జాబ్‌కార్డులు
ఆందోళనలో ఉపాధిహామీ కూలీలు

భరోసా నింపని ఉపాధి..

భరోసా నింపని ఉపాధి..

భరోసా నింపని ఉపాధి..