
భూపాలపల్లి జిల్లా: తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగాన్ని ప్రజలు ఊడగొడితే వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, సమ్మక్క సారలమ్మలపై ఓట్టేసి వాగ్దానం చేస్తున్నానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు నియోజకవర్గానికి వచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధాటిగా ప్రసంగించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. ములుగు నియోజకవర్గంలో మేడారం జాతరపై చిన్న చూపు చూసిన కేసీఆర్‌కు ఓట్ల కోసం ములుగులో అడుగు పెట్టేందుకు మాత్రం సమయం దొరుకుతుందా అని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం సీతక్క అడవుల నుంచి ప్రజల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రజా తెలంగాణ కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
గిరిజనులకు, ఇతర బలహీనవర్గాలకు ఇండ్లు కట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రూ.6 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమవుతోందని అన్నారు. పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ కాలంలో వందల మంది చావుకు కారణమైన టీఆర్‌ఎస్ ఇప్పటి వరకు ఎంత మందికి న్యాయం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చుపెట్టి తమాషా చూస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు, మైనార్టీలకు12 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి మాట తప్పిన కేసీఆర్‌కు బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఢిల్లీలో మోదీ పాలన తెలంగాణ కేడీ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గిరిజనులపై టీఆర్‌ఎస్ నాయకులు చేసిన అఘాయిత్యాలను రేవంత్ రెడ్డి వివరిస్తుండగా పక్కనే కాంగ్రెస్ ములుగు అభ్యర్థి సీతక్క కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment