మన్యంలో సెగ | Maoist Celebrations in next month | Sakshi
Sakshi News home page

మన్యంలో సెగ

Published Sun, Nov 23 2014 1:15 AM | Last Updated on Tue, Oct 9 2018 2:49 PM

Maoist Celebrations in next month

కొయ్యూరు: వచ్చే నెల మొదటివారంలో మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభం కానున్నాయనే సమాచారం మన్యంలో అలజడి రేపుతోంది. ఇటీవల వీరవరం ఘటనలో డివిజన్‌కమిటీ(డీసీ) శరత్‌ను కోల్పోవడాన్ని జీర్ణించుకోలేని మావోయిస్టులు ఏం చేస్తారోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తప్పులు చేసిన వారిని గుర్తించామని, వారందరికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించడంతో మరింత భయపడుతున్నారు. వీరవరం సంఘటన తర్వాత కొందరు గిరిజనులు చింతపల్లిలో ఆందోళన చేసి ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రధమశ్రేణీ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం కూడా అందజేశారు.

మూడు రోజుల కిందట  హైదరాబాద్‌లో పౌరహక్కుల సంఘం నేత వరవరరావు ఇంటి ఎదుట ఆందోళన చేశారు. సాధారణంగా వారోత్సవాలు విధ్వంసాలకు చిరునామాగా మారుతాయి. పోలీసులు లేదా రాజకీయ నేతలపై మావోయిస్టులు గురిపెడతారు. చిన్న స్వ్కాడ్‌లు లేదా యాక్షన్ బృందాలను రంగంలోకి దించుతారు. వారితోనే నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే విధంగా చేస్తారు. 2000లో ఆదిలాబాద్‌జిల్లా కొయ్యూరు ఎన్‌కౌంటర్లో నరేశ్, శ్యామ్,అది అనబడే ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లో మరణించారు. దీంతో అప్పట్లో పీఎల్‌జీఏను ఏర్పాటు చేశారు. దళాల స్థానంలో ఏరియా కమిటీలను  ఏర్పాటు చేశారు.

వ్యూహాలను పూర్తిగా మార్చారు. శత్రువును దెబ్బతీయడం మొదలుపెట్టారు. 2001లో నిర్వహించిన మొదటి పీఎల్‌జీఏ వారోత్సవాల్లో మావోయిస్టులు కొయ్యూరు,గూడెంకొత్తవీధిలో లెక్కలేనన్ని విధ్వంసాలు చేశారు. అప్పటి నుంచి ప్రతీ పీఎల్‌జీఏ వారోత్సవాలకు మావోయిస్టులు విధ్వంసం చేయడం రివాజుగా మారింది.వ ారోత్సవాలు ముగిసేంతవరకు పోలీసులు మన్యాన్ని జల్లెడపడతారు. రాజకీయ నేతలు లేదా మావోయిస్టుల హిట్ జాభితాలో ఉన్నవారెవరు కూడా సొంత గ్రామాల్లో ఉండే అవకాశం ఉండదు. ఈ సారి పీఎల్‌జీఏ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మావోయిస్టులు ఈసారి చెలరేగే అవకాశలు కనిపిస్తున్నాయి. దీనిపై నిఘా వర్గాలు ముందుగానే అనుమానించి అప్రమత్తం చేస్తున్నాయి.వీరవరం సంఘటన తరువాత పోలీసులు మావోయిస్టుల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. పోలీసుల ముసుగులోనే గిరిజనులు మావోయిస్టులను చంపారని మావోయిస్టులు ఆరోపిస్తుంటే  మావోయిస్టులపై నమ్మకాన్ని కోల్పోయిన గిరిజనం తిరుగుబాటు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు మావోయిస్టులపై అభ్యుదయ గిరిజన యువత  పేరిట కరపత్రాలను అన్ని మండలాల్లోను అంటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement