ఆదివాసీ పోరాటాల వారసత్వానికి ప్రతీకగా ఆవిర్భవించిన యోధుడు బిర్సాముండా. ఆదివాసీలపై జరుగుతున్న అణచివేతను చిన్నతనం నుంచీ చూసిన బిర్సాముండా అగ్రవర్ణాల దోపిడీపై గళం విప్పాడు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై సమరశంఖం పూరించాడు. ఆదివాసీల ప్రాథమిక హక్కుల కోసం, జల్, జంగ్, జమీన్ కోసం విల్లంబులు అందుకుని పోరుబాటపట్టాడు. ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నమైన ఆదివాసీ రాజ్యాలను చూసి తట్టుకోలేకపోయిన బిర్సాముండా నల్లదొరలతోపాటు, తెల్ల దొరలపైనా ఆయుధాలు ఎక్కుపెట్టాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సాగిన ‘మిలినేరియన్’ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. బిర్సాను దొంగచాటుగా బంధించిన తెల్లదొరలు 1900 జూన్ 9న రాంచీ జైలులో హతమార్చారు. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో బిర్సాముండా పోరాటం ఒక ప్రధాన ఘట్టం.
నేటి పాలకవర్గ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా ఆదివాసీ సమాజాన్ని అంతం చేస్తోంది. పరి శ్రమలు, ప్రాజెక్ట్‌ల పేరు మీదు లక్షలాది ఆదివాసీ కుటుంబాలవారు నిర్వాసితులయ్యారు. దేశం లోని 570 గిరిజన తెగలలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ లెక్కల ప్రకా రం 75వరకు తెగలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వీటిలో 19 తెగల ఆదివాసీ జనాభా వెయ్యికంటే తక్కువ. ఈ తెగలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో అగ్రకులాలను ఎస్టీ జాబితాలో కలపాలని ప్రభుత్వం యత్నిస్తోంది. ఇప్పటికే లంబా డీలు ఆదివాసీల రిజర్వేషన్లను దోచుకున్నారు. ఇందుకు దళారీ పాలకవర్గ విధానాలే కారణం. ఈ నేపథ్యంలో బిర్సాముండా పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుని, ఆదివాసీలను చైతన్యపరిచి, వారి ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత మేధావులు, విద్యావంతులపై ఉంది.
(నేడు బిర్సాముండా జయంతి)
– ఊకే రామకృష్ణ దొర, ఆదివాసీ రచయితల సంఘం
Comments
Please login to add a commentAdd a comment