సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి కార్యక్రమ అమలు, పర్యవేక్షణ విషయంలో ఉన్నతాధికారులు, పంచాయతీ సిబ్బంది మధ్య పొసగడంలేదు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కొందరు జిల్లా కలెక్టర్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఇబ్బందిగా మారాయని పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఉదయం 6 గంటలకే గ్రామాల్లో పర్యటించాలని, విధిగా వాట్సాప్ కాల్ చేయాలని, ప్రతి 2 గంటలకు వీడియో ఫుటేజీని పోస్ట్ చేయా లనే షరతులు విధించడం పట్ల ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. వర్క్ టు రూల్ నిబంధనకు విరుద్ధంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేయాలని ఒత్తిడి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కామారెడ్డి మొదలు భూపాలపల్లి వరకు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే రెండు విడతల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాల్వల్లో పూడిక తీత, పాత బావులు, బోరుబావుల పూడ్చివేత తదితర చర్యలు తీసుకోవాల ని ప్రభుత్వం నిర్దేశించింది. ఆ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని గ్రామ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులను ఆదేశించింది. పల్లె ప్రగతి పనుల్లో వేగం పెంచేందుకు కలెక్టర్లు/అదనపు కలెక్టర్లు కొందరు.. గ్రామ కార్యదర్శులు ప్రభాతవేళ పంచాయతీల్లో సందర్శించాలని ఆదేశించారు.
ఉదయం 8 గంటలకు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఏ వీధిలో పర్యటిస్తున్నారో తెలపాలని కామారెడ్డి కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును 30 సెకన్ల నిడివి గల వీడియో చిత్రీకరించి.. ప్రతి 2 గంటల కోసారి పోస్టు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ నిర్దేశించారు. ఉదయం 6 మొదలు సాయంత్రం 6 గంటలకు చివరిసారిగా ఈ వీడియో పోస్టు చేయాలన్నారు. పల్లె నిద్రలు చేయాలని, గ్రామస్తులతో మమేకం కావాలని మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయం పట్ల ఉద్యోగసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
అవమానించేలా చర్యలు
పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సమర్థనీయం కాదు. 12 గంటలపాటు విధులు నిర్వర్తించాలనే ఆదేశాలు ఉపసంహరించుకోవాలి. అత్యవసరవేళల్లో పనులు చేసేందుకు అభ్యంతరంలేదు. పారిశుద్ధ్య నిర్వహణ, పల్లె ప్రగతి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కానీ, తమను అవమాన పరిచేలా వీడియో కాల్, ఫుటేజీ పంపాలనడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వర్క్ టు రూల్ పాటిస్తామని ఆయన హెచ్చరించారు. – మధుసూదన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment